
'ఏమండీ! వచ్చే బుధవారం మీ నాన్నగారి ఆబ్ధికం. బల్ల మీద సరకుల లిస్ట్ పెట్టాను. మీరు సాయంత్రం ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు తీసుకొస్తే నా ఏర్పాట్లలో నేనుంటాను' అంటూ వంటింట్లోంచి విశాలాక్షి చెప్పింది. హాల్లో కాఫీ తాగుతూ పేపర్ చదువుతున్న నేను సమాధానం చెప్పలేదు. 'ఒకసారి ఆఫీస్‌కు వెళ్లేటప్పుడు ఇంటి బ్రహ్మగారు సూరన్నగారికి గుర్తు చేయండి'. నా మౌనాన్ని భరించలేని విశాలాక్షి వంటింట్లోంచి చేతిలో గరిటెతో బైటకొచ్చి 'నేను వంటింట్లోంచి అరుస్తోంటే అలా మాటా-మంతీ లేకుండా నిశ్శబ్దంగా కూర్చుంటారే?' అడిగింది.
'సూరన్నగారికి గుర్తు చెయ్యడమేమిటి? ఆయనే వచ్చి తిధి ఫలానా తేదీనని చెప్పాలి. అసలు ఈయనకి మనం తాంబూలంలో పెట్టే రూపాయల మీద ఉన్న శ్రద్ధ తంతు మీద ఉండదు'.
'తప్పండి, అలా అనకూడదు. ఇంతకీ సరుకులు ఎప్పుడు తెస్తారు? వాటిలో రాయి, రప్పా ఉంటే ఏరుకోవాలి' అంది. అసలే విస్సుగ్గా ఉన్న నాకు 'ఎందుకు చాంతాడంత లిస్ట్. ఏదో చేశాం అనిపించుకునే కార్యక్రమమే.. దండగ ఖర్చు' అంటూ మనసులోని కోపాన్ని వెళ్లగక్కాను.
'పితృకార్యం ధర్మకార్యం. సంవత్సరానికి ఒకసారి తల్లిదండ్రులకి తర్పణ చేసి, వాళ్ల గొంతుకిన్ని నీళ్లుపోసే మహత్కార్యం. మీకు జన్మనిచ్చినందుకు అది మీ బాధ్యత' అని హితవు చెప్పే ప్రయత్నం చేసింది. ఆమె మాటలు నాకు నచ్చలేదు.
'వాళ్లిద్దరు బతికున్నంత కాలం మందుల చీటీలు పట్టుకు తిరిగాను. ఇప్పుడు తద్దినాలకి సరుకుల లిస్ట్ పట్టుకు తిరుగుతున్నాను. నా బతుకు మాత్రం మారలేదు' విసురుగా జేబులో లిస్ట్ పెట్టుకున్నాను.
'అయినా నాకు తెలియక అడుగుతాను. ఎందుకండీ మీ నాన్నగారి మీద అంతకోపం? ఆయన ఏదో చిన్నస్కూలులో బడిపంతులుగా ఉద్యోగం చేస్తూ నలుగురు ఆడపిల్లల పెళ్లిళ్లు చేశారు' అంటూ విశాలాక్షి సమర్ధించింది.
'ఆయన కడుపున పుట్టిన సంతానానికి పెళ్లిళ్లు ఇంకెవరు చేస్తారు? ఆలికి అన్నం పెట్టడం.. ఊరికి ఉపకారమన్నట్లు ఉంది నీ మాట' కఠినంగా చెప్పాను.
'మిమ్మల్ని చదివించి ఇంతవాళ్లను చేశారు. ఒక రూపాయి అప్పు మీకు అప్పజెప్పకుండా వెళ్లిపోయారు' అని చాలా గొప్పగా చెప్పింది.
'అవునుమరీ! కోట్ల కొద్దీ ఆస్తులు కట్టబెట్టారు. చదివించారులే బోడి డిగ్రీ' అంటూ నాలోని నిరాశ పైకి పొడుచుకొచ్చింది.
'ఈ రోజుల్లో అప్పు ఇవ్వకపోవడమే ఆస్తి. మీకు రెక్కలిచ్చారు. అంతకన్న ఇంకేం ఇస్తారు?'.
'అందుకేగా నేను ఎగురుతున్నాను. నాన్న పంచిన సొమ్మంతా ఏంచేసుకోవాలో తెలియక తల పట్టుకుని కూర్చున్నా' వెటకారంగా అన్నాను.
'ఉన్నదానితో తృప్తి పడేవాడే నిజమైన ధనవంతుడండి!' అంది.
'ఇలాంటి సూక్తులు చెప్పడానికి బాగుంటాయి. దుకాణానికి వెళ్లినప్పుడు ఈ మాటలు చెబితే సరుకులివ్వడు.. ఇంటికెళ్లమంటాడు. ప్రపంచం మాటల మీద నడవటం లేదు. పైసల మీద నడుస్తోంది. పైసామే పరమాత్మ' అంటూ గతంలో డబ్బులులేక జరిగిన అవమానాలు గుర్తుకొచ్చి అన్నాను.
'అంటే పెద్దలు నేర్పిన విలువలు పనికిమాలినవంటారు. డబ్బే శాశ్వతం అంటారు' అంది.
'విలువలు కూడు పెట్టవు. ఆ కాలం చెల్లిపోయింది. ఇప్పుడు డబ్బుకి లోకం దాసోహం. ఆ రోజుల్లో ఆయన వట్టి బడిపంతులే కాదు. ఆయనో పేరుమోసిన రచయిత. ఎన్నో పుస్తకాలు రాశారు. ఒక్కదానికీ ఆయన రాయల్టీ లేదు. పుస్తకాలు ఎన్నో ముద్రణలు జరిగాయి. ప్రచురణకర్త కాకిసంచి నుంచి సూట్‌కేస్ స్థాయికి ఎదిగాడు. ఈయనకు మాత్రం పిల్ల పెళ్లికి ఓ నాల్గు బస్తాలు బియ్యం, పప్పులులాంటి సరుకులు పంపేవాడు. వాటితోనే తృప్తిపడి, మహా ప్రసాదంగా తీసుకునేది మా అమ్మ. అదీ రచయితగా ఆయన సంపాదించింది' తండ్రి అసమర్ధత పట్ల కోపం మాటల్లో బైటకొచ్చింది.
'కవిత్వాన్ని రాజులకు అమ్ముకోని పోతనంత గొప్పవ్యక్తి మామయ్యగారు. అందుకు గర్వించండి'. ఆ మాటలు చెపుతోంటే ఆమె మొహంలో ఆనందం కనబడింది.
'ఆయన కూడా పోతనలా ఫీలయ్యి నోరువిప్పి ఎవర్నీ ఏమి అడగలేదు. చెట్టంత కొడుకు డిగ్రీ పూర్తిచేసి, ఎదురుగా ఉంటే కనీసం వాడికి ఉద్యోగానికి సిఫార్సు అడగలేని నిస్వార్ధ వ్యక్తి. ఆయన నిజాయితీని చూసి గర్వించాలా? ఆయన అసమర్ధతకు ఆనందించాలా? గొర్రెకు బెత్తెడు తోకతో జీవితాన్ని కష్టపడి ఈడ్చాలా? కోరికని చంపుకుని, నిస్సారంగా బీటలు వారిన బీడుభూమిలా బతకాలా? దేనికి గర్వించాలి?' నా మాటల్లో వెటకారం, వేదన ఉన్నాయి. నా అంతర్మధనం విశాలాక్షికి అర్థమైనట్లుంది. ఓదార్పుగా మాట్లాడింది.
మా మధ్య జరుగుతున్న సంభాషణకు కాలింగ్‌బెల్ చప్పుడు అంతరాయం కలిగించింది. తలుపు తీసి, అతిథుల్ని సాదరంగా ఆహ్వానించి వాళ్లను కూర్చోబెట్టి.. 'ఇప్పుడే మా వారిని పిలుస్తా' అంటూ లోపలకి వచ్చింది.
చొక్కా బటన్లు పెట్టుకుంటూ నేను బైటకు వచ్చాను. అందరికీ నమస్కరిస్తూ. 'మీరు ఎవరు? మిమ్మల్ని నేనెప్పుడూ చూడలేదు. దయచేసి మీరు వచ్చిన పనేమిటో చెప్పండి' వినయంగా అడిగాను.
'మీ నాన్నగారు మాఊరి స్కూలులో టీచరుగా పనిచేశారు. మా గ్రామంలో ఇంటింటికీ విద్యాదీపం వెలిగించిన విధాత. ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకునేందుకు ఒక సభ ఏర్పాటు చేశాం. దానికి మీరు కుటుంబంతో తప్పకుండా రావాలి'.
'నాకు ఆఫీస్ పని ఉంటుంది. పైగా మా నాన్నగారి ఆబ్ధికం ఉంటుంది. నాకు కుదరకపోవచ్చు' అన్నాను. వెళ్లకూడదని ముందే నిర్ణయించుకుని వంకకోసం తడుముకోకుండా వెంటనే చెప్పేశాను.
'మీ నాన్నగారి ఆబ్ధికం ఎప్పుడండి?' వచ్చిన వాళ్లలో ఒక పెద్దాయన అడిగాడు. 'వచ్చే పదో తేదీ, బుధవారం. ఆ రోజు నేను కార్యక్రమం తర్వాత బైటికి వెళ్లకూడదు' తప్పించుకుంటున్నందుకు మనసులోనే సంతోషపడ్డాను.
'హమ్మయ్య.. మా సమస్య తీరిపోయింది. మీరు రావడానికి ఏ రకమైన ఇబ్బందీ ఉండదు. మీ ఇంట్లో కార్యక్రమం బుధవారం అయితే మా ఊర్లో సభ ఆదివారం ఏడో తేదీ సాయంత్రం ఐదు గంటలకి' ఆ మాట చెపుతోంటే ఆయన మొహంలో ఒక పెద్ద రిలీఫ్ కనబడింది.
'సరే సార్. మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి! నేనే కాల్ చేస్తాను'. ఆ క్షణంలో మరో మార్గం కనబడక సర్ది చెప్పాను.
'ఇంకా ఆహ్వానపత్రిక రాలేదు. మళ్లీ వచ్చి, మీకు పత్రిక అందజేస్తాం. మీరు ఎన్ని గంటలకు బయలుదేరేదీ చెబితే చాలు. ఆ సమయానికి కారు పంపుతాం'.
'ఇంతమంది వచ్చి స్వయంగా పిలుస్తోంటే ఇంకా పత్రికలు ఎందుకండి?' మొహమాటంగా అన్నాను.
'మా మర్యాద మేం పాటించాలి కదండీ' అని నమస్కరించి వెళ్లారు.
ఇక తప్పదన్నట్లు అయిష్టంగానే ఒప్పుకున్నాను. 'ఛీ! వెధవ సంత. వద్దంటే వినరే. దిక్కుమాలిన తద్దినం. ఊళ్లో ఏం ఊడబొడచాడో. ఇల్లు చక్కబెట్టలేదు కానీ ఊర్లో దీపాలు వెలిగించాడట' అని లోలోపలే అనుకున్నా.
'ఎందుకండీ అంత కోపం? మీకేం తెలుసు మామయ్యగారు ఏంచేశారో?'.
'చేశారు.. వాళ్ల క్షణికావేశంలో నన్ను కని భూమ్మీద పడేశారు. కొడుకుని చదివించామని చెప్పుకునేందుకు డిగ్రీ చేతిలో పెట్టి, లోకం మీద వదిలేశారు' అని పక్కనున్న గ్లాసులో నీళ్లు తీసుకుని గొంతులో పోసుకున్నాను.
'ఇంత పేరు ప్రఖ్యాతులున్నా.. వాటిని కొడుక్కి ఉపయోగించలేదని నిబద్ధత ప్రకటించుకుని మురిసిపోయారు. నా భవిష్యత్తు గురించి ఏనాడైనా ఆలోచించారా?! ఎంతసేపూ వాళ్ల సంతోషం, వాళ్ల ఆనందం తప్పా. అలాంటి వాళ్లకు ఏడాదికోసారి ఇంత ఖర్చుపెట్టి ఆబ్ధికాలు, హంగామాలు అవసరమా?' ఆవేశంతో ఊగిపోయాను. నాలో అసహనం రంకెలు వేసింది. విశాలాక్షికి నా ధోరణి నచ్చలేదని ఆమె చూపులు చెపుతున్నాయి.
***
ఆదివారం వచ్చింది. గడియారం మధ్యాహ్నం రెండు గంటలు కొట్టింది. ఇంటిముందు కారు ఆగింది. కాలింగ్‌బెల్ మోగింది. ఇంతలో గుమ్మం ముందు నిలబడ్డ డ్రైవరు పిలుపు వినబడింది. వీధితలుపు తీశాను. 'సార్! కారు సిద్ధంగా ఉంది. మీరు ఎప్పుడు వస్తే అప్పుడు బయల్దేర్దాం. నేను వెయిట్ చేస్తాను' నమస్కరించి బైటకెళ్లాడు.
విశాలాక్షికున్న ఏకైక కంచిపట్టు చీరతో ముస్తాబైంది. 'మీదే ఆలస్యం' అంటూ కట్టుకున్న చీర కుచ్చళ్లు సర్దుకుంటూ బైటకొచ్చింది విశాలాక్షి.
'ఎక్కడైనా ప్రోగ్రామంటే చాలు. ముందే సిద్ధమైపోతావు' విసుక్కుంటూ ఫ్రెష్ అవడానికి వాష్ రూంలోకి వెళ్లి వచ్చాను.
కారు మంచి స్పీడ్లో దూసుకుపోతోంది. నా ఆలోచనలు కూడా అంతే వేగంగా వెళుతున్నాయి. నాకు ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తయినప్పుడు జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది. 'నాన్నగారు ఇంజనీరింగ్ చదవాలని ఉంది. మన వీధిలో ప్లీడరుగారి అబ్బాయి, డాక్టరుగారి అబ్బాయి జాయిన్ అవుతున్నారు' అన్నాను. మాట పూర్తికాకుండానే 'నువ్వు బడిపంతులు కొడుకివిరా' అన్నారు. ఆ మాటలో అంతరార్థం నాకు అర్థమైంది. అంతే బతుకు మీద అసహ్యం వేసింది. కని పెంచిన వాళ్ల మీద నాలో కోపం పొదలో పాములా బుసలు కొట్టింది. డ్రైవరు వేసిన సడన్ బ్రేకుకి వాస్తవంలోకి వచ్చాను.
రోడ్డు పక్క పచ్చటి పొలాల నుంచి వస్తున్న పైరుగాలిని విశాలాక్షి గుండెల నిండా పీల్చుకుంటోంది. ఎప్పుడూ బయట ప్రపంచం చూడని బతుకు ఆమెది. వంటింట్లో మాసిపోయిన గుడ్డతో మూత కట్టిన ఆవకాయ జాడీలాంటి జీవితం. ఆలోచనలు మాత్రం ఆకాశంలా విశాలంగా ఉంటాయి. ఒక్కక్షణం ఆమెలాంటి భార్య దొరకడం అదృష్టం అనిపించింది. ఇంతలో కారు సభాస్థలి దగ్గరకు వెళ్లినట్లు జనం అలజడి బట్టి అర్థమైంది. పెద్ద వేదిక నిర్మించారు. ఆ వేదిక వెనుక ఫ్లెక్సీ మీద నాన్న నవ్వుతున్న పెద్ద ఫొటో. అది చూసి మనసులో అనిపించింది. 'ఏదో పెద్ద సాధించినట్లు ఎందుకో ఆ నవ్వు. నా బతుక్కి ఏడ్పులు వదిలేసి, ఎలా నవ్వుతున్నారో?'. పక్కనే కొత్త భవనం కనిపించింది. దానిమీద పెద్ద అక్షరాలతో ''శ్రీ సూర్యనారాయణ అనాథాశ్రమం'' నాకు ఆశ్చర్యం వేసింది. 'ఉండడానికి ఇల్లు లేదు. సెంటు స్థలం లేదు. భవనానికి నాన్న పేరు. మింగ మెతుకు లేదు మీసాలకు సంపెంగ నూనె అంటే ఇదేనేమో!' అని అనుకుంటుంటే.. పెద్దలు నన్ను చూసి, హడావిడిగా నాకెదురొచ్చారు. 'కూర్చోండి సార్!' అంటూ నాకు, నా భార్యకి మర్యాదలు చేశారు.
'సార్ ఒకసారి బిల్డింగ్ చూస్తారా? లేక ప్రారంభోత్సవం తర్వాత చూద్దామా?' అడిగాడు పెద్దమనిషి. 'ఎందుకులెండి. ఒకేసారి ఓపెనింగ్ అయ్యాక చూద్దాం. ఇంకా ఎవరైనా గెస్ట్ రావాలా?' ఏదో గబగబా కార్యక్రమం ముగించుకుని, వెళ్లే ఆలోచనలో అడిగాను.
'సార్ మీరే చీఫ్ గెస్ట్. ఇంకెవరూ లేరు' అన్నాడు మరో పెద్దాయన.
'నేనా?' ఆశ్చర్యంగా అడిగాను.
'ఇది ఆయన ఆదర్శాల స్ఫూర్తితో కట్టిన భవంతి. ఆయన ఆశయాల అడుగుజాడలలో సాగుతున్న మహాయజ్ఞం. ఆయన రక్తం పంచుకుని పుట్టిన మీకంటే అర్హులు ఇంకెవరు ఉంటారు?'. 'ఆ సమాధానానికి ఒళ్లు జలదరించింది. ఏమిటీ ఆయన పేరు చెబితే చిరాకుపడే నేనా?. ఆయన పోడంటేనే గిట్టని కొడుకుని. నేను ప్రారంభోత్సవానికి ఎంతవరకు అర్హుణ్ణి?' నాలో నాకే ప్రశ్నలు. నా అంతర్మథనం గమనించిన నా అర్ధాంగి నా వేలు పట్టుకుంది.
అచేతనంగా నెమ్మదిగా అడుగులో అడుగులు వేసుకుంటూ నడుస్తున్నాను. ఆలోచనలు పూర్తికాకుండానే గుమ్మానికి కట్టిన రిబ్బన్ యాంత్రికంగా కత్తిరించాను. లోపల గదులన్నీ పరిశీలిస్తూ వాళ్లిచ్చే వివరణలు వింటూ వాళ్లతో పాటే కలిసి ముందుకు కదులుతున్నాను. 'సార్! ఇది ప్రార్థనా మందిరం'. లోపలికి వెళితే నాకు తెలియకుండానే కళ్లు చెమ్మగిల్లాయి. మొత్తం గోడ మీద నాన్న కూర్చున్న ఫొటో. ఏదో ఉపదేశం ఇస్తున్నట్లు ఉంది. నా కళ్లను నేనే నమ్మలేకపోయాను. నాకు తెలియకుండానే రెండు చేతులు జోడించాను. కళ్ల నుంచి నెమ్మదిగా అశ్రుధార. ఎవరో నెమ్మదిగా నా భుజం తట్టి, చూపుడు వేలితో నా కన్నీళ్లు తుడిచిన అనుభూతి. ఓదార్పు పవనం నెమ్మదిగా వీచిన జాడ.
అన్ని గదులూ పరిశీలించి, సభాప్రాంగణం వైపు కదిలాం. ఎంత వద్దన్నా వినకుండా బలవంతంగా వేదిక మీదకు తీసుకెళ్లారు. ఉపన్యాసాలు మొదలుపెట్టారు. నాలో ఆలోచన. 'నన్ను మాట్లాడమంటే ఏమని మాట్లాడాలి? నాన్న గురించి నాకేమి తెలుసు. నాలో ఆత్మ విమర్శ. వీళ్లకు అర్థం అయినట్లు నాన్న నాకు అర్థం కాలేదా? నా స్వార్ధపు ఆలోచనల ముందు ఆయన విశాల హృదయం ఇరుకుగా కనబడిందా? ఆయన అంతర్నేత్ర శక్తి ముందు నా చూపుపోయిందా?' ఆలోచనలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.
'అసలు ఇంతటి మహాకార్యానికి విత్తు నాటిన వ్యక్తి శ్రీ సూర్యనారాయణ మాస్టర్. భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా మన మనసులో శాశ్వతంగా నిలిచిపోయారు. ఆనాడు మహానుభావుడు నాటిన విత్తులు ఎన్నో మహావృక్షాలుగా ఎదిగాయి. ఆ వృక్షాల సత్సంకల్పమే ఈ ఆశ్రమం. ఆయన సంపాదనే అంతంతమాత్రం. అందులోనే సంసారం ఖర్చులు పోను కొంత మాకోసం కేటాయించేవారు. మా పిల్లల భవిష్యత్తుకి పునాది వేశారు. ఏదో తెలియని బంధంతో రక్తసంబంధం లేని మాకు వెలుగు పంచారు. ఆ క్రమంలో కుటుంబానికి ఎంతో కొంత చీకటి మిగిల్చారని మా అభిప్రాయం'. పెద్దాయన నిమిషం నా వైపు చూశాడు. ఆ మాట, చూపు నాకు ఎక్కడో తగిలింది. పశ్చాత్తాపం పలకరించింది.
'అందుకే మేం వారి కుటుంబానికి ఐదులక్షలు ఇవ్వాలనుకున్నాం. ఆ సొమ్ముని స్వీకరించవలసిందిగా వారి కుమారుడు శ్రీ కామేశ్వరరావు గారిని కోరుతున్నాం' అని చెక్కు బయటకు తీశాడు. అసలే బాధతో కాలిపోతున్న నా మీద పెట్రోల్ పోసినట్లనిపించింది. శవం కాలిన వాసన. కదలలేకపోయాను. నా చేతిలో చెక్కు పెట్టారు. కళ్లు తుడుచుకున్న చేతులతో తీసుకున్న చెక్కూ నా గుండెలా తడిసిపోయింది. చెక్కు తీసుకుని, నెమ్మదిగా లేచి మూగబోయిన మనసుతో పోడియం వైపు అడుగులు వేశాను. నా గొంతు పెగలటం లేదు. మాట బైటకి రావడం లేదు. ఒక్కసారి నా శక్తిని కూడదీసుకుని గొంతు సవరించుకున్నాను. 'ఈ సొమ్ము తీసుకునే అర్హత నాకు లేదు. మా నాన్నగారి జీవితం పూర్తిగా చదవని విద్యార్థిని. ఆయన గొప్పతనం గుర్తించలేని గుడ్డివాణ్ణి. మీ అందరిలాగా మనోనేత్రం లేని మానసిక వికలాంగుణ్ణి. నా చూపు పరిధి చాలా చిన్నది. నన్ను నేను సరిదిద్దుకునే సదవకాశం మీరు ఇచ్చారు. మీరు ఎంతో అభిమానంతో ఇచ్చిన డబ్బు ఈ అనాథాశ్రమ అభివద్ధికే అందజేస్తున్నాను. ఇది నా కుటుంబం. ఇకపై నాకు వీలున్నప్పుడల్లా వచ్చి, మీ కార్యక్రమాల్లో భాగస్వామిని అవుతాను' అని గద్గర స్వరంతో ముగించాను.
అందరి దగ్గర సెలవు తీసుకుని ఇంటికి బయల్దేరాం. తిధినాడు శ్రద్ధతో శ్రాద్ధకర్మలు పూర్తి చేశాను. కార్యక్రమం జరుగుతున్నంతసేపు నాన్న నాతోనే ఉన్న అనుభూతి. మొదటిసారి మనసు తేలికగా ఎగిరిపోతోంది. నాలో కలిగిన మార్పుకి విశాలాక్షి కళ్లలో వెలుగు కనిపించింది.
పెమ్మరాజు విజయ రామచంద్ర
9849744161