- భారం కానున్న
- విద్యుత్తు ఛార్జీల పెంపు
- అప్పటికే గ్లోబల్ మార్కెట్లో నిలబడలేని పరిస్థితి
ప్రజాశక్తి- విజయనగరం ప్రతినిధి : విద్యుత్తు ఛార్జీల పెంపుతో రాష్ట్రంలోని ఫెర్రో ఎల్లాయీస్, అల్లూమినియం కంపెనీలు మరింత సంక్షోభంలోకి వెళ్లనున్నాయి. ఇప్పటికే కొన ఊపిరితో నడుస్తోన్న పరిశ్రమలు మూతపడే ప్రమాదం ఉంది. 2023-24లో విద్యుత్తు ఛార్జీలకు సంబంధించిన వార్షిక ఆదాయ, అవసరాల నివేదిక (ఎఆర్‌ఆర్)ను రాష్ట్రంలోని మూడు డిస్కములు ప్రవేశపెట్టాయి. దీని ప్రకారం పవర్ ఇంటెన్సివ్ పరిశ్రమలపై రూ.697.06 కోట్ల భారం పడనుంది. దీనివల్ల ఫెర్రో ఎల్లాయీస్ పరిశ్రమలు మరింత ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతాయని యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 40 ఫెర్రో ఎల్లాయీస్ పరిశ్రమలు ఉన్నాయి. ఇందులో 37 వరకు ఉత్తరాంధ్రలోనూ వాటిలో అత్యధికంగా 18 వరకూ విజయనగరం జిల్లాలోనూ ఉన్నాయి. ఒకప్పుడు ఈ పరిశ్రమలు మూడు పువ్వులు ఆరు కాయలుగా పనిచేసేవి. విజయనగరం జిల్లాలో ఈ పరిశ్రమలపై వేలాది కుటుంబాలు ఆధారపడేవి. గరివిడి ఫేకర్‌లో ఉద్యోగం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగాలు వదులుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇటువంటి పరిశ్రమలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల నాలుగు దశాబ్దాలుగా ఎప్పటికప్పుడు మూతపడడం, తెరుచుకోవడం వంటి స్థితిలోకి వెళ్లాయి. ముఖ్యంగా విద్యుత్తు ఛార్జీలను తట్టుకోలేకపోతున్నాయి. 2018 నుంచి ఈ పరిశ్రమలకు విద్యుత్తు రాయితీలు లేవు. గత ఆర్థిక సంవత్సరానికి ముందు యూనిట్ ధర రూ.4.95 ఉండగా, ఈ ఏడాది ఏప్రిల్ నుంచి రూ.5.95 చొప్పున అమలవుతోంది. విద్యుత్తు ఛార్జీలను తట్టుకోలేక రాష్ట్రంలోనే అతిపెద్ద గరివిడి ఫేకర్ 20 ఏళ్లగా తన ఉత్పత్తిని తగ్గించుకుంటూ వస్తోంది. దీంతో, ఒకప్పుడు ఆరు వేల మంది పర్మినెంట్ కార్మికులు, సుమారు 1500 మంది రోజువారీ కూలీలతో కళకళలాడే ఈ ఫ్యాక్టరీలో పరిసర ప్రాంతం నేడు బోసిపోయినట్టుగా కనిపిస్తోంది. విద్యుత్తు రాయితీలు కల్పిస్తామని ఎన్నికలు వచ్చినప్పుడల్లా రాజకీయ పార్టీలు హమీలు గుప్పించడం, అధికారంలోకి వచ్చాక దీనికి భిన్నంగా వ్యవహరించడం మామూలైంది. విద్యుత్తు ఛార్జీలు దాదాపు రూ.700 కోట్ల మేర అదనపు భారం పడుతుందని సాక్షిత్తు డిస్కంలే అంచనాలు వేయడంతో యాజమాన్యాల్లో ఆందోళన మొదలైంది. మరోవైపు పరిశ్రమలకు గనులు కేటాయించడం లేదు. మన రాష్ట్రంలోని పరిశ్రమలు 90 శాతం ముడిసరుకును ఒడిశా నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. అక్కడి గనుల్లో 70 శాతం ఆ రాష్ట్ర ప్రభుత్వం టాటా మల్టీనేషనల్ కంపెనీకి లీజుకు ఇచ్చేసింది. మిగిలిన 30 శాతం ఓపెన్ టెండర్ రూపంలో విక్రయిస్తుండడంతో ముడిసరుకు కోసమే ఫెర్రో యాజమాన్యాలు ఎక్కువగా పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. ఈ పరిశ్రమల్లో ప్రధానంగా ఫెర్రో క్రోం, సిలికాన్ మాంగనీస్ తయారు చేసి, మనదేశంలోని వివిధ ప్రాంతాలతోపాటు చైనా, దక్షిణాఫ్రికా వంటి దేశాలకు విక్రయిస్తారు. మారిన గ్లోబల్ మార్కెట్ విధానాల వల్ల ఎగుమతి, దిగుమతులపై నియంత్రణ లేదు. దీంతో, మార్కెట్ ధరల్లో నిలకడ లోపించింది. దీనికితోడు విద్యుత్తు ఛార్జీలపై రాయితీలు ఇవ్వకపోవడం, ఏటా పవర్ ఛార్జీలు పెంచడం వల్ల వంటి కారణాల వల్ల మన రాష్ట్రంలోని చిన్నచిన్న పరిశ్రమల మనుగడ కష్టతరంగా మారింది. విజయనగరం జిల్లాలో బొబ్బిలి గ్రోత్ సెంటర్‌లోని యోనా, మెరకముడిదాం మండలంలోని ఆంధ్రా ఫెర్రో మూతపడ్డాయి. కొత్తవలసలోని ఆంధ్రా ఫెర్రోను పూర్తిగా ఎత్తివేశారు. మరికొన్ని పరిశ్రమలు కొన ఊపిరితో నడుస్తున్నాయి.
- విద్యుత్తు ఛార్జీలు పెంచితే మరింత కష్టం
విద్యుత్తు ఛార్జీలు పంచితే ఫెర్రో ఎల్లాయీస్ పరిశ్రమల మనుగడ మరింత కష్టతరంగా మారుతుంది. ఇప్పటికే రాష్ట్రంలో చాలావరకూ మూతపడ్డాయి. ఎప్పుడూ ఛార్జీలు పెంచడం తప్ప, రాయితీలు ఇవ్వడం లేదు. 2018 తరువాత ఏటేటా ఛార్జీలు పెంచారు. విద్యుత్తు బిల్లులు రూ.లక్షల్లో వస్తున్నాయి. వేతనాలు, మెయింటినెన్స్, మరమ్మతులు చాలా భారంగా పరిణమించాయి. దీనికితోడు ముడిసరుకు సమస్య ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌ను తట్టుకోలేకపోతున్నాం. మమ్మల్ని నమ్ముకుని ఉన్న కార్మికులకు పూర్తి స్థాయిలో ఉపాధి కల్పించలేకపోతున్నాయి.
-లక్కరాజు నారాయణమూర్తి,
గరివిడి ఫేకర్ డిజిఎం










