- ఇసకలపేటలో విషపు చీమలు
- చర్మ సంబంధిత వ్యాధుల
- బారిన పడుతున్న గ్రామస్తులు
- మందులు, క్రిమిసంహారకాలు వాడుతున్నా అంతుచిక్కని చీమలు
ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి : శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం తొగరాం పంచాయతీ ఇసకలపేట గ్రామస్తులను చీమల దండు బెంబేలెత్తిస్తోంది. చీమలు ఎక్కడి నుంచి వచ్చాయో, ఎలా వచ్చాయో తెలియదుగానీ కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. గ్రామంలో రోడ్లు, పొలాలు, కళ్లాలు, ఇళ్లు ఎక్కడ చూసినా బారులు తీరిన చీమలే కనిపిస్తున్నాయి. గ్రామంలో ఎక్కడైనా ఒక నిమిషం నిల్చుంటే శరీరమంతటా పాకురుతున్నాయి. శరీరంపైకి వెళ్లిన కొద్దిసేపటికే దురదలు ఏర్పడుతున్నాయి. ప్రధానంగా మోకాలు కింది భాగంలో పొక్కులుగా ఏర్పడి చీము చేరుతోంది. క్రమేణా అవి పుళ్లుగా మారుతున్నాయి. చీమల నోటి నుంచి వచ్చే విష పదార్థం అలర్జీకి దారితీస్తోందని వైద్యులు చెప్తున్నారు. అలర్జీతోపాటు కొందరు జ్వరం, ఒంటి నొప్పులతో బాధపడుతున్నామని గ్రామస్తులు తెలిపారు. వైద్య చికిత్స కోసం బాధితులు సమీపంలోని ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రాన్ని ఆశ్రయిస్తున్నారు. అప్పటికీ నయం కాని వారు శ్రీకాకుళంలోని ప్రయివేట్ ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. గాయాలు నయం కావడానికి వారం, పది రోజులు పడుతోందని బాధితులు చెప్తున్నారు. ఇందుకోసం రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు ఖర్చు పెట్టాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- ఇంటి నుంచి బయటకు రావాలంటే భయం
చీమల దండుతో ఇసకలపేట గ్రామస్తులు ఇంటి నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. పొలం పనులకు వెళ్తున్న రైతులు చీమల బారిన పడి అస్వస్థతకు గురవుతున్నారు. ఆవులు, గేదెలకు పాలు పితకడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పశువులకు గడ్డి మేతనూ వేయలేకపోతున్నారు. పశుగ్రాసానికీ చీమలు పట్టి ఉండడంతో పశువులు తినలేకపోతున్నాయి. పశువులూ ఈ చీమల బారిన పడి అనారోగ్యం పాలవుతున్నాయి. చీమల మందు వాడుతున్నా, ఆ ఒక్క రోజే రావడం లేదని, మరుసటి రోజు నుంచి పుట్టలుగా మళ్లీ వస్తున్నాయని మహిళలు వాపోతున్నారు. పంట పురుగు మందులు వినియోగిస్తున్నా రెండు, మూడు రోజుల తర్వాత మళ్లీ ప్రత్యక్షమవుతున్నాయని రైతులు చెప్తున్నారు.
- అంతుచిక్కని చీమలు
గ్రామంలోకి చీమలు ఎలా ప్రవేశించాయో, ఎక్కడ నుంచి వచ్చాయో ఎవరూ చెప్పలేకపోతు న్నారు. సాధారణ ఎర్ర చీమల మాదిరిగానే కనిపి స్తున్నా, శరీరంపై పాకితే మాత్రం దురదలు, పొక్కులు వస్తున్నాయి. గ్రామంలో వైద్యులు సందర్శించి మందులు ఇచ్చినా ఉపశమనం కలగడం లేదు.
- కాలుపై పొక్కులు తగ్గడం లేదు : ఎ.కృష్ణారావు, బాధితుడు
చీమలు పాకడంతో కాలుపై పొక్కులు వచ్చాయి. మందులు వాడుతున్నా తగ్గడం లేదు. శ్రీకాకుళం మండలం సింగుపురం వెళ్లి నాటు వైద్యం చేయించు కుంటున్నాను. అడుగు తీసి అడుగు వేయలేకపోతు న్నాను. కూలి పనులకు కూడా వెళ్లలేకపోతున్నాను.
- కాళ్లకు పాలిథిన్ కవర్లు కట్టుకుంటున్నాం : జి.ధనంజయరావు, రైతు
చీమలతో గ్రామస్తులమంతా తీవ్ర ఇబ్బం దులు పడుతున్నాం. చీమలు పాకడంతో రెండు కాళ్లకూ దురదలు, పొక్కులు వచ్చాయి. శ్రీకాకుళం లోని ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నాను. రెండు కాళ్లకు పాలిథిన్ కవర్లు కట్టుకొని పొలాలకు వెళ్తున్నాం. చీమల బారి నుంచి ఎలా బయటపడాలో అర్థం కావడం లేదు.
- ప్రభుత్వానికి నివేదిస్తాం
గ్రామంలో విస్తరించిన చీమలు కొత్త రకంగా కనిపిస్తున్నాయి. చెద పురుగులను తిని బతుకు తున్నట్లుగా తెలుస్తోంది. వీటి వ్యాప్తిని అరికట్టేం దుకు గ్రామంలో గమాక్సిన్, బ్లీచింగ్, ఇతర క్రిమి సంహారక మందులను చల్లాం. వారం రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహిస్తాం. అప్పటికీ నియంత్రణలోకి రాకపోతే ప్రభుత్వానికి నివేదిస్తాం.
- రవికుమార్, జిల్లా పంచాయతీ అధికారి










