- ఆంధ్రప్రదేశ్‌కు బిజెపి చేసిన ద్రోహాలు అన్నీఇన్నీ కావు. రాష్ట్ర విభజన సమయంలో ఎ.పి.కి ఐదేళ్లు ప్రత్యేకహోదా ఇస్తామని అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ పార్లమెంటులో ప్రతిపాదించగా బిజెపి పదేళ్లు కావాలంది. తాము అధికారంలోకి వస్తే పదేళ్లూ ఇస్తామంది. తదనంతరం ముగిసిన అధ్యాయం కింద మార్చేసింది. రాజధానిపై అనిశ్చితికీ బిజెపియే కారణం. రాజధాని అమరావతి శంకుస్థాపనకు విచ్చేసిన ప్రధాని మోడీ గుప్పెడు మట్టి, చెంబుడు నీళ్లు ఇచ్చి ఇదే గొప్ప సాయమన్నారు. విభజన చట్టాన్ని చుట్టచుట్టి అటకెక్కించారు.
రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేళ్లు దాటింది. తాము అధికారంలోకి వస్తే పదేళ్ల ప్రత్యేకహోదా ఇస్తామన్న బిజెపి మాట తప్పింది. కొత్త పరిశ్రమలు రాక, ఉన్న పరిశ్రమలు కునారిల్లి, చదువుకున్నా ఉద్యోగ ఉపాధి అవకాశాల్లేక నిరుద్యోగం తాండవిస్తోంది. యువతలో నిరాశానిస్ప్రుహలు ఆవహించాయి. హైదరాబాద్, చెన్నరు, బెంగళూరు, ముంబయికి వలసలు వెళ్లే దుస్థితి నెలకొంది. హోదా ఉంటే రాష్ట్రానికి ప్రత్యేక గ్రాంట్లు, కొత్తగా ఏర్పాటు చేసే పరిశ్రమలకు పన్ను రాయితీలు, కేంద్ర ప్రభుత్వ పథకాల నిధుల్లో 90 శాతం గ్రాంటుగా, పది శాతం రుణంగా అందుతాయి. హోదా నిరాకరించడం వల్ల రాష్ట్రం ఆర్థికంగా, పారిశ్రామికంగా బాగా నష్టపోయింది. మొదటి ఐదేళ్ల పాలనలో నాలుగేళ్లు బిజెపితో పొత్తులో ఉన్న టిడిపి సర్కారు హోదా స్థానంలో లేని ప్యాకేజీ ఇస్తామంటే ఊ..కొట్టింది. చివరిలో హోదా కావాలని యూటర్న్ తీసుకుంది. హోదానే రాష్ట్రానికి సంజీవని అని, 25 లోక్‌సభ సభ్యులను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచుతామన్న వైసిపి, బిజెపికి పార్లమెంట్‌లో మెజార్టీ సీట్లు వచ్చినందున ఏమీ చేయలేమని చేతులెత్తేసింది. రెండు పార్టీలు పరస్పరం నిందించుకుంటూ అసలు దోషి బిజెపిని వదిలేస్తున్నాయి. రాష్ట్ర ప్రయోజనాలను గాలికొదిలేశాయి.
- రాజధాని లేని రాష్ట్రం
రాజధాని విషయంలోనూ బిజెపి ద్రోహం చేసింది. ఎనిమిదేళ్లల్లో ఇచ్చింది రూ.2,500 కోట్లు. వాటిలో వెయ్యి కోట్లు విజయవాడ, గుంటూరు నగరాల్లో డ్రైనేజి అభివృద్ధికి ఇచ్చినవి. ఢిల్లీని తలదన్నేలా రాజధాని నిర్మాణం అంటే ఇదేనా? టిడిపి ప్రభుత్వం ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధాని పేరిట ల్యాండ్ పూలింగ్ పేరుతో హడావిడి చేసి, అమరావతిని భ్రమరావతిని చేసింది. వైసిపి ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో గందరగోళం సష్టించింది. సమస్యను పరిష్కరించాల్సిన కేంద్రం ,రాజధాని, రాజధానులు అనే అంశంపై అసంబద్ధంగా హైకోర్టులో అఫిడవిట్ వేసింది. కేపిటల్ ఏర్పాటుపై అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదేనని ఇంకో మాట చెప్పింది. మరో వైపు రాష్ట్ర బిజెపి అమరావతే రాజధాని అంటోంది. బిజెపికి మిత్రపక్షంగా ఉన్న జనసేన బిజెపి నాటకాలపై మాట్లాడట్లేదు. సిపిఎం, వామపక్షాలు మాత్రమే ప్రత్యేకహోదా, రాజధాని, విభజన హామీల అమలుకోసం మొదటి నుంచీ నిబద్ధతతో పోరాడుతున్నాయి.
- లాభాలెన్నో..
ఆంధ్రప్రదేశ్ అనేక అనుకూలతలు కలిగి ఉంది. సుదీర్ఘ సముద్రతీరం, ప్రకతి వనరులు, రవాణా సదుపాయాలు, సారవంతమైన భూములు, కష్టపడి చదువుకునే యువత, సుస్థిర ప్రభుత్వాలు ఉన్నాయి. హైదరాబాద్‌ను కోల్పోయిన నష్టాన్ని పూడ్చాలంటే ప్రత్యేకహోదా ఇవ్వడం అత్యవసరం.
- అబద్ధాలకు అంతే లేదు
ఆర్థిక సంఘం ఏ రాష్ట్రానికీ హోదా ఇవ్వవద్దన్నట్లు బిజెపి చెప్పింది. ఫైనాన్స్ కమిషన్ నివేదికలో ఆ అంశం ఎక్కడా లేదు. అందుకు జవాబు లేదు. ఏ రాష్ట్రానికీ హోదా లేదన్నారు. ఇప్పటికే ఉన్న వాటిని సలక్షణంగా కొనసాగిస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల సందర్భంగా కొత్తగా పుదుచ్చేరికి హోదా ఇస్తామన్నారు. బీహార్‌కు పరిశీలనలో ఉందన్నారు. ఎపి విషయంలో హోదాకు సమానంగా ప్యాకేజీ అన్నారు. అది రాజుగారి దేవతావస్త్రాల్లానే ఉంది.
- ప్రణాళికా సంఘం చేసిన అధ్యయనం
ప్రత్యేకహోదా వల్ల ఉద్యోగాలు, వారికి లభిస్తున్న జీతాలు ఆదాయలు ఎలా ఉన్నాయో ప్రణాళికా సంఘ ప్రాయోజకత్వంలో జరిపిన అధ్యయన నివేదిక...
- కీలకమైన ఉద్యోగితను పరిశీలిస్తే ఈ కాలంలో ఉత్తరాఖండ్‌లో 87 శాతం, హిమచల్‌లో 39 శాతం, జమ్మూకాశ్మీర్‌లో 22 శాతం ఉపాధి, ఉద్యోగాలు పెరిగాయి.
- కార్మికులకు అందే ప్రతిఫలం ఉత్తరాఖండ్‌లో 172 శాతం, హిమచల్‌లో 94 శాతం, కాశ్మీర్‌లో 47 శాతం పెరుగుదల ఉంది.
- పంజాబ్, హర్యానా, యుపి వంటి చోట్ల నుంచి కూడా హోదా కలిగిన రాష్ట్రాలకు వచ్చి పనులు చేసుకుంటున్నారు.
- మూడు రాష్ట్రాలలోనూ పెట్టుబడులు పెట్టినవారిని విచారించగా 89 శాతం మంది తాము ఈ రాయితీలు ఉన్నందునే వచ్చామని సమాధానం ఇచ్చారు.
- 66.7 శాతం మంది ఇంకా పెట్టుబడులు పెట్టాలనే ఉత్సాహం కనబర్చారు.
- పోటీకి దోహదం చేశాయని 88 శాతం మంది చెప్పారు.
- వీరిలో 44 శాతం మంది తమ యూనిట్లను విస్తరించుకునే యోచనలో వున్నారు..
- శాంతిశ్రీ










