Jan 05,2023 06:44

'ఆడలేక.. మద్దెల ఓడు' అన్నట్లు సభలు, ర్యాలీల్లో అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేయడంలో విఫలమైన ప్రభుత్వం ఏకంగా వాటిని నిషేధించడానికి తెగబడింది. ఈ మేరకు కొత్త సంవత్సర ఆరంభంలోనే జారీ చేసిన ఒకటవ నెంబర్‌ జిఓ అత్యంత అప్రజాస్వామికమైనది. సభలను, ర్యాలీలను, రోడ్‌షోలకు జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, మున్సిపల్‌, పంచాయతీ రోడ్లు, వాటి మార్జిన్లలో అనుమతి ఇవ్వకూడదని అధికారులను ఆదేశించింది. ఇవన్నీ పోను ఇక మిగిలిందేమిటి? దీనికోసం ఎప్పుడో కాలం చెల్లిన బ్రిటిష్‌ పాలన నాటి పోలీస్‌ చట్టాన్ని దుమ్ముదులిపి వెలికి తీయడంతోనే సర్కారు ఆలోచన ఏమిటో స్పష్టమౌతోంది. ప్రజాస్వామ్యమంటేనే ప్రజాభిప్రాయం! ఏ రూపంలోనైనా దానికి కళ్లెం వేయడానికి, సంకెళ్లు వేయడానికి చేసే ప్రయత్నాలు ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీస్తాయి. నిరంకుశత్వానికి బాటలు వేస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఈ కోవలోనిదే! రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19 దేశ ప్రజలందరికీ వాక్‌ స్వాతంత్రం, భావ ప్రకటన స్వేఛ్చలతో పాటు శాంతియుతంగా సమావేశమయ్యే హక్కును కూడా దేశ ప్రజలందరికీ దఖలు పరిచింది. నిరసన తెలియచేయడం కూడా దీనిలో భాగమే! దీని అములులో ఎటువంటి మినహాయింపులు, తారతమ్యాలు లేవు.ఏయే సందర్భాలలో సహేతుకమైన ఆంక్షలు విధించవచ్చో కూడా రాజ్యాంగం వివరించింది. రాష్ట్రంలో అటువంటి క్లిష్ట పరిస్థితులు లేవన్నది అందరికీ తెలిసిన విషయమే! అయినా, రాష్ట్ర ప్రభుత్వం ఒకటి, రెండు సంఘటనలను సాకుగా చూపి ప్రజల గొంతు నొక్కడానికి సిద్ధపడటం అమానుషం.
ఏయే కార్యక్రమాలను అనుమతించాలో, వేటికి తిరస్కరించాలో నిర్ణయించే హక్కు పోలీస్‌ అధికారులపై ప్రభుత్వం పెట్టింది. సాధ్యమైనంత మేరకు అనుమతివ్వకూడదని వీరికి దిశా నిర్ధేశం చేసిన ప్రభుత్వమే అత్యంత అరుదైన సందర్భాల్లో మాత్రమే షరతులతో అనుమతి ఇయ్యవచ్చని జిఓలో పేర్కొంది. ఈ అత్యంత అరుదైన సందర్భాలేమిటో అన్న దానిపై ఎటువంటి వివరణ లేదు. అంటే దానిని నిర్ణయించే హక్కు కూడా పోలీస్‌ అధికారులదే! సర్వాధికారాలను పోలీస్‌ వ్యవస్థకు కట్టబెట్టడం ప్రజాస్వామ్య వ్యవస్థకు అత్యంత ప్రమాదకరం. ఈ విషయం ఇప్పటికే అనేక సందర్భాల్లో రుజువైంది. రాష్ట్రంలో పోలీస్‌ వ్యవస్థ విశ్వసనీయత సైతం ప్రశ్నార్థకంగా మారుతోంది. ప్రస్తుత ముఖ్యమంత్రి వై.ఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలీసు వ్యవస్థపై చేసిన విమర్శలు కూడా ఈ సందర్బంగా ప్రస్తావనార్హం. ప్రస్తుతం ఏ రోడ్లపైన అయితే రోడ్‌షోలు, ప్రదర్శనలు, సభలు నిషేధమంటూ జిఓ జారీ చేశారో ఆ రోడ్లపైన పాదయాత్ర చేయడం ద్వారానే ఆయన అధికారానికి బాటలు వేసుకున్నారన్నది జగమెరిగిన సత్యం!
నిజానికి ఈ నిషేధమేమి ఇప్పటికిప్పుడు ఊడిపడింది కాదు. సరళీకరణ ఆర్థిక విధానాల పేరిట దేశంలో తిష్టవేసి, ప్రజల కష్టాన్ని దోచుకుతింటున్న కార్పొరేట్‌ శక్తుల అజెండా ఇది! తమ దోపిడి విధానాల ఫలితంగా కష్టాల పాలయ్యే కార్మికులు, సాధారణ ప్రజల హక్కులను హరించడం, గొంతెత్తనీయకుండా చేయడం, తెగించి గొంతు విప్పినా ప్రజలందరి మద్దతు దొరకకుండా చూడటం వారి వ్యూహం. దీనిలో భాగంగానే నగరాలు, పట్టణాల్లో జరిగే ఆందోళనలు, నిరసనలను ధర్నా చౌక్‌లకు పరిమితం చేశారు. అప్పుడు చెప్పిన కారణం కూడా ప్రజల రాకపోకలకు ఆందోళనల వల్ల ఆటంకం కలుగుతున్నాయనే! సులభతర వాణిజ్యం పేరిట కేంద్ర ప్రభుత్వమూ ఈ విధానాలనే అమలు చేయాలని రాష్ట్రాలపై ఒత్తిడి చేస్తోంది! అటు కార్పొరేట్‌ శక్తులను, ఇటు కేంద్రాన్ని సంతృప్తిపరిచే చర్యల్లో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఈ చీకటి జిఓను తీసుకువచ్చింది. పాలకవర్గ పార్టీలు చేసే హడావిడి ఎలా ఉన్నప్పటికీ దీని వల్ల అసలు నష్టం సాధారణ ప్రజానీకానికే! అందుకే దీనిని తిప్పికొట్టడానికి కదలాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది! ఐక్యంగా ప్రతిఘటించి ప్రజాస్వామ్యాన్ని, ప్రజాతంత్ర హక్కులను కాపాడుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞతతో యోచించి అప్రజాస్వామిక జిఓను ఉపసంహరించుకోవాలి.