హైదరాబాద్: దేశంలో మహిళా రిజర్వేషన్లపై తెలంగాణ ఎమ్మెల్సీ, భారత్ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళా రిజర్వేషన్లపై మరో పోరాటం చేస్తామని తెలిపారు. మహిళా రిజర్వేషన్ చట్టాన్ని 2024 సార్వత్రిక ఎన్నికల నుంచే అమలు చేయాలనే డిమాండ్‌తో మరో పోరాటానికి సిద్ధమవుతున్నట్లు కవిత స్పష్టం చేశారు. కాగా, తాజాగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో తాము చేసిన పోరాటానికి దిగి వచ్చిన కేంద్రం.. పార్లమెంట్ లో బిల్లును పాస్ చేసిందని చెప్పారు. చట్టంగా మారిన తర్వాత అమలు వాయిదా వేసే కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మహిళా రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని కవిత డిమాండ్ చేశారు. లేదంటే తాము కూడా న్యాయపోరాటం చేస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఇక, ఈ విషయంపై న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నట్లు ఆమె తెలిపారు. ఇప్పటికే ఈ విషయంపై పలు పార్టీలు, సంస్థలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయని చెప్పారు. ఆయా సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీం కోర్టు విచారణ జరుపుతోందని గుర్తుచేశారు. కోర్టులో పెండింగ్‌లో ఉన్న పిటిషన్‌లో భారత్ జాగృతి తరఫున తాము ఇంప్లీడ్ అవుతామని వివరించారు. ఇక, మహిళా రిజర్వేషన్ చట్టాన్ని 2024 నుంచే అమలు చేయాలనే డిమాండ్‌తో మరో పోరాటానికి సిద్ధమవుతున్నట్లు కవిత వివరించారు.