Dec 16,2022 08:43
  • మళ్లీ తెరపైకి జమిలి ఎన్నికలు

ప్రజాశక్తి - న్యూఢిల్లీ బ్యూరో : పార్టీ ఫిరాయింపుల చట్టం బిజెపి చేతిలో ఎంతగా అపహాస్యానికి గురైందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అనేక రాష్ట్రాలో ఎంఎల్‌ఏలను లొంగదీసుకుని, ప్రజలుఎన్నుకున్న ప్రభుత్వాలను కూల్చివేసి అధికారాన్ని చెలాయిస్తున్న ఘనత ఆ పార్టీది! ఈ నేపథ్యంలో పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని మరింత బలోపేతం చేసి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలన్న డిమాండ్‌ దేశ వ్యాప్తంగా వినిపిస్తోంది. అయితే, బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మాత్రం ఫిరాయింపుల చట్టం బ్రహ్మాండంగా పనిచేస్తోందని, దానికి ఎటువంటి సవరణ అవసరం లేదని పార్లమెంటు సాక్షిగా ప్రకటించింది. అదే సమయంలో జమిలి ఎన్నికలను మరోసారి తెరపైకి తీసుకువచ్చింది. పార్లమెంటుకు, రాష్ట్రా శాసనసభలకు ఒకే సారి ఎన్నికలు జరపాలన్నది తమ విధానమని తెలిపింది. ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు రాజ్యసభలో రెండు వేరువేరు ప్రకటనలు చేశారు. ఫిరాయింపులపై అడిగిన ఒక ప్రశ్నకు ఆయన జవాబిస్తూ దేశంలో ఫిరాయింపులు గణనీయంగా తగ్గాయని, అందువల్ల పార్టీ ఫిరాయింపుల చట్టానికి ఎలాంటి సవరణలు చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. 1985లో 52వ రాజ్యాంగ సవరణ చేసి పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని 10 షెడ్యూల్‌లో చేర్చారని తెలిపారు. అప్పటి నుండి ఈ చట్టం అద్భుతంగా పనిచేస్తోందని అన్నారు. ఫలితంగా దేశ వ్యాప్తంగా పార్టీ ఫిరాయింపుల కేసులు గణనీయంగా తగ్గాయని అన్నారు. పైగా పదో షెడ్యూల్‌లోని నిబంధనలు కాలపరీక్షకు నిలిచాయని, న్యాయపరమైన పరిశీలనలను సమీక్షలను అధిగమించాయని ఆయన చెప్పారు. వీటన్నింటిని పరిగణలోకి తీసుకుని ఫిరాయింపుల చట్టానికి ఇప్పటికిప్పుడు ఎటువంటి సవరణ చేయాల్సిన అవసరం లేదని తమ ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు. ఒకవైపు ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను కూలుస్తూ, మరోవైపు ఫిరాయింపుల చట్టం బాగా పనిచేస్తోందంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. మరో ప్రశ్నకు ఇచ్చిన రాతపూర్వక జవాబులో లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం వల్ల ఖజానాకు భారీగా ఆదా అవుతుందని తెలిపారు. ఎన్నికలు ఖరీదైన వ్యవహారంగా మారాయని అన్నారు. ఎన్నికల చట్టాలలో సంస్కరణలపై లా కమిషన్‌ తన 170వ నివేదికలో పాలనలో స్థిరత్వం కోసం లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని సూచించిందని తెలిపారు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదా అవుతుందని, రాజకీయ పార్టీలు, అభ్యర్థులకు ఎన్నికల ప్రచారంలో గణనీయమైన పొదుపు అవుతుందని చెప్పారు. విడిగా జరుపుతన్న ఎన్నికల కారణంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని సుదీర్ఘంగా అమలు చేయాల్సివస్తోందని, ఫలితంగా అభివృద్ధి కార్యక్రమాలపై ప్రతికూల ప్రభావం పడుతోందని చెప్పారు. 1951-52, 1957, 1962, 1967లో లోక్‌సభకు, అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరిగాయని, అయితే, 1968, 1969లో కొన్ని శాసనసభలను ముందస్తుగా రద్దు చేయడం వల్ల ఈ చక్రానికి అంతరాయం కలిగిందని తెలిపారు.