మారుతున్న భౌగోళిక, రాజకీయ పరిస్థితుల్లో ఐక్యరాజ్యసమితి (ఐరాస) తన ప్రత్యేకతను నిలబెట్టుకోవాలంటే ఇప్పుడున్న పద్ధతిలో అది అసాధ్యం. ఈ ప్రపంచ సంస్థ ఏర్పడి 75 ఏళ్లు కావస్తోంది. ఈ ఏడున్నర దశాబ్దాల కాలంలో అంతర్జాతీయ యవనికపై అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లో పెను మార్పులు సంభవించాయి. ఐరాస ఏర్పడినప్పుడు 51 దేశాలే ఉండేవి, నేడు అది 193 దేశాలకు విస్తరించింది. పెరిగిన పరిమాణానికి తగ్గట్టే ఆకాంక్షలూ పెరిగాయి. 21వ శతాబ్దంలో మెరుగైన ప్రపంచాన్ని నిర్మించాలన్నా, సభ్య దేశాల ఆకాంక్షలు నెరవేర్చాలన్నా ఐరాసలో అంతర్గత సంస్కరణలు తప్పనిసరి. అమెరికా సామ్రాజ్యవాదం ప్రపంచానికి అత్యంత ప్రమాదకారిగా ముందుకొచ్చిన ఈ తరుణంలో ఐరాసను పటిష్టపరచుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అన్యాయం, అమానుషత్వంతో కూడిన ఏక ధ్రువ ప్రపంచాన్ని ఇంకా కొనసాగించాలని చూసే అమెరికా, దాని మిత్రదేశాలు ఒకవైపు, బహుళత్వం, న్యాయమైన ప్రాతినిధ్యం, సమాన హక్కులతో కూడిన బహుళ ధ్రువ ప్రపంచాన్ని కోరుకునే తక్కిన ప్రపంచం ఇంకొకవైపు నిలిచాయి. ఈ రెండిటి మధ్య సాగుతున్న ఘర్షణలో ఐరాస ఎటు వైపో తేల్చుకోవాలి. అక్టోబరు 24 నాటికి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా విడుదలజేసే డిక్లరేషన్‌లో దీనిపై ఐరాస ఒక స్పష్టత ఇవ్వాల్సిన అవసరముంది. అమెరికా పెత్తందారీ పోకడలను, దుందుడుకువాద చర్యలను నిలువరించడంలో ఈ ప్రపంచ సంస్థ విఫలమైందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఇరాక్‌పై ఏకపక్షంగా దురాక్రమణపూరిత దాడికి అమెరికా తెగబడినప్పుడు దానిని అడ్డుకోవాల్సిన ఐరాస అచేతనంగా ఉండిపోయింది. లిబియాపై అమెరికా, యూరపు లోని సామ్రాజ్యవాద దేశాలు కూడబలుక్కుని దాడి చేసి, ఆ దేశాధ్యక్షుడు గడాఫీని దుర్మార్గంగా కాల్చి చంపితే చేష్టలుడిగినట్టు వ్యవహరించింది. క్యూబాపై 60 ఏళ్లుగా అమెరికా సాగిస్తున్న ఆర్థిక, వాణిజ్య దిగ్బంధనాన్ని ఎత్తివేయాలని ఐరాస జనరల్ అసెంబ్లీ వరుసగా 28 సార్లు తీర్మానించినా వాటికి వీసమెత్తు విలువ కూడా లేకపోయింది. ఈ పరిణామాలు ఐరాస అసమర్థ నిర్వాకాన్ని ఎత్తిచూపడమే కాదు, ఆ సంస్థ విశ్వసనీయతను, ప్రతిష్టను దారుణంగా దెబ్బతీశాయి. ప్రపంచ శాంతి, భద్రత పరిరక్షణకు పూచీ పడాల్సిన ఐక్యరాజ్యసమితి ఆ బాధ్యతను నిర్వర్తించడంలో తరచూ విఫలమవుతోంది. ఇందుకు కారణం దాని అంతర్గత నిర్మాణంలో ఉన్న బలహీనతే తప్ప మరొకటి కాదు. 1990లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తరువాత అమెరికా మరింతగా బరితెగించింది. ట్రంప్ అధికారంలోకి వచ్చాక 'అమెరికా ఫస్ట్' అన్న నినాదంతో అంతర్జాతీయ బహుళత్వ సంస్థలైన ఐరాస, డబ్ల్యుటివోలను బాహాటంగా సవాల్ చేస్తున్నాడు. పారిస్ వాతావరణ ఒప్పందం నుంచి అమెరికా ఏకపక్షంగా ఉపసంహరించుకోవడం, ఇరాన్‌తో కుదుర్చుకున్న బహుళపక్ష అణు ఒప్పందం నుంచి తప్పుకోవడం, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ), యునెస్కోల నుంచి వైదొలగడం వంటి చర్యలు అమెరికా బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. కరోనా మహమ్మారిపై పోరులో ఊరందరిదీ ఒక దారి అయితే ఉలిపికట్టెదొక దారి అన్నట్టుగా అగ్రరాజ్యం వ్యవహరించిన తీరు రోత పుట్టిస్తోంది. ట్రంప్ ప్రభుత్వ నేరపూరిత నిర్లక్ష్యానికి రెండు లక్షల మంది అమెరికన్లు ఇప్పటికే బలయ్యారు. ట్రంప్ ప్రభుత్వ ఫాసిస్టు పోకడలకు చెక్ పెట్టాల్సిన అంతర్జాతీయ సంస్థ చేష్టలుడిగినట్టు వ్యవహరిస్తే ఇంకా ప్రపంచానికి దిక్కెవరు? అంతమాత్రం చేత ఐరాస ఉత్త పనికిమాలినదని ముద్ర వేయడమూ సముచితం అనిపించుకోదు. మానవ హక్కుల కమిషన్, యుఎన్‌డిపి, యునెస్కో, యనిసెఫ్, డబ్ల్యుహెచ్‌ఓ వంటి ఐరాస అనుబంధ సంస్థల వల్ల పేద, వర్థమాన దేశాల ప్రజానీకానికి ఎంతో కొంత మేలు చేకూరుతున్నది. దీనిని ఈ విధంగా కూడా ఉండనీయరాదని, మొత్తం నాశనం చేయాలని అమెరికా ఒక పథకం ప్రకారం ప్రయత్నిస్తున్నది. ఐరాసకు నిధులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం ఇందులో భాగమే. ఈ పరిస్థితుల్లో ఐరాసను పునరుజ్జీవింపజేయాల్సిన అవసరముంది. అత్యంత అన్యాయంగా ఉన్న భద్రతా మండలిలో పొందికను వెంటనే మార్చాలి. మండలి విస్తరణలో అన్ని ఖండాలకు సమ ప్రాధాన్యం ఉండేలా చూడాలి. ఇప్పటికే జి4 గా పిలువబడే జర్మనీ, జపాన్, భారత్, బ్రెజిల్ భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం పోటీ పడుతున్నాయి. అతి పెద్దదైన ఆఫ్రికా ఖండం నుంచి ఒక్క దేశానికి కూడా మండలిలో శాశ్వత సభ్యత్వం లేకపోవడం చాలా అన్యాయం. ఈ లోపాలను సరిదిద్దడంతో బాటు ఐరాస లోని అన్ని దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవించేలా, బహుళత్వానికి, పరస్పర సహకారం, సంఘీభావానికి, ప్రజాతంత్ర విలువలకు పెద్దపీట వేసేలా ఈ ప్రపంచ సంస్థను తీర్చిదిద్దాలి. అప్పుడే ఐరాసకు సార్థకత. ప్రస్తుతం జరుగుతున్న ఐరాస జనరల్ అసెంబ్లీ 75వ వార్షిక సమావేశాలు దీనికి నాంది పలుకుతాయని ఆశిద్దాం.










