
- 13 నుంచి 26 వరకు అందుబాటులోకి
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : దసరా పండగకు ముందు తర్వాత ప్రయాణాలు చేసేందుకు ఎపిఎస్‌ఆర్‌టిసి 5,500 ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటుచేసింది. ఈ నెల 13 నుంచి 26 వరకు ఈ ప్రత్యేక సర్వీసులను సాధారణ ఛార్జీలతోనే ప్రయాణికుల కోసం నడపనున్నట్లు ఎపిఎస్‌ఆర్‌టిసి తెలిపింది. ఈ మేరకు బుధవారం ఎపిఎస్‌ఆర్‌టిసి ఒక ప్రకటన విడుదల చేసింది. పొరుగు రాష్ట్రాలకూ ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు పేర్కొంది. విజయవాడకు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల నుంచి ప్రత్యేక బస్సులను నడపనున్నారు. ఈ నెల 13 నుంచి 22 వరకు దసరా ముందు రోజుల్లో 2,700 బస్సుల్ని, 23 నుంచి పండగ ముగిశాక ఈ నెల 26 వరకు 2,800 బస్సుల్ని ఆర్‌టిసి నడిపేందుకు కార్యాచరణ రూపొందించింది. హైదరాబాద్ నుంచి 2,050 బస్సులు, బెంగళూరు నుంచి 440, చెన్నై నుంచి 153 బస్సులు వివిధ పట్టణాలకు నడపబడతాయి. విశాఖపట్నం నుంచి 480 బస్సులు, రాజమండ్రి నుంచి 355, విజయవాడ నుంచి 885, అలాగే రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి వివిధ ప్రాంతాలకు 1,137 ప్రత్యేక బస్సుల కేటాయింపుతో రద్దీని తట్టుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. డిజిటల్ పేమెంట్స్‌తో ద్వారా టిక్కెట్లు తీసుకునే వీలు కల్పిస్తోంది. రిజర్వేషన్లకు కూడా అవకాశం ఉందని తెలిపింది. కాల్ సెంటర్ 149, 08662570005 నెంబర్లను అందుబాటులో వుంచింది.