'ఎప్పుడు జరగాల్సిన ముచ్చట అప్పుడే జరగాలి!' అంటుంటారు. నిజమే కానీ ఆ అప్పుడు ఎప్పుడనేది ఎవరు నిర్ణయించాలి? అసలు జరగాల్సిన ఆ 'ముచ్చట' వయసును బట్టి సహజంగా ఏర్పడే భౌతిక అంశమా లేక పరిస్థితుల్ని బట్టి నిశ్చయించాల్సిన సామాజిక అంశమా? అనేదీ మరో ప్రశ్న. భారతీయ సమాజంలో ముఖ్యంగా పెళ్లి తంతు ఎప్పుడూ సరైన గాడిలో లేదన్నది చారిత్రాత్మకంగానూ చర్చనీయాంశమైన విషయం. ఈ తరుణంలో భారత స్త్రీకి వివాహ వయసును 18 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు పెంచుతూ ఈ మధ్యనే కొత్త చట్టం చేశారు. ఇది ఎంత సమంజసమో పక్కన పెడితే స్త్రీ సంక్షేమార్థం ఇంతకు మించిన ఆలోచనేదో చేయాలన్నది నిపుణుల అభిప్రాయం.
భారతీయ స్త్రీ తల్లి కావాల్సిన సమయానికి ఆమెకి ఉండా ల్సిన వయసును దృష్టిలో పెట్టు కొని, ప్రభుత్వాలు వివాహ వయసుపై నిర్ణయం తీసుకుంటున్నాయి. అయితే దీనికి ప్రధానకారణం దేశంలో నానాటికీ పెరిగిపోతున్న మాతృ మరణాలు, పౌష్టికాహార లోపాన్ని సరిచేయడానికే అనేది గుర్తించాల్సిన విషయం. దీనికోసం నాలుగు నెలల క్రితం జయా జెట్లీ అధ్యక్షతన మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖ ఒక టాస్క్‌ఫోర్స్‌ను నియమించి, ఈ 21 ఏళ్ల నిర్ణయానికి వచ్చారు.
ఇది వాస్తవం
నిజానికి ఇక్కడ వివాహ సంబంధిత విషయాలు ఎన్నో చర్చించాల్సి ఉంది. ముఖ్యంగా ఈ దేశంలో బాల్య వివాహాలను రూపుమాపాల్సిన అవసరం ఇంకా కనిపిస్తూనే ఉంది. తిరిగి మళ్లీ ఇది పౌష్టికాహార లోపాన్నే చర్చకు తీసుకొ స్తుంది. అయితే నిపుణుల అధ్యయనం బట్టి బాల్యవివా హాలకు ముఖ్యకారణం నిరక్షరాస్యత, అవగాహనాలోపం, పేదరికంతో పాటు అన్నింటితో ముడిపడున్న పితృస్వామ్య వ్యవస్థ. అలాగే విద్యా, ఉద్యోగాల్లో సరైన అవకాశాలు లేకపో వడం, లైంగికదాడుల భయం, మూఢ నమ్మకాలు, ఆస్తిని కాపాడుకునేందుకు కుటుంబాల ఆరాటం, వివాహ సంబం ధిత ఖర్చుల భయం, అన్నింటికీ మించి తల్లిదండ్రులు 'భారాన్ని' దించుకోవాలని అనుకోవడం వంటి కారణాలు.. బాల్య వివాహాల్లో ప్రధానాంశాలుగా చెప్పొచ్చు. అయితే కాలానుగుణంగా బాల్య వివాహాలు తగ్గుతున్నాయన్నది వాస్తవం.
అవి తగ్గుతున్నాయి
యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ డివిజన్ లెక్కల ప్రకారం 2000 సంవత్సరంలో 15-19 సంవత్సరాల మధ్య వయసున్న 9.5% బాలురు, 35.7% బాలికలకు వివాహాలు జరిగినట్లు తెలుస్తోంది. 2001లో 15 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న మూడు లక్షల మంది బాలికలు బిడ్డల్ని కన్నారు. ఇందులో కొందరికి అప్పటికే రెండో కాన్పు కూడా అయినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇక నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం 2005-06లో 45% మంది బాలికలు 18 ఏళ్ల వయసు కంటే ముందే వివాహం చేసుకున్నారు. 2009లో ఇది 47% చేరుకుంది. అయితే వీరిలో 56% మంది గ్రామీణ ప్రాంతాలకు చెందినవారేనని యూనిసెఫ్ 'స్టేట్ ఆఫ్ ది వరల్డ్ చిల్డ్రన్ 2009' రిపోర్డు చెబుతోంది. దీని ప్రకారం 52% మంది బాలికలు 15-19 సంవత్సరాల లోపే గర్భందాల్చినట్లు తెలుస్తోంది. ఇటీవల సేకరించిన సమాచారాన్ని బట్టి ఇది మరింత తగ్గినట్లు అర్థమవుతోంది. ముందు దశాబ్దంతో పోల్చుకుంటే 2015-16 సంవత్స రానికి 27% స్త్రీలల్లో, 20% పురుషుల్లో బాల్య వివాహాలు కొంత తగ్గినట్లు కనిపిస్తోంది. 17.2 ఏళ్ల నుంచి 19 ఏళ్ల వయసున్న స్త్రీలు, 22.6 నుంచి 24.5 ఏళ్ల వయసున్న పురుషుల్లో వివాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బాల్య వివాహాలను తగ్గించడానికి వివాహ వయసును పెంచాలనే ప్రశ్న వినిపించింది.
సాధికారతే ప్రధానం
అంతేకాకుండా ఇలా వివాహ వయసు పెంచాలని అనుకున్నప్పుడు లైంగిక కోరికల ఏర్పడే వయసునూ దృష్టిలో ఉంచుకోవాలన్నది కొందరి అభిప్రాయం. దీనిపై వ్యక్తుల్లోనూ, సమాజంలోనూ ఎంతో మార్పు రావాల్సి ఉంది. దీనిపై ఆరోగ్య కార్యకర్తల ద్వారా యువతుల లైంగిక అవసరాలపై అవగాహనా కల్పించాల్సిన అవసరం ఉంది. ఇరువురు ఇష్టపడి పెళ్లి చేసుకునే సందర్భాల్లో వయసు కారణంగా వారిపై వేధింపులు అధికమయ్యే అవకాశం ఎక్కు వగా ఉంటుంది. దీనిపైనా ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇక వివాహ వయసుపై ఇంకొందరు స్పందిస్తూ భారత రాజ్యాంగం స్త్రీ-పురుషులకు సమాన హక్కులు ఇచ్చిన విధంగానే వివాహం విషయంలోనూ అదే సమానత్వాన్ని పాటించాలని అంటున్నారు. వివాహ వయసును పెంచడం కంటే ముందు స్త్రీ సాధికారతను సాధించేందుకు అవసరమైన వనరుల్ని, అవకాశాలను పెంచడానికి ప్రభుత్వాలు పూనుకుంటే బాగుంటుందని యువతే కాకుండా సామాజిక నిపుణులూ అభిప్రాయపడుతున్నారు.
వీరంతా నేరస్తులవుతారు!
ఇప్పుడు భారతదేశంలో కౌమారదశ (15-19 ఏళ్ల వయసు) చివరిలో వివాహాలు చేసుకుంటున్నారు. కాబట్టి వివాహ వయసు విషయంలో మునుపటి కంటే మెరుగైన స్థితి కనిపిస్తోంది. కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాదికి లెక్కల్లో ఇంకాస్త అభివృద్ధి కనిపించొచ్చు. ఇక ఇప్పుడు పెంచిన 21 ఏళ్ల వివాహ వయసు పెంపుదలతో దేశంలోని 56% కంటే తక్కువ కాకుండా ఉన్న మహిళల్లో (20-24 మధ్య వయసు) ఈ వయసు లోపు వివాహం చేసుకున్నవారు, వారి కుటుంబాలు ఒక్కసారిగా నేరం చేసిన వారవుతారు. ఉన్నత విద్య, ఆరోగ్య సేవల్లో ఎంతో అభివృద్ధిలో ఉన్న కేరళ రాష్ట్రంలోనే 20-24 ఏళ్ల వయసు మధ్య ఉన్న ఒకటికి మూడొంతుల మంది స్త్రీలు 21 ఏళ్లకు ముందే వివాహాలు చేసుకుంటున్నారు. దేశం మొత్తం మీద తీసుకున్నా ఇలాంటి పరిస్థితి మరింత ఎక్కువగానే కనిపిస్తోంది. ఇప్పుడు వీరంతా నేరాన్ని మోయాల్సి ఉంటుంది.
అసమానతలు పోవాలి!
వ్యవస్థీకృతమైన అసమానతలో మార్పులు రానంత వరకూ వివాహ వయసు పెంచడం వల్ల పెద్దగా ఒరిగేదేమీ లేదని చాలామంది యువత అభిప్రాయపడుతున్నారు. అమ్మాయిల జీవితం అంతా వివాహం చుట్టే తిరుగు తుంటుంది. విపరీతంగా పెరిగిన ప్రయివేటు విద్యాలయాల ఫీజులు, ప్రభుత్వ విద్యాలయాల్లో కొరవడిన సౌకర్యాలతో ఎంతోమంది అమ్మాయిలు చదువును మధ్యలోనే అపేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ పరిస్థితిని సరిదిద్దినప్పుడు అమ్మాయిలు తమ చదువు పూర్తిచేసుకోవచ్చు. ఉద్యోగంతో ఆర్థిక స్వేచ్ఛ సంపాదించుకోవచ్చు. అలా శారీరక, మానసిక ఆరోగ్యంతో సిద్ధపడినప్పుడే వారు, వారి తల్లిదండ్రులూ అమ్మాయి వివాహానికి సిద్ధపడతారు. ఈ విషయమై ఇండియాలోనే మొట్టమొదటి మెడికల్ స్టూడెంట్స్ అసోసియేషన్ పూర్వ అధ్యక్షురాలిగా ఉన్న మహారాష్ట్రకు చెందిన 21 ఏళ్ల ప్రభాపాటిల్ ఈ ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావించారు. వివాహ వయసును పెంచడం వల్ల ఆసుపత్రులకు రాకుండా ఇళ్లల్లోనే కాన్పులు చేయడం ఎక్కువవుతుంది అంటారామె. వయసు కారణంగా గర్భందాల్చిన విషయాన్ని నమోదు చేయించుకోవడానికి వారు ఇష్టపడరు. దీనితో నేరారోపణలు, వేధింపులు పెరుగుతాయి. ముఖ్యంగా ఇరువురు ఇష్టపడి వివాహం చేసుకోవాలనుకునే వారిపై దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని ఆమె అన్నారు.
విభిన్న అభిప్రాయాలు
ది సహేలీ ఉమెన్స్ రీసోర్స్ సెంటర్ అభిప్రాయం ప్రకారం ప్రభుత్వం ఇలా వివాహ వయస్సు పెంచడానికి ప్రధానకారణం జనాభా పెరుగుదలను నియంత్రించ డానికే. అయితే దీనివల్ల దేశంలోని లింగ నిష్పత్తిపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అంతేగాక గర్భస్థ శిశువు లింగనిర్ధారణతో అబార్షన్లు ఎక్కువయ్యే అవకాశమూ లేకపోలేదు. ఇక కరోనా లాక్‌డౌన్ కారణంగా అందరూ ఇంటికి పరిమితం కావడం కారణంగా 'లింగ నిర్ధారణ నివారణ' చట్టంలో ఇటీవల ఏప్రిల్ 4న వచ్చిన మార్పులతో అసలు చట్టానికే (పిసి-పిఎన్డీటీ యాక్ట్) ఎసరొచ్చే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు వివాహ వయసు పెంచడం వల్ల స్త్రీలకు మరింత స్వేచ్ఛ, నిర్ణయాధికారం వస్తుందనే వాదన వినబడుతోంది. అయితే ఈ విషయం పట్ల యువతలో విభిన్న అభిప్రాయాలు కనిపిస్తున్నాయి.