Apr 14,2023 16:21
  •  గడియార స్తంభం సెంటర్ లో అంబేద్కర్ విగ్రహం వద్ద నివాళులర్పించిన అనంతరం దళిత సంఘాల నాయకులతో జిల్లా ఎస్పీ.
  • పల్నాడు జిల్లా ఎస్పీ వై.రవి శంకర్ రెడ్డి.

ప్రజాశక్తి-నరసరావుపేట : గొప్ప సంఘ సంస్కర్త స్వాతంత్ర్య సమరయోధుడు, భారత రాజ్యాంగ రూపశిల్పి, సామాజిక సంస్కర్త,అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహానుభావుడు భారతరత్న డాక్టర్ అంబేడ్కర్ అని పల్నాడు జిల్లా ఎస్పీ వై.రవి శంకర్ రెడ్డి అన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132 జయంతి సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో అంబేద్కర్ చిత్ర పటానికి, పల్నాడు రోడ్డులోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులలర్పించారు. భారత రాజ్యాంగాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగంగా తీర్చిదిద్ది, భారతదేశం అత్యున్నత ప్రజాస్వామ్య దేశంగా అవతరించడంలో విశేష కృషి చేశారని కొనియాడారు. సమాజంలో అస్పృశ్యత నివారణ కోసం, అణగారిన వర్గాల అభ్యున్నతికి కోసం అలుపెరుగని యోధుడిలా శ్రమించి, భావి తరాలకు బాటలు వేశారన్నారు. భారత రాజ్యాంగ శిల్పిగా, ప్రజాస్వామ్య పరిరక్షకునిగా, సంఘసంస్కర్తగా, మహా మేధావిగా విఖ్యాతుడైన డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ(ఏఆర్) రాజు,నరసరావుపేట డిఎస్పీ విజయ భాస్కర్,పుడా ఛైర్మన్ మిట్టపల్లి రమేష్,ఇతర పోలీస్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.