Dec 03,2020 07:54

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తాజాగా 'ఉపా' (చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధ చట్టం) కింద మానవ హక్కుల వేదిక నాయకులను, రచయితలను నిర్బంధానికి గురి చేయడం జగన్‌ ప్రభుత్వపు పెరుగుతున్న నిరంకుశ పోకడలను సూచిస్తోంది. గతంలో జాతీయ స్థాయిలో జరిగే నిరసన సమ్మెల సందర్భంగా ముందస్తు అరెస్టులు పెద్దగా జరిగినట్టు దాఖలాలు లేవు. కాని ఇప్పుడు ముఖ్యమంత్రి ఏ జిల్లాలో, ఏ సందర్భంగా పర్యటించినా అక్కడ వామపక్ష పార్టీల, ప్రజా సంఘాల నేతల ముందస్తు గృహ నిర్బంధం పరిపాటి అయింది. 12 సంవత్సరాల క్రితం జరిగిన వాకపల్లి ఘటనలో బాధితులకు అండగా ఉన్నారని మానవ హక్కుల వేదిక నాయకులు వి.ఎస్‌.కృష్ణ పైన, 74 సంవత్సరాల రచయిత, న్యాయవాది, ఎ.పి. పౌర హక్కుల నేత టి.శ్రీరామమూర్తి తదితరులపై 'ఉపా' ప్రయోగించడం ప్రజాస్వామ్య వాదులందరూ తీవ్రంగా ఖండించాల్సిన విషయం. ఇప్పటికే బిజెపి పాలిత రాష్ట్రాలలో ఉద్యమకారుల పైన, పాత్రికేయుల పైన, తమను విమర్శించేవారి పైన విచ్చలవిడిగా 'ఉపా' ప్రయోగం జరుగుతోంది. ఆ ప్రభుత్వాల సరసన నిలిచేందుకే జగన్‌ ప్రభుత్వం తొందర పడుతున్నట్టు కనపడుతోంది.
జాతీయ నేర రికార్డుల బ్యూరో సమాచారం ప్రకారం 2019లో 'ఉపా' కింద 1226 కేసులు నమోదయ్యాయి. 2016తో పోల్చితే ఇది 33 శాతం పెరుగుదలను సూచిస్తోంది. దేశద్రోహం కేసులు కూడా ఏకంగా 165 శాతం పెరిగాయి. 2016లో 35 కేసులు నమోదైతే 2019లో 93 నమోదయ్యాయి. దేశంలో సంక్షోభం పెరుగుతున్నకొద్దీ, ప్రజానీకపు సమస్యలు తీవ్రమౌతున్నకొద్దీ వాటిని పరిష్కరించే వైపు అడుగులు పడడం లేదు కాని ప్రశ్నించే వారందరిపైనా నిర్బంధంతో విరుచుకుపడడం పెరుగుతోంది.
ఇంతకీ చట్టవ్యతిరేక కార్యకలాపాలు అంటే ఏమిటి? 'ఉపా' చట్టం ప్రకారం
(అ) ఈ దేశంలోని ఏ భాగమైనా విడిపోవాలని వాదించడం, అటువంటి వాదనను బలపరచడం, అలా విడిపోవాలన్న అంశంపై రెచ్చగొట్టే విధంగా వ్యవహరించడం,
(ఆ) ఏ భూభాగం పైన అయినా మన దేశ సార్వభౌమాధికారాన్ని వ్యతిరేకించడం, లేదా ప్రశ్నించడం, అటువంటి వివాదాలలో ఇతర దేశాల వాదనలను సమర్ధించడం,
(ఇ) దేశ సమగ్రతను విచ్ఛిన్నం చేసే విధంగా వ్యవహరించడం
చట్ట వ్యతిరేక కార్యకలాపాలుగా పరిగణింపబడతాయి.
ఈ వివరణ ప్రకారం చూస్తే హక్కుల నేతలపై, పాత్రికేయులపై 'ఉపా' బనాయించడం అర్ధరహితం కాదా? వాకపల్లిలో స్పెషల్‌ పోలీసుల అకృత్యాలకు, అత్యాచారాలకు గురైన గిరిజన మహిళలకు అండగా నిలిచి, వారికి చట్టపరంగా ఉన్న హక్కులను తెలియజెప్పి న్యాయ పోరాటంలో వారికి సహకరించడం నేరమా? ఇది మన దేశ సమగ్రతకు భంగకరమైన కార్యకలాపమా? మన సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించే చర్యా?
తెలంగాణ బిజెపి ఎం.పి బండి సంజరు తమ పార్టీ గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ ఎన్నికలలో గెలిస్తే పాత బస్తీ మీద సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేపడతామని ప్రకటించారు. శత్రువుల భూభాగం మీద చేసే మెరుపు దాడిని సర్జికల్‌ స్ట్రైక్‌ అంటారు. మరి పాత బస్తీని శత్రువుల భూభాగంగా పరిగణించిన బండి సంజరు మీద 'ఉపా' చట్టం ప్రకారం కేసు పెట్టాలి కదా? అనేకమంది హిందూత్వ నేతలు మైనారిటీలపై విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రసంగాలు, ప్రకటనలు చేస్తూనే వున్నారు. మోడీ, అమిత్‌షా లు కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఇలా ఈ దేశంలో అంతర్భాగమైన మైనారిటీలపై విద్వేషాన్ని రెచ్చగొట్టి ఘర్షణలకు ప్రేరేపించడం, దాడులకు పురికొల్పడం దేశ సమగ్రతను దెబ్బ తీస్తుంది. మరి ఈ హిందూత్వ శక్తులపై 'ఉపా' కేసులు పెట్టారా? దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడంలో మన రక్షణ రంగం కీలక పాత్ర కలిగి వుంది. అటువంటి రక్షణ రంగంలో 100 శాతం విదేశీ పెట్టుబడులను అనుమతించడం, మన దేశ రక్షణ వ్యూహాలను సైతం అమెరికాతో పంచుకోవడం, మన సార్వభౌమాధికారాన్ని నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించే ప్రభుత్వ రంగ సంస్థలను విదేశీ బహుళజాతి కంపెనీలకు అమ్మజూపడం- ఇదంతా మన సార్వభౌమాధికారాన్ని దెబ్బ తీయడం లేదా?
సరిహద్దు వివాదాల విషయంలో పొరుగు దేశాలతో మన ప్రభుత్వం తరపున అధికారులు చర్చలు జరుపుతున్నారు. ఆ చర్చలు ఒక కొలిక్కి రావాలంటే ఇచ్చిపుచ్చుకునే వైఖరి అవలంబించాలి. అంటే ఎంతో కొంత భూభాగంపై మన దేశం తన అధికారాన్ని వదులుకోవాల్సి వుంటుంది. అదే విధంగా పొరుగు దేశం కూడా చేయాల్సి వుంటుంది. ఫలానా ప్రాంతంపై అధికారం వదులుకోవాలి అని ప్రతిపాదించడం 'ఉపా' చట్టం ప్రకారం నేరం కాదా అనడిగితే ఈ చట్టం ప్రభుత్వానికి వర్తించదట. అంటే ప్రభుత్వం తన అధికారాన్ని వదులుకోవచ్చు. అదే మాట ఒక పౌరుడు చెప్తే అది చట్ట వ్యతిరేకం అవుతుంది. ఎందుకు అధికారాన్ని వదులుకున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించినా అది కూడా చట్ట వ్యతిరేకమేనట!
1967లో ఈ చట్టాన్ని తెచ్చారు. దానిని పరిశీలించడానికి ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ ముందు అప్పటి అటార్నీ జనరల్‌ సి.కె. దఫ్త్రీ తన వాంగ్మూలం ఇస్తూ ''ఎవరైనా ఒక వ్యక్తి ఏదైనా ఒక విషయం మీద నిజాయితీగా తన అభిప్రాయాన్ని వెల్లడించితే దానిని ఈ ప్రతిపాదిత చట్టం పరిధిలో నేరంగా పరిగణించే వీలుంది'' అని అన్నారు. ప్రభుత్వం తరపున వాదించే ఒక న్యాయవాది ఇలా భావించారంటే ఈ 'ఉపా' చట్టం అసలు ఉద్దేశం ఏమిటో స్పష్టం అవుతూనే ఉంది.
2004లో ఈ చట్టానికి సవరణ తెచ్చి ఉగ్రవాద చర్యలను కూడా చట్ట వ్యతిరేక కార్యకలాపాల కిందకు తెచ్చారు. 32 సంస్థలను ఉగ్రవాద సంస్థలుగా పేర్కొన్నారు. నిజానికి ఉగ్రవాదాన్ని నిరోధించడానికి చాలా ఇతర చట్టాలు కూడా ఉన్నాయి. అయినా 'ఉపా' పరిధిని విస్తరించారు. 2008లో 'ఉపా' కింద వచ్చే నేరాలను పరిశోధించే పనిని ఎన్‌ఐఎ కు బదలాయించారు. 2012లో ఆర్థిక నేరాలను నియంత్రించే పేరుతో ఇంకొకసారి 'ఉపా'ను విస్తరించారు.
పోలీసు శాఖ, శాంతి భద్రతలు రాష్ట్ర పరిధి లోని అంశాలు. కాని ఈ ఎన్‌ఐఎ ద్వారా రాష్ట్రాల వ్యవహారాల్లో కేంద్రం అడ్డగోలుగా తల దూర్చడానికి వీలు కలిగింది.
'ఉపా' కింద ఎటువంటి విచారణా లేకుండా దీర్ఘకాలం నిర్బంధంలో ఉంచవచ్చు. నేరం జరగకుండా నిరోధించడానికే అరెస్టు అనే వాదనతో ప్రివెంటివ్‌ డిటెన్షన్‌ను ప్రభుత్వం సమర్ధించుకుంటోంది. కాని ప్రివెంటివ్‌ డిటెన్షన్‌ విధానం అనాగరికమైన, అప్రజాస్వామికమైన చర్యగా, పౌర హక్కులకు భంగకరంగా భావించి చాలా దేశాలు అటువంటి చట్టాలను ఎప్పుడో రద్దు చేశాయి. కాని మన దేశంలో మాత్రం దానిని రద్దు చేయకపోగా మరింత విస్తరిస్తున్నారు. ముఖ్యంగా మోడీ పాలనలో దీని దుర్వినియోగం తారా స్థాయికి చేరింది.
మన దేశం బ్రిటిష్‌ పాలకుల పెత్తనం కింద ఉన్నప్పుడు ఆ పాలకులు జారీ చేసిన రౌలత్‌ చట్టం ఈ 'ఉపా' వంటిదే. జాతీయ స్వాతంత్య్రం కోసం గొంతెత్తకుండా ప్రజలను అణచివేయడానికి ఆ రౌలత్‌ చట్టం తెచ్చారు. దానిని, ఆ పాలకులను ప్రజలు ఓడించారు. ఇప్పుడు పాలకులు దేశ స్వాతంత్య్రానికి చేటు తెచ్చే విధానాలను అనుసరిస్తున్నారు. ఆ విధానాలను ప్రశ్నిస్తున్నవారి మీద 'ఉపా' చట్టం ప్రయోగిస్తున్నారు. దేశ ద్రోహులన్న ముద్ర వేస్తున్నారు. ఆనాడు రౌలత్‌ చట్టానికి, దానిని తెచ్చిన పాలకులకు ఏ గతి పట్టిందో రానున్న రోజుల్లో ఈ 'ఉపా' చట్టానికి, ఈ పాలకులకు, వారు అనుసరిస్తున్న విధానాలకు కూడా అదే గతి పడుతుంది. నవంబరు 26, 27 తేదీల్లో దేశవ్యాప్తంగా కార్మికులు, రైతులు కోట్లాది మంది తమ నిరసనల ద్వారా తెలియజేస్తున్నది ఈ సత్యమే.
                                                                        ఎం.వి.ఎస్‌. శర్మ