ప్రజాశక్తి-విజయవాడ : మీడియా స్వేచ్ఛపై కేంద్ర ప్రభుత్వ దాడికి నిరసనగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్(ఏపీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కమిటీ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేయాలని పిలుపు ఇచ్చింది. దీనిలో భాగంగా శుక్రవారం(17-02-2023న) ఉదయం 10.30 గంటలకు విజయవాడ అలంకార్ సెంటరులోని ధర్నా చౌక్‌లో ఏపీడబ్ల్యూజేఎఫ్ విజయవాడ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించనున్నారని కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు సాంబశివరావు, ఎంబి నాథన్ పత్రికా ప్రకటనను విడుదల చేశారు. 2002లో గుజరాత్ మత మారణహోమంపై బ్రిటీష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ (బిబిసి) ఓ డాక్యుమెంటరీని రూపొందించి ప్రసారం చేసినందుకుగాను కేంద్ర ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పూనుకుందని పేర్కొన్నారు. ఇప్పటికే బిబిసి డాక్యుమెంట్ లింకులను సామాజిక మాధ్యమాల్లో పెట్టడాన్ని నిషేధించిన ప్రభుత్వం ఇప్పుడు నేరుగా ఆ వార్తా ఛానల్ కార్యాలయాలపైనే దాడులకు దిగిందని తెలిపారు. ఢిల్లీ, ముంబయిల్లోని బిబిసి కార్యాలయాల్లో ఆదాయ పన్ను అధికారులు సెర్చ్/సర్వే పేరుతో దాడులకు దిగడం ద్వారా పత్రికా స్వేచ్ఛపై ప్రత్యక్షంగానే దాడులకు పూనుకుందన్నారు. ఈ నేపథ్యంలో ధర్నా చేపట్టనున్నామని తెలిపారు. అనంతరం రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్‌కు జర్నలిస్టుల ప్రతినిధుల ఆధ్వర్యాన వినతిపత్రం సమర్పణ జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాల్లో జర్నలిస్టులంతా పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరారు. అలాగే ప్రజాతంత్రవాదులు, వివిధ రాజకీయ, ప్రజా సంఘాల నేతలు కూడా ఈ ధర్నాలో పాల్గొని భావ ప్రకటనా స్వేచ్ఛపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపడాన్ని ఖండిస్తూ, జర్నలిస్టులకు సంఘీభావం తెలపాలని కోరారు.










