Dec 30,2022 22:32

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : త్వరలో జరగనున్న ఎంఎల్‌సి ఎన్నికలకు భారీగా కొత్త ఓటర్లు నమోదయ్యారు. ఈ మేరకు ఎన్నికల సంఘం ఓటర్ల తుది జాబితాను శుక్రవారం విడుదల చేసింది. దీని ప్రకారం ఎన్నికలు జరగనున్న మూడు గ్రాడ్యుయేట్‌ నియోజకవర్గాలు, రెండు ఉపాధ్యాయ నియోజక వర్గాలకు కలిపి 1,40,523 మంది ఈ ఎన్నికల్లో కొత్త ఓటర్లుగా నమోదయ్యారు. మరోవైపు ఈ ఓటర్ల జాబితాలో పెద్ద ఎత్తున అవకతవకలు చోటు చేసుకున్నాయని, అర్హతలు లేని వారిని ఓటర్లుగా నమోదు చేశారని విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఎన్నికల సంఘానికి కూడా పలు ఫిర్యాదులందాయి. దీంతో ఐదు నియోజకవర్గాలకు సంబంధించి 31,949 ఓట్లను ఎన్నికల కమిషన్‌ తొలగించింది. శ్రీకాకుళం, విజయనగరం గ్రాడ్యుయేట్‌ నియోజకవర్గంలో 10,884 ఓట్లను తొలగించగా, 50,730 మంది కొత్త ఓటర్లుగా చేరారు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు గ్రాడ్యుయేట్‌ నియోజకవర్గంలో 11,758 మందిని తొలగించగా, 30,866 మందికి కొత్తగా ఓటు హక్కు లభించింది. కడప, అనంతపురం, కర్నూలు గ్రాడ్యుయేట్‌ నియోజకవర్గంలో 7,911 మందిని ఓటర్ల జాబితా నుండి తొలగించగా, 46,070 మందికి కొత్త ఓటర్లుగా నమోదయ్యారు. ఉపాధ్యాయ నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి. తొలగించిన ఓట్లకన్నా కొత్తగా నమోదైన ఓట్లే అధికంగా ఉన్నాయి. ప్రకాశం, చిత్తూరు, నెల్లూరు ఉపాధ్యాయ నియోజకవర్గంలో 788 ఓట్లను తొలగించగా, 6,781 మందికి కొత్తగా ఓటు హక్కు లభించింది. కడప, అనంతపురం, కర్నూలు ఉపాధ్యాయ నియోజకవర్గంలో 608 ఓట్లను తొలగించగా, 6,126 మంది కొత్త ఓటర్లుగా చేరారు.

  • నియోజవర్గాలుగా ఓటర్ల వివరాలు

నియోజకవర్గం                                    పోలింగు స్టేషన్లు      డ్రాఫ్ట్‌రోల్‌       చేర్పులు    తొలగింపులు    ఫైనల్‌ రోల్‌
శ్రీకాకుళం, విజయనగరం గ్రాడ్యుయేట్‌            297                243903       50730        10884          283749
ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు గ్రాడ్యుయేట్‌         320                364288       30866         11758         383396
కడప, అనంతపురం కర్నూలు గ్రాడ్యుయేట్‌     358                 291089       46070        7911           329348
ప్రకాశం నెల్లూరు చిత్తూరు టీచర్స్‌                 175                  20914         6781          788            26907
కడప అనంతపురం, కర్నూలు టీచర్స్‌            173                 22256         6126          608             27774