అమెరికా 59వ అధ్యక్ష ఎన్నికల్లో 46వ అధ్యక్షుడిని ఎన్నుకోవటానికి నవంబర్ 3వ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి. అమెరికాలో ఉన్న వెసులుబాటు దృష్ట్యా ఇప్పటికే పోలింగ్ కేంద్రాలు, మెయిల్ ద్వారా దాదాపు 5 కోట్ల మందికి పైగా ఓటు వేశారు. కరోనా వైరస్ సోకి దాదాపు 3 లక్షల మంది అమెరికన్లు మరణించిన నేపథ్యంలో, ఆర్థిక సంక్షోభం వలన నిరుద్యోగం 14 శాతం దాటిన పరిస్థితులలో, అమెరికా స్థూల జాతీయోత్పత్తి - 9.5 శాతం క్షీణించిన పరిస్థితులలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రధాన పార్టీలైన రిపబ్లికన్ పార్టీ తరపున డొనాల్డ్ ట్రంప్ తిరిగి పోటీ చేస్తుండగా, డెమొక్రటిక్ పార్టీ తరపున జో బిడెన్ పోటీ చేస్తున్నారు. వచ్చే వారంలో విజేత ఎవరో ప్రజలు తేలుస్తారు.
అమెరికాలో అధ్యక్ష పాలనా విధానం
అమెరికా రాజ్యాంగం దేశంలో అధ్యక్ష పాలనా విధానం ప్రవేశ పెట్టినది. జాతీయ స్థాయిలో అధ్యక్షుడు, రాష్ట్ర స్థాయిలో గవర్నర్ నిజమైన అధికారాలు కలిగి ఉంటారు. అధ్యక్షుని పదవీ కాలం 4 సంవత్సరాలు. ప్రతి లీపు సంవత్సరంలో నవంబర్ మొదటి సోమవారం తర్వాత వచ్చే మంగళవారం నాడు ఎన్నిక జరుగుతుంది. ఎన్నికైన అభ్యర్ధి మరుసటి సంవత్సరం జనవరి 20న ప్రమాణ స్వీకారం చేస్తారు. అధ్యక్షుడిగా పోటీ చేయటానికి 35 ఏళ్ల వయసు కలిగి, అమెరికాలో జన్మించిన అమెరికా పౌరుడై, కనీసం 14 ఏళ్ల పాటు అమెరికాలో నివశించాలి.
1850 నుండి అమెరికాలో డెమొక్రటిక్ పార్టీ, రిపబ్లికన్ పార్టీల ఆధిపత్యం కొనసాగుతున్నది. లిబర్టేరియన్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ, గ్రీన్స్ పార్టీ, కాన్‌స్టిట్యూషన్ పార్టీ మొదలగు ఇతర పార్టీలు ఉన్నప్పటికి వాటి ప్రాబల్యం నామమాత్రమే. గత 180 ఏళ్లుగా ఈ రెండు పార్టీల అభ్యర్ధులే అధ్యక్షులుగా గెలుపొందుతున్నారు. ఎన్నికైన వారిలో ఉడ్రోవిల్సన్, ఫ్రాంక్లిన్ డి.రూజ్‌వెల్ట్, జాన్ ఎఫ్. కెనడీ, జిమ్మీ కార్టర్, బిల్ క్లింటన్, బారక్ ఒబామా మొదలగువారు డెమొక్రటిక్ పార్టీకి చెందినవారు కాగా, థియొడర్ రూజ్‌వెల్డ్, రిచర్డ్ నిక్సన్, రొనాల్డ్ రీగన్, జార్జ్ బుష్ మొదలగు రిపబ్లికన్ పార్టీకి చెందినవారు. డెమొక్రటిక్ పార్టీ చిహ్నం గాడిద కాగా, రిపబ్లికన్ పార్టీ చిహ్నం ఏనుగు.
అధ్యక్షుడితోపాటు ఉపాధ్యక్షుడు కూడా ఎన్నికవుతారు. ఏ కారణం వల్లనైనా అధ్యక్ష పదవి ఖాళీ అయితే మిగిలిన కాలం ఉపాధ్యక్షుడే అధ్యక్షుడిగా కొనసాగుతారు. ఉదాహరణకు ఫ్రాంక్లిన్ డి. రూజ్‌వెల్ట్ 1944లో అధ్యక్షుడిగా ఎన్నికైన సంవత్సర కాలానికే మరణించగా, మిగిలిన 3 సంవత్సరాలు ఉపాధ్యక్షుడు హారీ ట్రూమన్ అధ్యక్షుడిగా పని చేశాడు.
పార్టీల అభ్యర్థుల ఎన్నిక
అమెరికా అధ్యక్ష ఎన్నికలలో రెండు పార్టీల అభ్యర్థుల ఎన్నిక ప్రక్రియ నవంబర్ నెలకి 8 నెలలు ముందే ప్రారంభం అవుతుంది. రిపబ్లికన్ లేదా డెమొక్రటిక్ పార్టీల తరపున అధ్యక్ష పదవికి పోటీ చేయాలనే అభిలాష, ఆలోచన అనేక మందికి ఉండవచ్చు. కాని చివరకు ఒక్కొక్క పార్టీ తరపున ఒక్కరే రంగంలో ఉండాలి. అభ్యర్థి ఎన్నిక ప్రక్రియ దాదాపు 6 నుండి 8 నెలల పాటు కొనసాగుతుంది. ఉదాహరణకు ఈసారి డెమొక్రటిక్ పార్టీ అభ్యర్ధిత్వానికి జో బిడెన్, బెర్నీ శాండర్స్ పోటీ పడగా, చివరకు జో బిడెన్ అభ్యర్ధిత్వాన్ని గెలుపొందారు. తొలత ఒక రాష్ట్రంలో ఒక జిల్లాకు లేదా ఒక ప్రాంతానికి సంబంధించిన ఒక పార్టీ నాయకులు తమ పార్టీ తరపున ఏ అభ్యర్ధిని బలపరుచుదామనే విషయాన్ని చర్చించటానికి ఏర్పాటు చేసుకునే సమావేశాన్ని ''కాకసస్'' అంటారు. కొన్ని కాకసస్‌లు కలిసి 'కౌంటీ'గాను, కొన్ని కౌంటీలు కలసి స్టేట్ గ్రూప్ గాను ఏర్పడతాయి. రెండో దశలో పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్ధి పార్టీకి చెందిన రిజిస్టర్ ఓటర్లు పాల్గొనే సమావేశాన్ని ''ప్రైమరీలు'' అంటారు. ఈ సమావేశాలలో ఒక పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ ఆర్థిక, సామాజిక, విదేశాంగ విధానాలు, ఇతర అంశాలు వివరిస్తారు. రహస్య ఓటింగ్ జరుగుతుంది. ప్రైమరీలలో తమకు వచ్చే ఓట్లను బట్టి అభ్యర్థులు పోటీలో కొనసాగడమో, విరమించుకోవడమో చేస్తారు. మూడవ దశలో ఆ పార్టీ జాతీయ సదస్సు జరిగి ఎక్కువ మంది డెలిగేట్లు మద్దతు పొందిన వారిని పార్టీ అభ్యర్థిగా నామినేట్ చేస్తారు.
అమెరికన్ కాంగ్రెస్ - నిర్మాణం
అమెరికాలో పార్లమెంట్‌ను కాంగ్రెస్ అంటారు. దీనిలో ఎగువసభ పేరు సెనేట్. ఎగువ సభలో 100 మంది సభ్యులు వుంటారు. 50 రాష్ట్రాల నుండి సమానంగా రాష్ట్రానికి ఇద్దరు చొప్పున 100 మంది సభ్యులు వుంటారు.
వీరి పదవీకాలం 6 సంవత్సరాలు. ప్రతి రెండేళ్లకు 1/3 వంతు చొప్పున పదవీ విరమణ చేసి ఎన్నికలు జరగుతాయి. దిగువసభ పేరు ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్). దీనిలో 438 మంది సభ్యులుంటారు. వీరి ఎన్నిక అధ్యక్ష ఎన్నికలతో పాటే జరుగుతాయి. 50 రాష్ట్రాలకు ఆయా రాష్ట్రాల జనాభాను బట్టి ప్రతినిధుల సభలో ప్రాతినిధ్యం వుంటుంది. ఉదాహరణకు పెద్ద రాష్ట్రమైన కాలిఫోర్నియా నుండి ప్రతినిధుల సభలో 52 మంది ఉండగా టెక్సాస్ నుండి 36 మంది, చిన్న రాష్ట్రాలైన వెర్మాంట్, నెవడా, నార్త్ డకోటాల నుండి ఒక స్థానం మాత్రమే ఉన్నది. అమెరికా అధ్యక్షుడు చేసే ప్రధాన నిర్ణయాలను, ఒప్పందాలను అమెరికన్ కాంగ్రెస్ ఆమోదించాలి. అమెరికాలో మూడు వ్యవస్థలు (కార్యనిర్వాహక వర్గం, శాసన నిర్మాణ శాఖ, న్యాయ వ్యవస్థ) ''నిరోధ సమతౌల్యాలు'' అనే సిద్ధాంతంపై ఆధారపడి పని చేస్తాయి. అమెరికా న్యాయ వ్యవస్థకి ''న్యాయ సమీక్షాధికారం'' ఉన్నది.
అధ్యక్ష ఎన్నిక - ఎలక్టొరల్ కాలేజి పాత్ర
ప్రపంచంలో అధ్యక్ష పాలనా విధానం అనేక దేశాలలో ఉన్నది. ఆయా దేశాల అధ్యక్షులు ఎన్నికలలో ప్రజలు వేసిన ''పాపులర్ ఓటు'' ఆధారంగా గెలుపొందుతారు. అనగా మెజారిటీ ఓట్లు పొందినవారు గెలుస్తారు. కాని అమెరికా అధ్యక్ష ఎన్నిక భిన్నంగాను, సంక్లిష్టంగాను ఉంటుంది. అధ్యక్షుడిని ఎన్నుకోవటానికి ఒక ''ఎలక్టొరల్ కాలేజి'' ఏర్పడుతుంది. ఈ కాలేజీలో 538 మంది ఎలక్టొరేట్లు ఉంటారు. ఒక్కో రాష్ట్రం నుండి కాంగ్రెస్‌లో సభ్యుల సంఖ్యకు సరిపడా ఎలక్టొరల్ కాలేజీలో ప్రాతినిధ్యం వుంటుంది. ఉదాహరణకు కాలిఫోర్నియా రాష్ట్రానికి ప్రతినిధుల సభలో 52, సెనేట్‌లో ఇద్దరు , మొత్తం 54 మంది సభ్యులుంటారు. ఆ రాష్ట్రానికి ఎలక్టొరల్ కాలేజీలో 54 మంది ఉంటారు. నార్త్ కరోలినా రాష్ట్రానికి ప్రతినిధుల సభలో 12 మంది, సెనేట్‌లో 2, మొత్తం 14 మంది ఉంటే, ఎలక్టొరల్ కాలేజీలో 14 మంది ప్రాతినిధ్యం పొందుతారు. అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగిన తరువాత ఏ రాష్ట్రంలోనైనా పాపులర్ ఓటు ఏ అభ్యర్థికి ఎక్కువగా వస్తే, ఆ రాష్ట్రంలోని ఎలక్టొరల్ ఓట్లన్నీ అతనికే చెందుతాయి. ఉదాహరణకు కాలిఫోర్నియా రాష్ట్రంలో నవంబర్ 3న జరిగే ఎన్నికలలో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బిడెన్‌కు మెజారిటీ పాపులర్ ఓట్లు వస్తే ఎలక్టొరల్ కాలేజి లోని 54 ఓట్లు అతడికే లభిస్తాయి. అనగా 50 రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలోనైనా పాపులర్ ఓటు పొందిన అభ్యర్థి ఆ రాష్ట్రానికి చెందిన ఎలక్టొరల్ ఓట్లన్నీ పొందుతాడు. ఆ విధంగా 538 ఎలక్టొరల్ కాలేజీ ఓట్లలో మెజారిటీ (270కి పైగా) పొందిన వారిని గెలుపొందినట్లుగా ప్రకటిస్తారు.
పై విధానంలో కొన్నిసార్లు పాపులర్ ఓట్లు మెజారిటీ పొంది కూడా...ఎలక్టొరల్ కాలేజీలో మెజారిటీ పొందలేక ఓడిపోయిన సందర్భాలున్నాయి. 2016 ఎన్నికలలో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిలరీ క్లింటన్ పాపులర్ ఓటు మెజారిటీ పొంది కూడా, ఎలక్టొరల్ కాలేజీలో తగినంత మెజారిటీ రాక ఓటమి పాలయ్యారు. 2000 ఎన్నికలలో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి అల్‌గొరేకు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి జార్జ్ బుష్ కంటే పాపులర్ ఓట్లు 5 లక్షల 40 వేలు అధికంగా వచ్చినప్పటికీ, ఎలక్టొరల్ కాలేజి ఓట్లు జార్జ్ బుష్‌కు 271, అల్‌గొరేకు 267 రావడంతో బుష్ గెలుపొందాడు. అమెరికా అధ్యక్ష ఎన్నికల విధానం ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమైనదని రాజ్యాంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
రెండు పార్టీల విధానాలు
అమెరికాలో రెండు ప్రధాన పార్టీలైన డెమొక్రటిక్ పార్టీ, రిపబ్లికన్ పార్టీలు ఆంతరంగిక విధానాలతో తేడాలు ఉన్నప్పటికీ, విదేశాంగ విధానంలో అంతర్జాతీయ వ్యవహారాలలో ఒకే రకమైన విధానాలు కలిగి ఉంటాయి. రెండు పార్టీలు ''ద్రవ్య పెట్టుబడి'' ప్రతినిధులే. భారత దేశంలో పని చేసిన అమెరికన్ మాజీ రాయబారి కెన్నెత్ గాల్ బ్రెయిత్ చెప్పినట్లు ''అమెరికాలో అసలు అధికారం వ్యక్తుల చేతుల్లో ఉండదు. బహుళజాతి, కార్పొరేట్ కంపెనీల చేతుల్లో ఉంటుంది. అమెరికా ఆర్థిక ప్రయోజనాల కోసం ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, సిరియా, లిబియా మొదలైన దేశాల ఆంతరంగిక వ్యవహారాలలో జోక్యం చేసుకోవటంలో రెండు పార్టీలు ఒకటే. బ్రిటీష్ మాజీ ప్రధాని పాల్మర్‌స్టన్ చెప్పినట్లు ''ఏ దేశానికి శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. శాశ్వత ప్రయోజనాలు ఉంటాయి''. ఈ సూత్రాన్ని అమెరికా పూర్తిగా పాటిస్తుంది. తాను ప్రజాస్వామిక దేశంగా చెప్పుకుంటూ ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి నిరోధక, నియంతృత్వ ప్రభుత్వాలను బలపరుస్తుంది.
అదే సమయంలో రెండు పార్టీల మధ్య ఆంతరంగిక విధానలలో తేడాలు ఉన్నాయి. పన్నుల విధానం, హెల్త్ కేర్, గే వివాహాలు, అబార్షన్లు, ప్రభుత్వ నియంత్రణలు, ఇమ్మిగ్రేషన్, వర్ణ వివక్షత మొదలైన అనేక అంశాలలో రెండు పార్టీల మధ్య బేధాలు ఉన్నాయి.
ఈసారి విజేత ఎవరో ?
నవంబర్ 3న జరిగే అధ్యక్ష ఎన్నికల ఫలితాల కోసం ప్రపంచం ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నది. ట్రంప్ కంటే జోబిడెన్ తొమ్మిది శాతం ఆధిక్యంలో ఉన్నట్లు పలు సర్వేలు తెలుపుతున్నాయి. గత నాలుగేళ్లుగా ట్రంప్ అనుసరించిన విధానాలు ప్రజలలో అసంతృప్తిని పెంచాయి. కరోనా సంక్షోభాన్ని అరికట్టడంలో వైఫల్యం, నల్ల జాతీయులు, మైనారిటీలపై దాడులు, పెరుగుతున్న నిరుద్యోగం, జిడిపి క్షీణత మొదలైన అంశాలు డోనాల్డ్ ట్రంప్ పట్ల వ్యతిరేకతను పెంచాయి. ట్రంప్ ఎన్నికల ప్రచారంలో చైనా వ్యతిరేకత రెచ్చగొట్టడం, జోబిడెన్-కమలా హారిస్‌లను సోషలిస్ట్ విధానాల అనుకూల వ్యక్తులుగా చిత్రీకరించడం ఓటమి భయంతోనే. ఎన్నికల ప్రచారంలో సుంకాలు, పర్యావరణం మొదలైన అంశాలపై భారత దేశాన్ని విమర్శించినప్పటికీ, నరేంద్రమోడీ ప్రభుత్వం నోరెత్తక పోవటానికి కారణం ట్రంప్, మోడీలు ఇద్దరూ మితవాద విధానాలు అనుసరించేవారే. అయితే తెల్ల జాతీయులలో ఎక్కువ మంది ట్రంప్ అనుసరించే ''రక్షిత విధానాలు'' బల పరుస్తున్నట్లుగా పరిశీలకులు భావిస్తున్నారు. భారతీయ సంతతివారు మెజారిటీ డెమొక్రటిక్ అభ్యర్థిని బలపరుస్తున్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు. చివరి రోజులలో 'స్వింగ్ స్టేట్స్' అనుకూలిస్తే జో బిడెన్ గెలిచే అవకాశమున్నది.
(వ్యాసకర్త శాసనమండలి సభ్యులు,
కె.యస్.లక్ష్మణరావు
సెల్: 94402 62072)










