
మత్తు మనిషిని మైమరిపిస్తుంది. ఒకప్పుడు బాధతో మెలికలు తిరుగుతున్న మనసును బుజ్జగించడానికి మందు తాగేవారు. ఇప్పుడు ఆనందంతో ఉన్న మనసును గెంతులేయించడానికీ తాగుతున్నారు. ఇప్పుడు లిక్కర్‌కి అప్ డేటెడ్ వర్షన్ డ్రగ్స్. 'ఛ.. అలా చేస్తే ఛండాలంగా ఉంటుంది!' అనుకునేవాడు.. అదే పని ఆ మత్తులో నిర్భయంగా.. నిర్లజ్జగా చేసేస్తాడు. 'ఛ బాగోదు!' అనుకున్నవాడే 'చేస్తే తప్పేంటి?' అనే స్టేజ్‌కి వెళ్లిపోతాడు. అప్పటివరకు సంస్కారంతో అణచిపెట్టుకున్న కోరికలు అడ్డూ అదుపూ లేకుండా చెలరేగిపోతాయి... నువ్వు రెచ్చిపోరా అంటూ డ్రగ్స్ తెగ రెచ్చగొడతాయి. తెర మీద విపరీతమైన ఎనర్జీని ఎగ్జిబిట్ చేసే హీరోలు, హీరోయిన్లు.. ఆ ఎనర్జీని రియల్ లైఫ్‌లోనూ కంటిన్యూ చేయడానికి ఈ డ్రగ్స్ వాడేస్తున్నారు. ఆ డ్రగ్స్
అందాలలోకాన్ని ముంచెత్తేస్తోంది.
'మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది.. పదండి పోదాం!' అంటూ మహానుభావుడు శ్రీశ్రీ రాశారు. కానీ నేడు సెలబ్రిటీస్ అదే డైలాగ్ చెబుతున్నారు. 'మరో ప్రపంచం పిలిచింది..అందులోకి మేం పోయాం' అంటున్నారు. శ్రీశ్రీ ప్రపంచం అభ్యుదయ ప్రపంచం అయితే.. వీరి ప్రపంచం అగాథ, అవివేక ప్రపంచం. డ్రగ్స్ వారి శరీరంలోకి ఎంటరయ్యాక.. వారికి కనపడేది అదే ప్రపంచం.
సుశాంత్ మరణం తర్వాత..
బాలీవుడ్ హీరో సుశాంత్‌సింగ్ మరణించిన తర్వాత.. అనుమాన మేఘాలు కమ్ముకున్నాయి. ఆ తర్వాత ఆ బాలీవుడ్ చీకటి ప్రపంచాన్ని మనకు రోజుకో రకంగా పరిచయం చేస్తున్నాయి. మొదట సుశాంత్ లవర్ రియా చక్రవర్తి.. ఆమెను కదిపితే మరికొన్ని పేర్లు.. ఆ తర్వాత మరింత లోతుగా వెళితే ఇంకొన్ని పేర్లు.. ఒక్కో పేరు బయటికి వస్తుంటే.. ఆయా తారల అభిమానుల గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. 'ఏమిటిది మన ఫేవరెట్ స్టార్ డ్రగ్స్ వాడతారా..? అందుకే అంత అందంగా ఉంటారా?!' అనే ప్రశ్నలు వచ్చేస్తున్నాయి. డీసెంట్‌గా కనిపించేవారి పేర్లు సైతం వస్తుంటే.. అందరూ విస్తుపోతున్నారు. ఏది నిజం.. ఏది అబద్ధం.. అర్థం కాని పరిస్థితిలోకి వెళ్లిపోతున్నారు. డ్రగ్స్ ఎవరు వాడుతున్నారు.. ఎవరు వాడటం లేదు అనేది పక్కన పెడితే.. బాలీవుడ్, టాలీవుడ్.. ఏ వుడ్ అయినా సరే.. సెలబ్రిటీస్ డ్రగ్స్ వాడుతున్నారన్నది పచ్చి నిజం. అందులో ఎవరు మినహాయింపు అనేది వారికే తెలియాలి. అప్పటివరకు ఎన్నో పేర్లు వచ్చి పోతుంటాయి. కొందరు అమాయకుల పేర్లు కూడా వచ్చి.. వారి ఇమేజ్ డ్యామేజ్ చేయొచ్చు. కానీ ఆ రంగుల ప్రపంచంలో ఎవరి రంగు ఏంటో మనకు తెలియదు.. వారిలో వారికే తెలుస్తుంది.
కేసంతా డ్రగ్స్ చుట్టూనే...
'సినిమా ఇండిస్టీలో కొకైన్ వాడటం చాలా సహజం!' అని కంగనా రనౌత్ బాహటంగానే ప్రకటించింది. లేటెస్టుగా ఎండీ కావాలంటూ చాట్లు చేశారంటూ నమ్రతా శిరోద్కర్, దీపికా పదుకొనే, సారా ఆలీఖాన్, శ్రద్ధాకపూర్, రకుల్ ప్రీత్ వంటివారి పేర్లు కూడా రావడంతో.. మరింత సంచలనం రేగింది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సుశాంత్‌సింగ్ కేసులో ఎంటరైన దగ్గర నుంచి.. కేసు అంతా డ్రగ్స్ చుట్టూనే తిరుగుతోంది. ఇప్పుడు పేర్లు వచ్చినవారంతా వరసగా విచారణకూ హాజరవుతుంటే.. మరిన్ని తెర వెనుక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అసలు సుశాంత్ సింగ్ ఎందుకు చనిపోయాడు? ఎలా చనిపోయాడు? అనే దగ్గర నుంచి మొదలెడితే.. మనకు చాలా విషయాలు తెలుస్తాయి.
ఆఫర్ల దగ్గరే అసలు కథ...
సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్. ఒక అప్ కమింగ్ హీరో. సక్సెస్ టేస్ట్ చూశాడు. వరుసగా సినిమాలకు మంచి పేరొచ్చింది. మంచి ఆఫర్లు వచ్చాయి. ఈ ఆఫర్ల దగ్గరే అసలు కథ మొదలైంది. బాలీవుడ్ మాఫియా గురించి అందరికీ తెలియకపోయినా.. ఆ ఇండిస్టీవారికి మాత్రం తెలుసు. వారు చెప్పినవారినే తీసుకోవాలి.. వారు చెప్పినవారితోనే సినిమాలు నిర్మించాలి.. వారు చెప్పినవారికే సినిమాలు అమ్మాలి.. మొత్తం సినిమా వ్యాపారాన్నే వారు శాసిస్తున్నారు. ఈ మాఫియాలో ఇప్పటికే సక్సెస్ అయి, సెటిలైపోయిన వారితో పాటు.. అండర్ వరల్డ్ డాన్స్.. అలాగే ప్రభుత్వాల్లో పట్టు ఉన్నవారు.. అందరూ ఉన్నారు. ఆ మాఫియా సుశాంత్‌సింగ్ క్రేజ్‌ను వాడుకోవాలనుకుంది.
అందుకే కొన్ని సినిమాలు చేయాలని చెప్పారు. మామూలుగా అయితే పెద్ద పెద్ద నిర్మాతలు సినిమా చేయాలని హీరోను ఒప్పిస్తారు.. కథ చెప్పే పని లేదు. సినిమా చేయాలనుకున్నా.. ఏ కథ చేయాలన్నదానిపై వర్క్ చేస్తారు. అదే చిన్న నిర్మాత కథ చెప్పాక.. నచ్చితేనే హీరో ఒప్పుకుంటాడు. ఇక్కడ సుశాంత్‌సింగ్ ఈ రూల్ బ్రేక్ చేశాడు. తనకు కథ నచ్చితేనే సినిమా చేస్తానని పట్టుబట్టాడు. ఆ కథ విన్నాక చేయనని చెప్పాడు. బాలీవుడ్‌ను శాసిస్తున్నవారికి ఆ తిరస్కారం ఎలా ఉంటుంది? అందుకే సుశాంత్ కథలు నచ్చి, ఒప్పుకున్న సినిమాలను ఆపేసే పనిలో పడ్డారు. ఆయా నిర్మాతలను బెదిరించి, సుశాంత్‌తో సినిమాలు తీయొద్దని చెప్పారు. ఒక్కొక్క ఫోన్ కాల్ వస్తున్న కొద్దీ సుశాంత్‌లో ముందు కసి పెరిగింది. పట్టుదల పెరిగింది. ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. కానీ అన్ని దారులు మూసేస్తున్న ఫీలింగ్ రావడంతో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడని చెబుతున్నారు. ఇక్కడే డ్రగ్స్ కథ మొదలైంది. ఆ డిప్రెషన్‌లోకి వెళ్లినవాడు డ్రగ్స్ వాడాడని రియా చెబుతోంది. ఏ డ్రగ్స్ వాడాడు..? ఎవరు ఇచ్చిన డ్రగ్స్ వాడాడు..? అసలీ డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి..? ఎవరెవరికి వస్తున్నాయి..? అనే ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు నడుస్తోంది.
ఫ్లాష్.. ఫ్లాష్‌బ్యాక్...
ఒక్కసారి మనం ఫ్లాష్ బ్యాక్‌కి వెళితే 2017లో టాలీవుడ్‌లో డ్రగ్స్ కలకలం రేగింది. ఒక డ్రగ్స్ రాకెట్ ముఠాను పట్టుకుంటే.. వారెవరికి సప్లరు చేస్తున్నారనేది అన్నీ విచారణలో బయటికొచ్చాయి. అప్పుడు పూరీ జగన్నాథ్, ఛార్మి, ముమైత్ ఖాన్, రవితేజ ఇంకా చిన్న స్టార్స్ చాలామంది పేర్లు వచ్చాయి. అంటే టాలీవుడ్‌లోనూ పార్టీలు జరుగుతాయి.. అక్కడా డ్రగ్స్ వాడతారనే విషయం అప్పుడే బయటపడింది. ఇక్కడ పొలిటికల్ కాంప్రమైజ్ జరిగింది. పెద్దపెద్దవాళ్ల పేర్లు రావడం.. వారంతా ప్రభుత్వాన్ని బతిమాలుకుని.. భారీగా ఫీజులు చెల్లించుకుని.. తమ పిల్లలు బయటపడేలా చూసుకున్నారు. అందుకే డ్రగ్స్ కేసులపై వేసిన ఛార్జిషీట్‌లో టాలీవుడ్ కేసుల ప్రస్తావనే లేదు. ఆ కేసును పట్టుదలగా ఇన్వెస్టిగేట్ చేసిన అకున్ సబర్వాల్ ఏమైపోయారో కూడా చూశాం. పైగా పూరీ జగన్నాథ్ లాంటివాళ్లు తమ పరువు తీసేశారని.. తమ కుటుంబసభ్యులు చాలా బాధపడ్డారని.. కబుర్లు చాలా చెప్పారు. కెమెరా ముందు కన్నీళ్లు కార్చడం వారికి అలవాటే కాబట్టి.. అలాంటి ప్రయత్నాలే చేశారు. కానీ అసలు నిజాలను కప్పెట్టేశారు.
అంతర్జాతీయ స్థాయిలో..
అయితే అసలు ఈ డ్రగ్స్ ఎక్కడ పుడుతు న్నాయి..? వీరికి ఎలా అందుతున్నాయి..? అనేది మాత్రం ఇప్పటికీ సస్పెన్సే. ఈ రహస్యం అధికారులకు, ప్రభుత్వాధినేతలకు మాత్రమే తెలుసు. ఎందుకంటే వారే కోఆపరేట్ చేసి కమీషన్లు తీసుకుని.. ఈ డ్రగ్స్ వ్యవహారాలను చూసీచూడనట్లు వదిలేసేది. అలా వదిలేయడానికే ఫీజు వసూలు చేస్తుంటారు. ఒక్కోసారి తమ పిల్లలూ ఆ ఉచ్చులో పడితే.. బయటపడేయటానికి ఆ ఫీజులే ఖర్చు కూడా పెట్టుకోవాల్సిన పరిస్థితులు. డ్రగ్స్ మాఫియా ఇంటర్నేషనల్ రేంజ్‌లో పనిచేస్తోంది. మన సినిమాల్లో చూపించినట్లే వారి నెట్‌వర్క్ చాలా పెద్దది.. బలమైనది కూడా. వారికి అడ్డొస్తే హత్యలు చేయడానికీ వెనుకాడరు. అధికారులను, ప్రజాప్రతినిధులను ముందే దారిలో పెట్టుకుంటారు. తర్వాత సెలబ్రిటీస్ పార్టీల్లోకి ఎంటరవుతారు. ఒక్కొక్కరికి మెల్లగా అలవాటు చేసే స్ట్రాటజీలు ఫాలో అవుతారు. కొత్తగా ఎంటరైనవారినీ ఈ రొచ్చులో దింపడానికి అప్పటికే కస్టమర్లుగా ఉన్నవారినే వాడతారు. అలా తమ నెట్‌వర్క్ పెంచుకుంటూ పోతారు. అయితే ఆ సెలబ్రిటీల్లోనే కెరీర్ పడిపోయి.. సంపాదన లేని టైమ్‌లో అదే డ్రగ్స్ అప్పటికే అలవాటైపోయి.. వదల్లేక.. వాటికి డబ్బులు పెట్టలేక నానాయాతన పడతారు. ఆ డ్రగ్స్ కోసం ఎంతకైనా దిగజారతారు. అప్పుడూ ఏవైనా అనుకోని పరిణామాలు జరిగి, వారు చనిపోయినా.. కేసును పక్కదారి పట్టించడానికి ఈ డ్రగ్స్ నెట్‌వర్క్ పనిచేస్తుంది.
ప్రభుత్వం తరపున ఎవరో ఒకరు అండగా ఉండేలా చూసుకుంటారు. ఎప్పుడన్నా నిజాయితీగా ఉండే అధికారి అడ్డుకున్నా వారికి బదిలీ అయిపోతుంది. ఏ నేత అయినా తెలిసి సీరియస్ అయినా.. ఆయన పదవి ఊడిపోతుంది. అంత స్ట్రాంగ్‌గా నెట్‌వర్క్ పనిచేస్తుంది. ఎప్పుడో ఎవడో ఒకడిని పట్టుకుని హడావుడి చేస్తారు.. ఆటోమేటిక్‌గా ఫోన్ వస్తుంది.. ప్యాకేజీ ఆఫర్ వస్తుంది. అంతే మెల్లగా ఆ కేసును సైడ్‌లైన్‌లో పెట్టేస్తారు. అసలు పార్టీలు అరేంజ్ చేసేదీ ఈ నెట్‌వర్కేనని ఇప్పుడు తెలుస్తోంది. ఏదో ఒక పేరుతో పార్టీలు పెట్టడం.. స్టార్స్ అంతా ఆ పార్టీకి వచ్చేలా చూసుకోవడం.. అక్కడ ఈ డ్రగ్స్ వాడటం ఒక స్ట్రాటజీగా ఫాలో అవుతున్నారు. స్టార్స్‌ను కొత్త సినిమాలకు ఒప్పించుకోవడానికి నిర్మాతలు, దర్శకులు... అవకాశాల కోసం కొత్త స్టార్లు... ఇలా అందరూ ఆ పార్టీల్లోకి ఎంటరవుతారు. వారి పనుల కోసం వారు వెళుతున్నామని అనుకుంటున్నారు.. కానీ వారంతా వారికి తెలియకుండానే డ్రగ్స్ నెట్‌వర్క్‌లోకి వెళ్లిపోతున్నారు.
గ్లామర్ ప్రపంచమే మత్తెక్కించే ప్రపంచం.. కిక్కిచ్చే ప్రపంచం.. ఆ రంగుల్లోకి వెళ్లి తేలిపోతూ.. అదే ప్రపంచం అనుకుంటూ కాలం గడిపేస్తున్నారు. గ్లామర్ అంటే నిర్వచనం మార్చేసుకుని.. అందంగా కనపడటం అంటే రంగు, శరీర సౌష్టవం అనేసుకుని.. అవి లేకపోతే జీవితమే లేనట్లుగా పరిస్థితులు మార్చేశారు. అందంగా ఉంటేనే మరో మనిషి పలకరిస్తారనే పరిస్థితికి వచ్చేశారు. అందుకే దాని కోసమే పాకులాడుతున్నారు. ఒక పని చేసుకోవడం కోసం గ్లామర్ ఒలికించినా తప్పు లేదనే స్టేజి నుంచి.. ఎఫెయిర్స్ వరకూ వెళ్లిపోయారు. ఆ ప్రపంచంలోకి డ్రగ్స్ ఎంటరైపోయాయి. ఇప్పుడు ఆ డ్రగ్సే వారి జీవిత గమనాన్ని నిర్దేశిస్తున్నాయి. సహజంగా పుట్టుకతో వచ్చిన అందాన్ని ఆరోగ్యంగా కాపాడుకుని.. స్వచ్ఛమైన జీవితాన్ని గడపాలనుకునేవారికి ఈ రొచ్చులోకి దిగాల్సిన అవసరం ఉండదు. మన లైఫ్‌స్టైల్‌ని మనం సరిచేసుకోగలిగితే ఈ పరిస్థితులు రావు. అవి రానంత కాలం.. గ్లామర్ ప్రపంచం పరుగులు పెడుతున్నంత కాలం.. డ్రగ్స్ వెంటాడుతూనే ఉంటాయి.. ఈ మాఫియా సెలబ్రిటీస్‌తో పాటు సామాన్యులనూ బలి తీసుకుంటాయి.
రాజకీయ నీడలు.. క్రీడలు ...
అసలు దీనిపై రాజకీయ రగడ ఎందుకు నడుస్తుందనేది తెలియాలంటే కొంచెం లోతుగా వెళ్లాలి. సుశాంత్‌సింగ్ మరణానికి ముందు ఓ పార్టీ జరిగింది. అందులో శివసేన అధినేత, సీఎం ఉద్ధవ్ థాక్రే కుమారుడు ఆదిత్య థాక్రే కూడా ఉన్నాడు. కుర్రాడు.. మంత్రిగానూ ఉన్నాడు. అయినా బాలీవుడ్ సెలిబ్రిటీస్‌తో ఫ్రెండ్ షిప్ ఎక్కువ.. మనోడూ సెలిబ్రిటీగా మారిపోయాడు. సర్కారే వెనుక ఉండటంతో.. ఈ సర్కార్ రాజ్ మరింత ముదిరి, సినిమాల వ్యాపారంలోనూ వేలు పెట్టించారు. ఎవరైనా తమ మాట వినకపోతే బాలీవుడ్ మాఫియా.. ఆదిత్య థాక్రేనీ వారిపైకి ప్రయోగించింది. ముంబైలో అంత పరపతి కలిగిన థాక్రే చెప్పాక.. ఎవరైనా వినక తప్పదు. ఇక్కడ సుశాంత్ విషయంలోనూ అదే జరిగింది. అయినా సుశాంత్ వినలేదు. పార్టీలన్నిటిలోనూ డ్రగ్స్ సరఫరా జరిగిందని ఇప్పుడు నిర్ధారణ అయింది. మరి ఆ పార్టీల్లో పాల్గొన్న మంత్రికి ఈ విషయం తెలియదనుకోవాలా? డ్రగ్స్ కామన్ అని కంగనా రనౌత్ చెబుతోంది. రనౌత్ మాటను వదిలేస్తే.. వ్యవహారం తమకు చుట్టుకుంటుందని భయపడ్డ శివసేన ఎదురుదాడి మొదలెట్టింది. శివసేన దొరికొంది మనకు.. ఆడుకోవాలని బిజెపి ఎంటరైపోయింది. కంగనాకు మద్దతుగా నిలిచి.. కథను మరింత ముందుకు నెడుతోంది. పైగా సుశాంత్ బీహారీ కావడం.. బీహార్‌లో ఇప్పుడు ఎన్నికలు రావడంతో.. అది మరింత రాజకీయ రంగు పులుముకుంది.
ఎందుకు అడిక్ట్ అవుతున్నారు?
అసలు సెలబ్రిటీస్ ఎందుకు ఈ డ్రగ్స్ ఉచ్చులో పడుతున్నారు? ఆ వుడ్ ఈ వుడ్ అని తేడా లేకుండా ఎలా దీనికి అడిక్ట్ అవుతున్నారు? ఇవే ప్రశ్నలు ఇప్పుడు వేధిస్తున్నాయి. ఎందుకంటే మామూలుగా అయితే.. ఎవడైనా బాధలో ఉంటే మందు తాగుతాడు. అలా బానిసైపోయి.. అదే బాగుందనుకుని కంటిన్యూ చేస్తాడు. చివరకు ఆరోగ్యం పాడై.. శాశ్వతంగా దూరమవుతాడు. ఇది మనకు ఎప్పటి నుంచో తెలిసిన కాన్సెప్ట్. కానీ ఇప్పుడు మనం పరిశీలిస్తే.. బాధే కాదు.. ఆనందం వచ్చినా మందు తాగుతున్నారు. బర్త్ డే అంటే మందు... చిన్న ఫంక్షన్ జరిగినా మందు.. అసలు నలుగురు కలిస్తే చాలు మందు కొట్టడం అనేది సాధారణమైపోయింది. మంచినీళ్లు తాగినంత ఈజీగా మందు తాగేస్తున్నారు. ఇది కింది స్థాయి మనుషుల సంగతి.
కానీ పై స్థాయి మనుషులు.. అంటే డబ్బులు బాగా ఉన్నోళ్లు.. రిచ్ పీపుల్‌కి ఈ మందు ఇచ్చే కిక్ సరిపోవడం లేదు. అందుకే వారిపై డ్రగ్స్ మాఫియా వల విసురుతోంది. రోజంతా షూటింగులు.. రాత్రంతా పార్టీలు.. గడియారంలో ఇంకా గంటలు మిగిలి ఉంటే.. వాటినీ గడిపేస్తారు. అలాంటివారికి మరి శరీరం సహకరించాలిగా.. అంత ఓపిక ఎలా వస్తుంది? నేచురల్‌గా రాదు. మన డాక్టర్లు చెప్పినట్లు.. కనీసం 6 నుంచి 8 గంటలైనా నిద్రపోకపోతే మనిషి ఆరోగ్యంగా ఉండలేడు. అలాగే రాత్రి కాకుండా పగలు నిద్రపోతే కూడా ఆరోగ్యం పాడవుతుంది. మరి ఇవన్నీ దాటేసి.. తమ ఎంజారుమెంట్‌ని ఎంచక్కా కొనసాగించాలంటే.. ఈ డ్రగ్స్ కావాలి. అలా ఈ క్లాసు చెప్పేసి.. మెల్లగా డ్రగ్స్ అలవాటు చేస్తారు. ఇక ఒకసారి అలవాటయ్యాక ఆటోమేటిక్‌గా అడిక్ట్ అయిపోతారు. గ్లామర్ ప్రపంచంలో మరింత గ్లామర్‌గా కనపడటానికి .. వయసు పెరిగినా గ్లామర్ తరగకుండా ఉండటానికి.. బాడీ అందంగా షేపప్ అవటానికి ఇలా వారు అందంగా, ఆరోగ్యంగా కనపడటానికి శరీరానికి వేసుకునే మేకప్పే డ్రగ్స్. ఇక ఈ సెలబ్రిటీస్.. విశృంఖలత్వానికీ అలవాటుపడ్డారు. ఒక్కొక్కరికి ఐదారు ఎఫెయిర్స్ ఉండటం స్టేటస్‌గా ఫీలవుతున్నారు. సెక్స్ స్కోర్లు పెంచుకోవడానికీ డ్రగ్స్ వాడేస్తున్నారన్నది నగ సత్యం. అసలు సామాన్యుడు అయితే ఈ ఎఫెయిర్లు, వ్యవహారాలు.. ఏజ్‌కి సంబంధం లేని సంగతులు తెలుసుకుని.. తాను చేతకానివాడినా అని ఫీలయ్యే పరిస్థితి వచ్చేసింది. అంతలా సెలబ్రిటిస్ డ్రగ్స్ మత్తులో మునిగి తేలుతూ.. తాము నిజంగానే హీరోలమనే ఫీలింగులోకి వెళ్లిపోతున్నారు. వీరి ఈ యాటిట్యూడ్‌ని.. డ్రగ్స్ మాఫియా బాగా క్యాష్ చేసుకుంటుంది.
సామాన్యులు తమ సంపాదన కోసం నానా చాకిరీ చేసి.. ఒక రేంజ్ వాళ్లు ఉద్యోగాలు చేసి.. చివరకు ఇంటికి చేరేసరికి వారి బ్యాటరీ అయిపోతుంది. షుగర్, బీపీలు వస్తే గానీ వాకింగ్ మొదలెట్టలేని మానసిక స్థితిలో ఉంటున్నారు. ఉన్నత మధ్యతరగతి మాత్రమే జిమ్‌లు వంటివాటికి ఏ ఏజ్‌లో అయినా టైమ్ కేటాయించేది. 30 ఏళ్ల లోపువారు మాత్రమే ఎంత బిజీగా ఉన్నా వ్యాయామానికి, ఫిట్‌నెస్‌కి ప్రాధాన్యత ఇవ్వగలుగుతున్నారు. వీరంతా సెలబ్రిటీస్‌ని చూసి ఆశ్చర్యపోతున్నారు. ఒక హీరోయిన్ గురించి.. టైమ్ దొరికితే జిమ్ చేసేస్తుంది.. ఎయిర్‌పోర్టు లాంజ్‌లోనూ వర్కవుట్ చేస్తుందని చాలా ఆశ్చర్యంగా చెప్పేవారు. ఆ హీరోయిన్ పేరు ఇప్పుడు డ్రగ్స్ వాడేవారి లిస్టులోకి వచ్చింది. చాలా ఎనర్జిటిక్‌గా డ్యాన్సులు వేస్తాడు.. అలసట అనేది లేకుండా షూటింగులు చేస్తారు.. అనుకునేవారి పేర్లూ టాలీవుడ్ డ్రగ్స్ కేసు సందర్భంలో బయటికి వచ్చాయి. భారీ కండలతో కటౌట్‌తోనే కటింగ్ ఇచ్చే హీరోల పేర్లూ ఇందులో వచ్చాయి.
మామూలు జనం అయితే.. ఈ హీరో ఇంతలా ఎలా మెయిన్‌టెయిన్ చేస్తున్నాడు.. ఆ హీరోయిన్ ఇంత వయసు వచ్చినా అంత గ్లామర్‌గా ఎలా ఉంటుంది.. మనం 30 దాటితే ముసలోళ్లమనే పరిస్థితిలోకి పడుతుంటే.. 60 ఏళ్లు దాటినా సెలబ్రిటీస్ అంతలా ఎలా ఉండగలుగుతున్నారనే ప్రశ్న.. ప్రతి ఒక్కరికీ వచ్చే ఉంటుంది. వారి మెయిన్‌టెయిన్ చేసే లైఫ్‌స్టైల్.. డబ్బు అందుబాటులో ఉండటం.. అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవడం ఒక ఎత్తయితే.. ఈ డ్రగ్స్ మరో ఎత్తు. ఆ విషయం తెలియక సామాన్యుడు తాను వెనకబడిపోతున్నాననే ఫీలింగులోకి వెళ్లిపోతున్నాడు. చివరకు భర్తలు భార్యలను, భార్యలు భర్తలను.. వయసుతో సంబంధం లేకుండా ఫిట్‌నెస్ గురించి కామెంట్స్ చేసుకునే పరిస్థితులకు నెట్టివేయబడుతున్నారు.
మత్తులో..
ఇప్పుడు సుశాంత్ కేసు విచారణ ద్వారా బయటపడ్డ విషయం ఏంటంటే.. బాలీవుడ్‌లో చాలామంది డ్రగ్స్ వాడుతున్నారు. ఈ నెట్‌వర్క్ బాలీవుడ్‌కే పరిమితం కాలేదు. కర్నాటకలోని శాండిల్ వుడ్ తారలు సంజనా, రాగిణి వంటివారికి డ్రగ్స్ వెళ్లాయని వార్తలొచ్చాయి. అలాగే ముంబైతో సంబంధాలున్న టాలీవుడ్ వారికి డ్రగ్స్ అందుతున్నట్లు తెలుస్తోంది. ఇలా దేశంలో సెలబ్రిటీలంతా ఈ డ్రగ్స్ మత్తులో మునిగి తేలుతున్నట్లు వస్తున్న వార్తలు సంచలనాత్మకంగా మారాయి. ఒకప్పుడు సంజరు దత్ ఇదే డ్రగ్స్ బారిన పడి తన లైఫ్‌ను పాడుచేసుకున్నాడు. ఈ మధ్య రిలీజ్ అయిన 'సంజు' సినిమాలో ఆ విషయాలు స్పష్టంగా చూపించారు. డిప్రెషన్‌లో లేకపోయినా.. అతడికి డ్రగ్స్ ఎలా అలవాటు చేశారు.. చివరకు ఎలా బానిస అయిపోయాడో చూపించారు. మనకు ఇప్పటివరకు అతడి తల్లి చనిపోయినందుకే డిప్రెషన్‌కు వెళ్లి, డ్రగ్స్‌కు బానిసయ్యాడనే తెలుసు. కానీ అతడి ఫ్రెండ్స్.. అంటే ఈ డ్రగ్స్ మాఫియా.. అతడిని ఈ రొంపిలోకి దింపిందని ఆ సినిమాలో చూపించారు. దీనివలన యంగ్ ఏజ్‌లో అతడి కెరీర్ ఎంత నాశనమైందీ చూపించారు. అదే ఆ ఎపిసోడ్ లేకపోతే.. అతడి కెరీర్ ఎప్పుడో పీక్స్‌కి వెళ్లేది. కానీ అతడి ఏజ్ 50 దాటాకగానీ అతడికి స్టార్ డమ్ రాలేదు. అలాగే జీనత్ అమన్ లాంటి హీరోయిన్లు మత్తుకు బానిసై ఎలా చనిపోయారో చూశాం. మందుకు బానిసై చనిపోయిన మహానటి సావిత్రి గురించి మనకందరికీ తెలుసు. కెరీర్ కోల్పోయినవాళ్లు మందుకు బానిసై.. చనిపోయిన సంఘటనలు అనేకం.
ఒకప్పుడు నందమూరి తారక రామారావు ఎంత ఆరోగ్యంగా ఉండేవారు. ఉదయాన్నే వ్యాయామం.. సరైన ఆహార పద్ధతులు పాటిస్తూ.. అరవై ఏళ్ల వరకూ హీరోగా నటించారు. అలా పాత తరం హీరో హీరోయిన్లు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా నియమాలు పాటించేవారు. రోజులు మారిపోయాయి.. సినిమా వ్యాపారం స్థాయి పెరిగిపోయింది. లక్షలు కోట్లు అయ్యాయి.. వందల కోట్ల వ్యాపారం ఒక్క సినిమానే చేసేస్తుంది. ఈ రేసులో పరుగులు పెట్టడానికి గుర్రాల్లా మారి.. అలా పరిగెత్తడానికి డ్రగ్స్ తీసుకునే స్థాయికి సినిమా ఎదిగిపోయింది. అందులో వీళ్లంతా పావులుగా మారిపోయారు.
- కిరణ్