Jul 13,2023 06:02

అంగన్‌వాడీలు తమ న్యాయమైన కోర్కెల సాధనకు జిల్లా కలెక్టరేట్ల ఎదుట సోమ, మంగళవారాల్లో చేపట్టిన 36 గంటల ధర్నాలు విజయవంతమయ్యాయి. వేలాదిగా కదిలొచ్చి వంట వార్పు, రాత్రి బస చేసి తమ ఆక్రందనను వెళ్లబోసుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని రెండవ రోజూ కలెక్టరేట్ల ముట్టడి, రాస్తారోకోలు, ధర్నాలతో హోరెత్తించారు. తొలి రోజు ఉగ్గబట్టుకున్న ప్రభుత్వం మరుసటి రోజు అంగన్‌వాడీలపై ఉక్కుపాదం మోపింది. మహిళలని, ప్రభుత్వ ఉద్యోగులని కూడా చూడకుండా పోలీస్‌ నిర్బంధం ప్రయోగించింది. దాష్టీకాలకు, అరెస్టులకు ఒడిగట్టింది. భీమవరం, విశాఖ వంటి చోట్ల పురుష పోలీసులు మహిళా ఆందోళనకారుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన దృశ్యాలు మీడియాముఖంగా సాక్షాత్కరించాయి. తోపులాటలతో పలు ప్రాంతాల్లో అంగన్‌వాడీలు సొమ్మసిల్లి పడిపోయారు. ధర్నాలకు వెళ్లకుండా పై అధికారుల ద్వారా బెదిరించిన ఉదంతాలనేకం. వాటన్నింటినీ అధిగమించి అదరకుండా బెదరకుండా ఆందోళనల్లో కదం తొక్కడం అంగన్‌వాడీల్లో పోరాట పటిమను తెలుపుతుంది.
అంగన్‌వాడీల డిమాండ్లు గొంతెమ్మ కోర్కెలు కాదు. ధరల పెరుగుదల నేపథ్యంలో వేతనాలు పెంచమంటున్నారు. ఉద్యోగ భద్రత కల్పించమంటున్నారు. గ్రాట్యుటీ, పింఛను వంటి రిటైర్మెంట్‌ బెనిఫిట్లు, కారుణ్య నియామకాలు కోరుతున్నారు. తమకు ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను అమలు చేయమంటున్నారు. ఎన్ని సార్లు రోడ్డెక్కి నినదించినా ప్రభుత్వాలు కనికరించట్లేదు. అంగన్‌వాడీల వేతనాలను యుపిఎ-2 ప్రభుత్వం 2011లో పెంచింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు రూపాయి పెంచలేదు. కార్యకర్తకు నెలకు రూ. 3 వేలు, మినివర్కర్‌, ఆయాలకు 1,500.. ఇప్పటికీ కేంద్రం ఇచ్చేదంతే. ఎన్నికలకు ముందు 2018లో దీపావళి కానుక అంటూ ప్రధాని మోడీ 1,500, 1,250, 750 చొప్పున పెంచుతామని జివో కూడా ఇచ్చారు. ఇప్పటి వరకు అతీగతీ లేదు. ఈ కాలంలో నిత్యావసరాలతో సహా అన్నింటి ధరలూ పెరిగిన తరుణంలో ఎప్పుడో పుష్కరకాలం నాడు నిర్ణయించిన వేతనాలతో అంగన్‌వాడీలెలా బతుకుతారు? ఇదిలా ఉండగానే, నూతన విద్యా విధానం, ప్రైవేటీకరణ, ఏ మూలకూ సరిపోని బడ్జెట్‌ ప్రతిపాదనలతో మోడీ ప్రభుత్వం ఐసిడిఎస్‌ను నిర్వీర్యం చేస్తోంది. గర్భిణీలు, బాలింతలు, బాలలకు కాస్తో కూస్తో ఆహారం అందిస్తున్న ఐసిడిఎస్‌ వ్యవస్థ బక్కచిక్కిపోతే భావి భారత భవిష్యత్తు ప్రమాదంతో పడుతుంది. వయసుకు తగ్గ బరువు, ఎత్తుకు తగ్గ బరువు లేని పిల్లలు మన దేశంలో చాలా ఎక్కువ. పిల్లల్లో పోషకాహార లోపం సమస్యలూ ఎక్కువే. ఆకలి సూచీలో మన దేశం ఎక్కడో అట్టడుగున 107వ స్థానంలో కునారిల్లుతోంది. ఈ పరిస్థితుల్లో ఐసిడిఎస్‌ వంటివి ఇంకా పటిష్టం కావాల్సి ఉండగా కుదించడం అమానవీయం.
అంగన్‌వాడీల పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరి స్నేహపూర్వకంగా ఏమీ లేదు. తెలంగాణాలో కంటే ఎక్కువ జీతం ఇస్తామని ఎన్నికలకు ముందు వైసిపి హామీ ఇచ్చింది. అధికారంలోకొచ్చాక అప్పటి వరకు కార్యకర్తకు 10,500 ఇస్తుండగా వెయ్యి కలిపి 11,500, మినివర్కర్లు, ఆయాలకు 6 వేల నుంచి 7 వేలకు పెంచింది. తెలంగాణలో 2021 పే-రివిజన్‌ నుంచే 13,650, 7,800 చేశారు. హామీ ప్రకారం అంతకంటే ఎక్కువ జీతం ఇక్కడివ్వాలి. ఆ ఊసే లేదు. గుర్తు చేస్తే అంగన్‌వాడీలపై సర్కారు విరుచుకుపడుతోంది. పైగా ఆదాయపరిమితి దాటారని 'అమ్మఒడి' సహా అన్ని ప్రభుత్వ పథకాలకూ అంగన్‌వాడీలను అనర్హులుగా ప్రకటించింది. కేంద్ర 7వ వేతన సంఘం సిఫారసుల మేరకు కనీస వేతనం 26 వేలివ్వాలి. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలి. వీటినే అంగన్‌వాడీలు డిమాండ్‌ చేస్తున్నారు. 'జగనన్న సంపూర్ణ పోషణ' మెనూ ఛార్జీలు, పెండింగ్‌ పెట్టిన టిఎ బిల్లులు, సెంటర్ల అద్దెలు, పెరిగిన గ్యాస్‌ ధరలకనుగుణంగా చెల్లింపులు, ఇవి అంగన్‌వాడీల ఇంట్లోకి కాదు. పేదల పోషకాహారం కోసం. రాష్ట్రంలో అంగన్‌వాడీల పోరాటానికి ఘనమైన చరిత్ర ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో అంగన్‌వాడీలను గుర్రాలతో తొక్కించిన టిడిపి ప్రభుత్వానికి కాలక్రమంలో తగిన గుణపాఠం నేర్పారు. సీమాంధ్రలోనూ టిడిపి ప్రభుత్వంలో మార్పేమీ రాలేదు. అంగన్‌వాడీల పట్ల దుర్మార్గంగా ప్రవర్తిస్తే వైసిపి ప్రభుత్వానికీ బుద్ధి చెబుతారు.