Jul 18,2023 09:40

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : అస్సోం నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ చేపట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (సిఇసి) అనుసరించిన విధానాన్ని సవాలు చేస్తూ అస్సోంలోని పది మంది ప్రతిపక్ష పార్టీల నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ముసాయిదా ప్రతిపాదనను సవాలు చేస్తూ సోమవారం మనోరంజన్‌ తాలూక్దార్‌ (సిపిఎం)తోపాటు దేబబ్రత సైకియా, రోకిబుల్‌ హుస్సేన్‌ (కాంగ్రెస్‌), ఘనకాంత చుటియా (టిఎంసి), మహేంద్ర భుయాన్‌ (ఎన్‌సిపి), మునిన్‌ మహంత (సిపిఐ), స్వర్ణ హజారికా (ఆర్‌జెడి), అఖిల్‌ గొగోరు (రైజోర్‌ దళ్‌), లూరింజ్యోతి గొగోరు (అస్సోం జాతీయ పరిషత్‌), దిగంత కొన్వర్‌ (అంచలిక్‌ గణ మోర్చా) సహా తొమ్మిది ప్రతిపక్ష పార్టీలకు చెందిన 10 మంది నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వీరి తరపున న్యాయవాది ఫుజైల్‌ అహ్మద్‌ అయ్యూబీ పిటిషన్‌ దాఖలు చేశారు. 1950 ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 8ఎని కూడా పిటిషన్‌ సవాలు చేశారు. దీని ఆధారంగా ఇసిఐ డీలిమిటేషన్‌ ప్రక్రియను నిర్వహించడంలో తన అధికారాన్ని వినియోగించుకుంటోందని పేర్కొంది. జూన్‌ 20న జారీ చేసిన ముసాయిదా ఉత్తర్వులతో అస్సోంలోని 126 అసెంబ్లీ, 14 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిని సరిదిద్దుతూ ఇసి చేసిన ప్రతిపాదనలను పిటిషనర్లు సవాలు చేశారు. అతిపెద్ద, అతిచిన్న నియోజకవర్గాల జనాభా మధ్య 33 శాతం వరకు తేడా ఉందని పిటిషనర్లు పేర్కొన్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 8ఎకి సవాలు విషయానికొస్తే, అస్సోం రాష్ట్రానికి ఈ నిబంధన ఏకపక్షంగా, అపారదర్శకంగా, వివక్షపూరితంగా ఉందని పిటిషనర్లు వాదించారు.