Jul 31,2022 07:00

     'కర్షక వీరుల కాయం నిండా/ కాలువగట్టే ఘర్మజలానికి/ ఘర్మజలానికి/ ధర్మజలానికి/ ఘర్మజలానికి ఖరీదు లేదోయ్' అని మహాకవి శ్రీశ్రీ చెప్పిన దానిలో 'ధర్మజల'మనేది అమ్మ పాలకూ వర్తించే గొప్ప పదం. తల్లిప్రేమకు సాటి మరేదీ రాదు. తల్లిపాలకు మరే ప్రత్యామ్నాయమూ లేదు. తల్లి పాల ప్రాధాన్యతను తెలిపే ఆవు-పులి కథ అందరికీ తెలిసిందే. అడవికి మేతకెళ్లిన ఆవు... ఓ పులికి చిక్కుతుంది. చంపేస్తానని హూంకరిస్తుంది. అలాంటి ప్రాణాపాయ స్థితిలోనూ ఆవుకు తన బుజ్జి దూడ గుర్తొస్తుంది. తల్లి మనసు తల్లడిల్లుతుంది. బిడ్డకు చివరిసారిగా పాలిచ్చి వస్తానని పులిని బతిమాలుతుంది. ఆ ఆవు చివరి కోరిక తన బిడ్డకు పాలివ్వడమే. దీన్నే భోజరాజీయంలో 'మునుమును బుట్టి నాకు నొక ముద్దుల పట్టి, యతండు పుటియే/ డెనిమిది నాళ్ళపాటిగలడింతియ, పూరియు మేయ నేరడే/ జని, కడుపార జనుడిపి చయ్యన వచ్చెద, నన్ను బోయిర/ మ్మని సుకృతంబు గట్టి కొన వన్న దయాగుణ ముల్లసిల్ల గన్‌' అని వర్ణించాడు కవి. అమ్మ ప్రేమకూ... అమ్మ పాలకూ జాతి భేదాల్లేవు. అన్ని జీవుల్లోనూ తల్లి తల్లే. అది శునకమైనా, వరాహమైనా, గోవైనా... ఏ జంతువైనా తన బిడ్డకు ఎంతో ఆప్యాయంగా పాలిస్తూ తన్మయత్వం చెందుతాయి.
      తల్లి పాలు... కల్తీ లేనివి, కల్తీ చేయలేనివి. నవమాసాలు గర్భంలో ఉన్న బిడ్డతో ప్రేమ బంధాన్ని మరింత బలోపేతం చేసేవి. ఉద్యోగ అవసరాలు, అనారోగ్యం వంటి కారణాలతో కొందరు తల్లులు బిడ్డలకు పోతపాలు పడుతుంటారు. ఈ అవసరాన్ని కూడా సొమ్ము చేసుకునే ప్రబుద్ధులు... స్వచ్ఛమైన పాలను కల్తీ చేస్తున్న ఘటనలు కోకొల్లలు. పాలు కరువై... పొంగునీళ్లతో పసి కడుపు నింపే తల్లులకూ ఈ దేశంలో కొదవ లేదు. 70 కోట్ల మంది పేద ప్రజలున్న ఈ దేశంలో, మూడు పూటలా తినేందుకు సరైన ఆహారం కూడా లేక అర్ధాకలి జీవితాలు గడుపుతున్నారు. పౌష్టికాహార లోపంతో లక్షలాది బిడ్డలు అనారోగ్యం పాలవుతున్నారు. మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా పసిబిడ్డలు తాగే పాలపై కూడా జిఎస్టీ విధించిన ఘనత మోడీ ప్రభుత్వానిది. 'బిడ్డల పాలకై / బిచ్చమెత్తు దేశంలో/ రాళ్లకు పాలిచ్చు/ కథ నశించునదెన్నడో' అంటాడు కరుణానిధి. తల్లిపాలు తాగని నవజాత శిశువులు డయేరియా వ్యాధిన పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. డబ్బా పాలతో ఇన్‌ఫెక్షన్‌ ఎక్కువగా... ఎదుగుదల తక్కువగా ఉంటుంది. అప్పుడే పుట్టిన బిడ్డకు తప్పనిసరిగా ముర్రుపాలు పట్టించాలి. ఆ పాలలో శక్తివంతమైన యాంటీబాడీలు ఉంటాయి. ఇవి బిడ్డకు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తినిస్తాయి. ముర్రుపాలు బిడ్డకు మొదటి వ్యాధి నిరోధక టీకా అని చెప్పొచ్చు. అలాంటి బలమైన తల్లిపాలు సరిపోక, భారతదేశంలో ఏటా లక్షమంది శిశువులు చనిపోతున్నట్లు ఐక్యరాజ్య సమితి లెక్క కట్టింది. 'ప్రేమను రంగరించి శిశు ప్రాణము నిల్పగ చాలినంతగా' పాలు అమ్మల దగ్గర లేకపోవడం ఒక కారణం.
     తల్లిపాలను, కన్నీళ్లను కూడా కల్తీ చేసే కార్పొరేట్‌ వ్యాపార సంస్కృతికి పాలుతాగే బిడ్డలు బలవుతున్నారు. అనారోగ్యం పాలవుతున్నారు. కల్తీ పాలను అరికట్టాల్సిన ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తల్లి పాల విశిష్టతను తెలిపేందుకు ప్రపంచ వ్యాప్తంగా ప్రతియేటా ఆగస్టు మొదటి వారంలో 'తల్లిపాల వారోత్సవాలు' నిర్వహిస్తున్నారు. పిల్లలకు తల్లిపాలు ఇవ్వకుంటే భవిష్యత్‌లో అనేక ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం వుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. నవజాత శిశువుకు తల్లిపాలు అమృత తుల్యం. ప్రకృతి ప్రసాదించిన అత్యుత్తమ పౌష్టికాహారం తల్లిపాలే. నెలలు నిండకుండా పుట్టి ఎన్‌ఐసియులో ఉన్న పిల్లలకు పీడియాట్రిక్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో మిల్క్‌ బ్యాంకులు ఉన్నాయి. పాలు దానం చేయాలనుకునే తల్లులు ఈ మిల్క్‌ బ్యాంకులకు దానం చేయవచ్చు. 'పసివగ్గు తొలి ఆరుమాసాలూ సంపూర్ణంగా తల్లిపాలమీదే ఆధారపడే క్షీరద' అని ఆయుర్వేదం చెబుతోంది. 'డబ్బా పాలు వద్దు- తల్లి పాలే ముద్దు' అనే నినాదం నలుదిక్కులా మార్మోగాలి. అప్పుడే మహాకవి జాషువా పేర్కొన్నట్లు 'అక్షయంబులైన మాతక్షీర మధురధార/ లన్నంబుగా తెచ్చుకున్న అతిథి'కి ఆహారం, ఆరోగ్యం దక్కుతుంది. అమ్మపాలే మిసిమి ప్రాయంలోనూ, ముదిమి వయసులోనూ సంజీవని.