
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విద్యుత్ పంపిణీ సంస్థలు 2023-24 ఆర్ధిక సంవత్సరానికి ప్రతిపాదించిన ఆదాయ అవసరాలు, రిటైల్ ధరలపై గురువారం ప్రజాభిప్రాయ సేకరణ జరగనుంది. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఈ నెల 21 వరకు ఆన్‌లైన్‌లో జరగనుంది. ఇఆర్‌సి చైర్మన్ జస్టిస్ సివి నాగార్జున రెడ్డి అధ్యక్షతన ఎపిఇపిడిసిఎల్ కార్యాలయం నుంచి ఈ కార్యక్రమం జరగనుంది. ఇపిడిసిఎల్, ఎస్‌పిడిసిఎల్, సిపిడిసిఎల్ మూడు డిస్కంలు 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.52,590 కోట్లు అవసరమని ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఇందులో రూ.13,489కోట్లు లోటుగా డిస్కంలు పొందుపరిచాయి. ఫెర్రో ఎల్లార్సు ఇతర విద్యుత్ అధికంగా వాడే పరిశ్రమలపై రూ.697 కోట్లు చార్జీలు పెంచుతామని డిస్కంలు ప్రతిపాదించాయి. మిగిలిన ఏ రంగం వినియోగదారులపై అదనపు భారాలను డిస్కంలు ప్రతిపాదించలేదు. అయితే రూ.12,792 కోట్ల భారీ లోటును ఏ విధంగా పూడ్చుకుంటాయో స్పష్టతను ఇవ్వలేదు. మూడు రోజుల పాటు ప్రజాభిప్రాయ సేకరణలో వచ్చిన అంశాలను పరిశీలించాక ఎపిఇఆర్‌సి మార్చి 31లోపు విద్యుత్ టారిఫ్ ప్రకటిస్తుంది. ఈ టారిఫ్ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది.