ప్రజాశక్తి-ఆదోని: కేవలం గంట వ్యవధిలో బదిలీ అయిన అధికారిగా అధిరాజ్ రాణానే మిగిలిపోతారని ఆదోని జిల్లా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఏ నూర్ అహ్మద్ అన్నారు. దీనిపై పత్రికలలో, సోషల్ మీడియాలో వచ్చిన వార్త నిజమైతే ఇది సరైంది కాదన్నారు. గురువారం ఆయన ఆదోనిలో విలేకరులతో మాట్లాడుతూ సుస్థిర శాంతి, అభివృద్ధి కోసం ఆదోని ఏఎస్‌పీగా స్ట్రీట్ ఆఫీసర్ ఆదిరాజ్ రాణానే నియమించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ప్రభుత్వం నిజాయితీ కలిగిన అధికారుల బదిలీ విషయంలో ఆచితూచి అడుగులు వేయాలన్నారు. లేనిచో అది ప్రభుత్వానికి చేటు కలిగిస్తుందన్నారు. మీడియాలో పేర్కొన్న విధంగా అధికారి బదిలీకి కష్టపడిన నాయకుడు సఫలీకృతమయ్యాడు కాని ప్రజల్లో వ్యతిరేక సందేశం వెళ్ళిందన్నారు. మరి ఆ నాయకుడి ఏఏ దందాలకు కొత్త ఏఎస్‌పీ అడ్డుపడతారని భయపడ్డాడో ఆ నాయకుడికే తెలియాలన్నారు. ఇలాంటి నాయకుల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు తప్ప మంచి పేరు రాదని ప్రభుత్వ పెద్దలు గుర్తించాలన్నారు. ప్రజల అభీష్టాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలన్నారు. దశాబ్దాలుగా ఆదోనిలో అసాంఘిక, అవినీతి కార్యకలాపాలు పెరుగుతున్నాయే తప్ప తగ్గటం లేదన్నారు. ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో ఆదోనిలో నేరాలను అరికట్టేందుకు నిబద్ధత, నిజాయితీ గల ఏపీఎస్ అధికారులనే పంపాలని కోరారు.










