Apr 13,2023 06:47

వారం రోజుల క్రితం ట్విట్టర్‌, టెలిగ్రామ్‌లలో ప్రత్యక్షమైన పెంటగాన్‌ రహస్య పత్రాలు అమెరికా అసలు స్వరూపాన్ని మరోసారి నగంగా బయటపెట్టాయి. 'టాప్‌ సీక్రెట్‌' అని మార్కు చేసిన ఈ పత్రాలు ఉక్రెయిన్‌ మిలిటరీ ఘర్షణలో అమెరికా పోషిస్తున్న దుర్మార్గమైన పాత్రను కళ్లకు కట్టినట్టు చూపాయి. ఉక్రెయిన్‌ సంక్షోభానికి రాజకీయ పరిష్కారం కనుగొనకుండా అతి పెద్ద అడ్డంకి అమెరికాయేనని తేల్చి చెప్పాయి. రష్యా, ఉక్రెయిన్‌ ఘర్షణకు సంబంధించి 2022 ఫిబ్రవరి నుంచి అమెరికన్‌ సామ్రాజ్యవాదం, దాని అధీనంలోని ప్రచార బాకాలు ఊదరగొడుతున్నదంతా పచ్చి అబద్ధాలని తేలిపోయింది. ఉక్రెయిన్‌ యుద్ధంలో 'నాటో ప్రమేయం లేదు', 'ఇది ఎలాంటి కవ్వింపు లేకుండా జరుగుతున్న యుద్ధం', 'అమెరికన్‌ సైనికులు ఉక్రెయిన్‌లో ఒక్కరు కూడా లేరు'. 'విజయం అతి చేరువలో ఉంది'...వంటి డైలాగులతో వైట్‌హౌస్‌ అధినేత బైడెన్‌ అమెరికన్లను, మిగతా ప్రపంచ ప్రజలను ఎలా తప్పుదారి పట్టించినదీ పెంటగాన్‌ పత్రాలు తిరుగులేని రీతిలో రుజువు చేశాయి. నాటో జోక్యం ఏ స్థాయిలో ఉందో, ఉక్రెయిన్‌ ప్రభుత్వం సైనికంగా ఎలాంటి గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నదో, 150 అమెరికన్‌, నాటో బలగాలు ఉక్రెయిన్‌లో ఎలా తిష్ట వేశాయో ఈ పత్రాలు సోదాహరణంగా వివరించాయి. ఉక్రెయిన్‌ సైన్యం, రష్యన్‌ దళాలపై పైచేయి సాధించిందని, ఈ యుద్ధంలో 2 లక్షల మంది దాకా సైనికులను రష్యా కోల్పోయిందని ఫిబ్రవరి తొలి వారంలో 'న్యూయార్క్‌ టైమ్స్‌', 'వాషింగ్టన్‌ పోస్ట్‌' వంటి పత్రికలు ప్రచురించిన కథనాలు ఎంత బూటకమో ఈ పత్రాలు తెలియజేస్తున్నాయి. అమెరికా తన ప్రపంచాధిపత్యం కోసం ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ఒక పాచికగా వాడుకుంటుందన్నది దాచేస్తే దాగని సత్యం. రష్యా దురాక్రమణకు వ్యతిరేకంగా ఉక్రెయిన్‌కు మద్దతిస్తున్నామని చెప్పడం అమెరికా మోసకారితనాన్ని తెలియజేస్తోంది. మీరు ఉక్రెయిన్‌ వైపా? రష్యా వైపా? అన్న విభజన తీసుకురావడం ద్వారా ప్రచ్ఛన్న యుద్ధాన్ని మళ్లీ రుద్దాలని అది చూస్తోంది. అవతలి పక్షాన్ని ప్రపంచ శాంతికి ప్రమాదకరమైన శత్రువుగా చూపడం ద్వారా నాటో, ఐరోపా దేశాలను తనవైపు ఉండేలా చూసుకుంది. ప్రపంచాన్ని రెండు శిబిరాలుగా చీల్చ గలిగితే తన ఆధిపత్యాన్ని సులువుగా కొనసాగించుకోవచ్చన్నది అగ్ర రాజ్యం దుర్నీతి. నయా ఉదారవాద విధానాల ఫలితంగా ముసురుకున్న ప్రపంచ ఆర్థిక మాంద్యం, కోవిడ్‌ మహమ్మారి సృష్టించిన విధ్వంసం, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ఇలా ఒకటి తరువాత ఒకటి రావడంతో ఆర్థిక మాంద్యం నుంచి ఇప్పట్లో అమెరికా బయటపడే సూచనలు కానరావడం లేదు. మరో వైపు ప్రపంచ పరిణామాలు బహుళధ్రువ ప్రపంచం వైపుగా సాగుతండడంతో అగ్రరాజ్యం తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడం కోసం సరికొత్త పన్నాగం పన్నింది. ఉక్రెయిన్‌ యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగేలా చూడడం అందులో ఒకటి. యుద్ధం ఎంత కాలం కొనసాగితే ఆయుధాలు అంతగా అమ్ముకుని ప్రస్తుత మాంద్యం నుంచి గట్టెక్కవచ్చని అమెరికా ఆశ. ఉక్రెయిన్‌కు ఆర్థిక, మిలిటరీ సాయం అందించడం వల్ల ఐరోపా ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యే పరిస్థితి వస్తుంది. దానిని కూడా తనకు అనుకూలంగా మార్చుకోవాలని అమెరికా చూస్తున్నది. అందుకే ఉక్రెయిన్‌ సంక్షోభానికి రాజకీయ పరిష్కారం చూపేందుకు చైనా వంటి దేశాలు చేస్తున్న యత్నాలను అది అడ్డుకుంటున్నది. ప్రపంచ శాంతికి, అభివృద్ధికి తీవ్ర విఘాతం కలిగించే అమెరికా కుతంత్రాలకు అడ్డుకట్టవేయాలి. ఇందుకుగాను రష్యా- ఉక్రెయిన్‌ సంక్షోభానికి రాజకీయ పరిష్కారం కనుగొనేందుకు ఐరోపాతో సహా ప్రపంచ దేశాలన్నీ ఐక్యంగా కృషి చేయాలి. ఉక్రెయిన్‌, రష్యాలను రెండింటిని చర్చల టేబిల్‌ దగ్గరకు తీసుకొచ్చి వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించాలి. అమెరికా దుర్నీతికి చెక్‌ పెట్టాలి.