
- ప్రచారసభలో సిపిఎం నగర కార్యదర్శి రెడ్డి శంకరరావు
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : రాష్ట్ర ప్రభుత్వం ట్రూ ఆఫ్ చార్జీల పేరుతో విద్యుత్ చార్జీలు పెంపు చేయడం, కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తూ విద్యుత్ చార్జీలు భారాలు పెంపు చెసి ప్రజలపై 8000 కోట్లు సర్ చార్జీలు వసూలు చేస్తున్నారు అని వాటిని వెంటనే రద్దు చేయాలని కోరుతూ గురువారం నాడు విజయనగరంలో రాష్ట్ర సదస్సు జరుగుతుందని దీన్ని జయప్రదం చేయాలని సిపిఎం నగర కార్యదర్శి రెడ్డి శంకరరావు పిలుపు నిచ్చారు. రాష్ట్ర సదస్సు జయప్రధానికి బుధవారం 29వ వార్డులో ప్రచార సభ నిర్వహించారు. ఈ సభ నుద్దేశించి ఆయన మాట్లాడుతూ పెరిగిన బిల్లులతో జనం గగ్గోలు పెడుతున్నారనీ అన్నారు. విద్యుత్ వాడకం పెరగటం కాదు. ప్రభుత్వం ఒకేసారి సర్దుబాటు చార్జీలు పేరుతో మూడు పోట్లు పొడిచిందనీ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కయి ప్రజలకు షాక్ ఇస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గత సంవత్సరం కరెంటు చార్జీలు పెంచి 1400 కోట్ల రూపాయల భారం మోపిందనీ గుర్తు చేశారు.స్లాబులు మార్చేశారనీ విమర్శించారు. ప్రజల కళ్ళు కప్పి గత పది ఏళ్ల నుంచి వాడుకున్న కరెంటుకు 'బిల్లులు కట్టినా మళ్లీ సర్దుబాటు చార్జీల పేరుతో జనం నెత్తిన తాజాగా 6 వేల కోట్ల రూపాయలు భారం వేశారన్నారు. నాలుగేళ్లలో 25 వేల కోట్ల రూపాయలు ప్రజల నెత్తిన మోపారనీ తెలిపారు.ఈనెల బిల్లులో 2014 సంవత్సరంలో వాడుకున్న కరెంటుకు మళ్ళీ యూనిట్ కి 20 పైసలు, 2021 మే నెలలో వాడిన విద్యుత్తు యూనిట్కు మరో 20 పైసలు, 2023 ఏప్రిల్ నెలలో ఉపయోగించిన కరెంటుకు యూనిట్కు 40 పైసలు కలిపి మొత్తం యూనిట్ కు 80 పైసలు చొప్పున జనం నెత్తిన బండ వేశారన్నారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించే కార్పోరేట్ అనుకూల, ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అక్టోబర్ 19న గురువారం ఉదయం 10 గంటలకు కేఎల్ పురం ప్రజాసంఘాల కార్యాలయంలో విద్యుత్ సంస్కరణలపై రాష్ట్ర సదస్సును నిర్వహిస్తున్నామని, ఈ సదస్సుకు ముఖ్య వక్తలుగా సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి.తులసీదాస్, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగరావు. హాజరవుతున్నారన్నారు. సిపిఎం పార్టీ సభ్యులు, సానుభూతిపరులు, విద్యుత్ వినియోగదారులందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పత్రికా విలేకరుల సమావేశంలో సిపిఎం పార్టీ నాయకులు జగదాంబ, శాంత మూర్తి, దుర్గా, త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు.