- కాకినాడ కలక్టరేట్ వద్ద 36 గంటల నిరసన కార్యక్రమం
ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి : తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం అంగన్వాడీలు కాకినాడలో కదం తొక్కారు. 36 గంటల నిరసన కార్యక్రమంలో భాగంగా కలక్టరేట్ వద్ద శిబిరాన్ని ఏర్పాటు చేసారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వేలాదిమంది అంగన్వాడీలు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆందోళన కొనసాగిస్తున్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణ కంటే అదనంగా వేతనం ఇస్తానని ఇచ్చిన హామీలను తక్షణమే నిలబెట్టుకోవాలని వర్కర్లంతా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనేకసార్లు సమస్యలపై విన్నవించిన వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. ఈ సందర్భంగా కనీస వేతనాలు అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, ఆయాలకు ప్రమోషన్లు ఇవ్వాలని, రాజకీయ వేధింపులు ఆపాలని తదితర నినాదాలు చేశారు. అంగన్వాడీలు 36 గంటల ధర్నా సందర్భంగా కాకినాడ సామర్లకోట రోడ్డు మార్గంలో ట్రాఫిక్ స్తంభించింది.పోలీసులు వాహనాలను ఇతర మార్గాల వైపు మళ్ళించారు. ఈ ధర్నా సందర్భంగా సిఐటియు నాయకులు అంగన్వాడీలకు భోజన, తాగునీటి వసతిని కల్పించారు. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జి.బేబీరాణి, సిఐటియు కాకినాడ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దువ్వా శేషబాబ్జి, సీహెచ్ రాజకుమార్, అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దడాల పద్మ, ఈ. చంద్రావతి తదితరులు సమస్యలపై ప్రసంగించారు.










