
విశాఖ జిల్లాలోని ఇప్పటి పద్మనాభం మండలం పాండ్రింకిలో 1897, జులై 4వ తేదీన జన్మించాడు సీతారామరాజు. అది వాళ్ల అమ్మమ్మ ఊరు. తండ్రి వెంకట రామరాజు రాజమహేంద్రవరంలో జీవిక కోసం ఫొటో స్టూడియో నడిపాడు. రామరాజు బాల్యమంతా రాజమండ్రిలోనే గడిచింది. స్వాతంత్య్ర ఉద్యమం బీజాలు అక్కడే పడ్డాయి. ఓ రోజు రాజు తండ్రితో కలిసి గోదావరి తీరానికి వెళ్లాడు. అప్పుడొక బ్రిటీషు అధికారి గుర్రంపై వెళుతుంటే- కొందరు భయంతో లేచి నించోవడం, చేతులు జోడించి నమస్కరించటం చూశాడు. అది తమాషాగా అనిపించింది. తనూ చేతులు జోడించి, ఆ తెల్లదొరకు నమస్కరించాడు. అప్పుడు తండ్రి ''మన దేశాన్ని పట్టి పీడిస్తున్న తెల్లవాడికి నమస్కరించటమా?'' అని తీవ్రంగా మందలించాడు. ఈ సంఘటన రామరాజు పసి మనసు మీద చెరగని ముద్ర వేసింది. తండ్రిని మళ్లీ మళ్లీ అడిగి, దేశం గురించి, బ్రిటీషు వాళ్ల దురాక్రమణ గురించి తెలుసుకున్నాడు. ఈ దేశం నుంచి తెల్లదొరలను తరిమేయాల్సిందే అని తీర్మానించుకున్నాడు.
గోదావరి పుష్కరాల నేపథ్యంలో (1908 ఆగస్టు) - కలరా వ్యాధి ప్రబలింది. తండ్రిని కబళించింది. రాజు కుటుంబం దిక్కులేనిదైంది. అప్పటికి రామరాజు వయసు 11 ఏళ్లు. చెల్లి సీత, తమ్ముడు సత్యనారాయణ రాజు, తల్లి సూర్యనారాయణమ్మ జీవించటానికి బంధువుల మీద ఆధారపడాల్సి వచ్చింది. రామరాజు చిన్నాన్న రామకృష్ణంరాజు ప్రభుత్వ అధికారిగా ఉన్నారు. ఆ కుటుంబానికి ఆయన తోడ్పాటు అందించారు. ఆయన ఏర్పాట్లకు అనుగుణంగా రామరాజు చదువు చాలా ఊళ్లల్లో సాగింది. కాకినాడ మహారాజా పాఠశాల, నర్సాపురం టేలర్ హైస్కూలు, తుని రాజా హైస్కూలు, విశాఖపట్నం ఎవిఎన్ విద్యాసంస్థల్లో ఆయన చదివాడు. తెలివైన విద్యార్థి అయినప్పటికీ- పాఠాలు సరిగ్గా వినేవాడు కాదు. ''ఎందుకింత నిర్లక్ష్యం?'' అని కాకినాడలో మిత్రుడు మద్దూరి అన్నపూర్ణయ్య అడిగితే- ''ఈ విదేశీ చదువు మనకెందుకు పనికి వస్తుంది? బ్రిటీషువాళ్లకు సేవ చేయటానికే కదా? నాకు ఈ దేశ ప్రజలకు సేవ చేసే విద్య కావాలి.'' అన్నాడు. పరాయి పాలన పట్ల విముఖత, దేశసేవ పట్ల ఆసక్తి చిన్న వయసులోనే గాఢంగా నెలకొన్నాయని ఈ మాటలను బట్టి మనం గ్రహించవచ్చు.
తొలి దేశయాత్ర
రామరాజు బడి చదువు పట్ల ఆసక్తి చూపలేదు కానీ, భవిష్యత్తు అవసరాల కోసం సంస్కృతం, జ్యోతిష్యం, గుర్రపు స్వారీ, హిందీ, ఇంగ్లీషు వంటివి నేర్చుకున్నాడు. 1916 ఏప్రిల్ 26న తుని నుంచి కాలినడకన దేశయాత్ర ప్రారంభించాడు. కోల్‌కతాలో ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు సురేంద్రనాథ్ బెనర్జీని కలిశాడు. దేశ రాజకీయాల గురించి చర్చించాడు. మోతీలాల్ నెహ్రూ, చిత్తరంజన్ దాస్, మాలవ్యా వంటి నాయకులతోనూ భేటీ అయ్యాడు. దేశంలోని రాజకీయ, సామాజిక పరిస్థితులను అర్థం చేసుకోవటానికి ఆ యాత్ర బాగా ఉపయోగపడింది. 1917 జులై 17న విశాఖ జిల్లా కృష్ణాదేవిపేట చేరాడు. స్థానిక పెద్దల ఆశ్రయం పొందాడు. తనకు తెలిసిన విద్య, వైద్యం అవసరంలో ఉన్న ప్రజలకోసం ఉపయోగిస్తూ.. అందరికీ దగ్గరయ్యాడు. గిరిజనుల నుంచి విలువిద్య, (మొదటి పేజీ తరువాయి)
స్థానిక పోలీసుల ద్వారా తుపాకీ పేల్చటం నేర్చుకున్నాడు.
మన్యానికి ఆప్తుడిగా ..
కృష్ణాదేవి పేటకు ఆనుకొని, అనేక గిరిజన గ్రామాలు ఉన్నాయి. పోడు వ్యవసాయం, అటవీ ఫలసాయం సేకరణ మన్యవాసుల బతుకు తెరువు. బ్రిటీషు వారి కఠినమైన అటవీ చట్టాల వల్ల గిరిజనుల జీవనం అస్తవ్యస్తమైంది. కన్నతల్లి లాంటి అడవిలోకి వెళ్లటమే పెద్ద నేరం అయిపోయింది. అదే సమయంలో డౌనూరు - చింతపల్లి ఘాట్‌రోడ్డు నిర్మాణం మొదలైంది. దాని పర్యవేక్షకుడు బాస్టియన్ అనే అధికారి. గిరిజనులను బలవంతంగా ఆ పనిలో చేర్చాడు. కూలి డబ్బులు సక్రమంగా ఇవ్వకుండా వేధించాడు. అడిగితే బాధించాడు. ఇంకా అనేక రూపాల్లో బ్రిటీషు వాళ్ల దౌర్జన్యాలు పెచ్చుమీరాయి. అవన్నీ రామరాజు దృష్టికి వచ్చాయి. మన్యంలోని 32 ముఖ్య గ్రామాల్లో అసంతృప్తి, ఆవేదన రగులుతున్నాయి. అడవిబిడ్డలకు మంచిచెడ్డలు చెప్పటం, చిన్న చిన్న తగాదాలను పరిష్కరించటం, వైద్యం చేయడం, సందడీ సంబరాల్లో పాల్గొనటం, రాత్రి పాఠశాల నిర్వహించటం వంటి రూపాల్లో రాజు గిరిజనులకు ఆప్తుడిగా మారాడు.
ఇదిలా నడుస్తుండగానే అల్లూరి కార్యకలాపాలపై బ్రిటీషు అధికారులకు నిఘా నివేదిక వెళ్లింది. డిప్యూటీ కలెక్టరు ఫజులుల్లా సాహెబ్ .. రాజును నర్సీపట్నం పిలిపించి, ఎంతో అనునయంగా మాట్లాడి, పోరాటమార్గం నుంచి తప్పించాలని ప్రయత్నించాడు. అడ్డతీగల సమీపాన పైడిపుట్ట వద్ద 50 ఎకరాల భూమి కేటాయించి, అక్కడ వ్యవసాయం చేసుకొని జీవించమని చెప్పాడు. ఒకందుకు స్థలమార్పు మంచిదే అని భావించాడు రామరాజు. ఓ ఏడాది పాటు అక్కడ కుటుంబంతో సహా ఉన్నాడు. గంటందొర, మల్లుదొర, ఎండు పడాల్ తదితరులను అక్కడికి రప్పించుకొని- పోరాటానికి వ్యూహం రూపొందించాడు. తరువాత పైడిపుట్ట భూమి తమకు అవసరం లేదని, స్వాధీనం చేసుకొమ్మని తెలుపుతూ ప్రభుత్వానికి ఉత్తరం రాశాడు.
వీరులను సమీకరించి.. విప్లవాగ్ని రగిల్చి ..
రాజు వెంట నడిచిన మన్నెం వీరులది ఒక్కొక్కరిది ఒక్కో సమస్య. కానీ, వాటన్నిటికీ మూల కారణం పరాయిపాలన. ఆ విషయాలను అందరికీ అర్థమయ్యేలా చెప్పి, మన్యవాసులను సంఘటితపరిచాడు రామరాజు. గంటందొర, మల్లుదొర అన్నదమ్ములు. బాస్టియన్ కారణంగా భూములు కోల్పోయారు. ఎండు పడాల్‌దీ అదే పరిస్థితి! తేనె ఇవ్వలేదని, పనసపండ్లు కోశారని, పనికి డబ్బు అడిగారని.. ఎంతోమంది మన్యవాసులు బ్రిటీషు ఉద్యోగుల చేత క్రూరంగా వేధించబడ్డారు. వాళ్లందరికీ ఇప్పుడు రామరాజు అండ. స్వేచ్ఛా స్వాతంత్య్రాల గురించి బోధించాడు. తెల్లవాళ్లను దేశం నుంచి తరిమేస్తేనే మనకు విముక్తి అని వివరించాడు. 'జై స్వాతంత్య్ర భారత్' అన్నాయి వందలాది గొంతులు. ఎవరు ఏఏ పనులకు సమర్థులో ముందే ఒక అంచనాకు వచ్చాడు రామరాజు. ప్రజలను కదిలించటానికి గంటందొర, మల్లుదొర.. చురుగ్గా సమాచారం చేరవేయటానికి ఎండు పడాలు, ఊళ్ల నుంచి సమాచారం సేకరించటానికి గోకిరి ఎర్రేశు ... ఇలా బాధ్యతలు కేటాయించాడు.
పోలీస్‌స్టేషన్లపై వరుస దాడులు
మొత్తం 150 మంది వీరులు. మూడు పెద్ద దళాలు. 1922 ఆగస్టు 22న చింతపల్లి పోలీస్ స్టేషన్ మొట్టమొదటి దాడి చేపట్టారు. దాడి చేస్తామని ముందే సమాచారం ఇచ్చారు. స్టేషన్‌కి సమీపించాక - బాణం వదిలాడు ఎండు పడాల్. టేబుల్‌పై వచ్చి వాలింది మిరపకాయ టపా. దాని ఎరుపు రంగు విప్లవ సూచిక అయితే- ఘాటు తిరుగుబాటుకు చిహ్నం. ''మేమొచ్చాం. యుద్ధంతో ఎదుర్కొంటారా? లొంగిపోతారా?'' అన్నది ఆ లేఖ సారాంశం. పారిపోయారు పోలీసులు. విప్లవకారులు స్టేషన్‌లోకి ప్రవేశించి, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఎన్ని తుపాకులో, ఎన్ని కత్తులో, ఎన్ని గుండ్లో లెక్కించారు. ఆ వివరాలు రికార్డులో రాసి, సంతకం చేశాడు శ్రీరామరాజు. ఆ రెండో రోజు కృష్ణాదేవిపేట, మూడోరోజు రాజవొమ్మంగి స్టేషన్లపై ఇదే విధంగా దాడి చేశారు. ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. లెక్క రాసి సంతకం చేశారు. ఇవి ఆవేశంతో చేసిన దాడులు కాదు. ''మేం పోరాడుతున్నాం. దేశమాత స్వేచ్ఛ కోసం, మన్యవాసుల గౌరవప్రదమైన బతుకు కోసం..'' అని స్పష్టమైన సందేశం పై అధికారులకు పంపించారు.
హడలిపోయారు అధికారులు. అది పితూరీ అన్నారు. రాజు దోపిడీదారు అన్నారు. ఇతర ప్రాంతాల నుంచి ఆరితేరిన సైనిక బలగాలను, కర్కశమైన అధికారులను ఆగమేఘాల మీద నర్సీపట్నానికి రప్పించారు. పోరాటాన్ని ఎక్కడికక్కడ అణచివేయటానికి తీవ్రంగా ప్రయత్నించారు. ఒంజేరు, కొండపల్లి, దామనాపల్లి, రాయవరం తదితర ప్రాంతాల్లో ఆరుసార్లు ముఖాముఖి తలపడ్డారు. ఆరుసార్లూ రామరాజు దళాలదే విజయం. ముగ్గురు బ్రిటీషు సైనికులతో సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. అనేకమంది గాయపడ్డారు. అందులో ఇద్దరిని ఎండుపడాలే గురి చూసి నేలకూల్చాడు. మల్లుదొర చేతిలో బాస్టియన్ తృటిలో చావు తప్పించుకున్నాడు. ఈ సంఘటనలు బ్రిటీషు అధికారులను తీవ్రంగా కలవరపెట్టాయి.
రామరాజుకు ఊరూరా జేజేలు!
రామరాజు సైన్యానికి ఊరూరా ఘన స్వాగతం లభిస్తోంది. ప్రజలు కడుపులో పెట్టి చూసుకుంటున్నారు. తమకు విముక్తి లభిస్తుందన్న ఆశ అందరిలో మొలకెత్తింది. అక్టోబరు 15న అడ్డతీగల పోలీసు స్టేషనుపైనా, రంప చోడవరం స్టేషన్ పైనా దాడులు చేశారు. అయితే, ఈసారి ఆయుధాలేవీ దొరకలేదు. ప్రత్యేక అధికారిగా వచ్చిన నాఫ్ కొత్త వ్యూహం అనుసరించాడు. ఆయుధాలను మైదాన ప్రాంతాలకు తరలించాడు. అడ్డతీగల వెళ్లినప్పుడు రామరాజుకు రుద్రయ్య అనే ప్రభుత్వ ఉద్యోగి తారస పడ్డాడు. 'నేను ఇక్కడే ఉంటాను. మీ కలెక్టరును రమ్మను, చర్చిస్తాం. లేదా బలగాలను పంపమను. యుద్ధం చేస్తాం.' అని కబురు పెట్టాడు. కానీ, అధికారులు అందుకు సాహసించలేదు.
ఆ తరువాతి కొద్దిరోజుల్లో శంఖవరంలో అల్లూరి బృందానికి ఘనమైన ప్రజల స్వాగతం లభించింది. మన్యం వీరులు గ్రామ వీధుల్లో నడుస్తుంటే- వందలాది మంది వెన్నంటి సాగారు. డిప్యూటీ తహశీల్దారు, ఎస్‌ఐ సైతం రామరాజుకు జేజేలు పలికారు. ఆ సందర్భంలోనే చిలుకూరి నరసింహమూర్తి అనే ఆయన సీతా రామరాజును ఇంటర్వ్యూ చేశాడు. ఆ ముఖాముఖిలో రామరాజు తమ పోరాట లక్ష్యాలు ఏమిటో చాలా స్పష్టంగా తెలియజెప్పాడు.
మరింత అణచివేత .. గ్రామాలపై దాడులు
రామరాజు పోరాటం ప్రజాదరణ పొందుతుండడంతో - అది మరింత ప్రమాదకరంగా పరిణమించే అవకాశం ఉందని బ్రిటీషు ప్రభుత్వం గమనించి తన వ్యూహాన్ని మార్చింది. రామరాజు ఎవరి కోసమైతే పోరాడుతున్నాడో ఆ ప్రజలను తీవ్రంగా హింసించటం మొదలు పెట్టారు. గ్రామాలపై దాడులు చేశారు. దొరికినవారిని దొరికినట్టు చావబాదారు. మహిళలను తీవ్రంగా అవమానించారు. చాలా గ్రామాలకు నిప్పెట్టారు.
అదే సమయంలో విప్లవ బృందాలకు ఎదురుదెబ్బలు మొదలయ్యాయి. 1922 డిసెంబరు 6న రెండు చోట్ల పోలీసు కాల్పులు జరిగి, 8 మంది విప్లవకారులు మృతిచెందారు. రామరాజు గాయపడ్డాడు. తరువాత నాలుగు నెలలు స్తబ్ధత నెలకొంది. పశ్చిమ గోదావరి జిల్లా కుముదాపల్లికి చెందిన వేగిరాజు సత్యనారాయణ రాజు ఉద్యమంలో చేరాడు. అతడికే అగ్గిరాజు అని పేరు. భారతీయ ఉద్యోగులను, గ్రామ మునసబులను ఎలాంటి పరిస్థితుల్లోనూ వేధించకూడదని, తెల్ల అధికారులకే బుద్ధి చెప్పాలనేది రామరాజు నిబంధన. కానీ, కొన్నిసార్లు అగ్గిరాజు అందుకు భిన్నంగా వ్యవహరించాడు. అదే సమయంలో నడింపాలెంలో ఒక మహిళ ఇంట ఉన్న రామరాజు ముఖ్య అనుచరుడు మల్లుదొర పోలీసులకు పట్టుబడ్డాడు. నెమ్మది నెమ్మదిగా బలగం తగ్గిపోసాగింది. గ్రామాలపై పోలీసు నిర్బంధం, దౌర్జన్యం తీవ్రస్థాయికి చేరాయి. 1924 జనవరిలో అస్సాం రైఫిల్ దళాలు, గుర్కా దళాలూ నర్సీపట్నం చేరాయి. రూథర్ పర్డు 55 మంది అల్లూరి సహాయకులను అరెస్టు చేశాడు. మరో 183 మందిపై అరెస్టు వారెంట్లు జారీ చేశాడు. మన్యంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. రామరాజు ఈ పరిస్థితిని చక్కదిద్ద టానికి, కొత్త ప్రాంతాలనుంచి మద్దతు పొందటానికి ప్రయత్నం చేశాడు. కానీ, అది ఫలించలేదు. దళాలు చెల్లాచెదురయ్యాయి. మద్దేరు వద్ద జరిగిన పోరాటంలో అగ్గిరాజు అరెస్టయ్యాడు.
వీరుడి అమరత్వం
తాను లొంగిపోతే మన్యం మీద నిర్బంధం తగ్గుతుందని భావించాడు రామరాజు.1924 మే 7. విశాఖ జిల్లా కొయ్యూరుకు సమీపాన గల మంప వద్ద వాగులో స్నానానికి దిగాడు. ఆ దగ్గర్లోనే పోలీసులు ఉన్నారు. ఒక పశువుల కాపరిని పిలిచి, తాను సీతా రామరాజునని, తాను ఇక్కడ ఉన్న విషయం పోలీసులకు చెప్పిరమ్మని చెప్పాడు. ఆ బాలుడు అలాగే చేశాడు. ఆ మరు నిమిషంలోనే పోలీసులు చుట్టుముట్టారు. పెడ రెక్కలు విరిచి కట్టి, సైనిక శిబిరం ఉన్న రాజేంద్ర పాలేనికి తీసుకొచ్చారు. అక్కడ ఉన్న చింతచెట్టుకు కట్టేశారు. మేజర్ గుడాల్ రాజును ప్రశ్నించాడు. బ్రిటీషు వారు ఈ దేశాన్ని విడిచిపోయేదాకా తన వంటి వీరులు పోరాటం సాగిస్తూనే ఉంటారని అల్లూరి ఉద్ఘాటించాడు.
గుడాల్ సహనం కోల్పోయాడు. చెట్టుకు కట్టేసి ఉన్న నిస్సహాయుణ్ని, నిరాయుధుడిని నిర్దాక్షిణ్యంగా తుపాకీతో కాల్చేశాడు. 'వందేమాతరం' అంటూ రామరాజు తలవాల్చేశాడు. రామరాజు భౌతికకాయానికి ఆ మర్నాడు కృష్ణాదేవి పేట వద్ద తాండవా నది ఒడ్డున అంత్యక్రియలు నిర్వహించారు. ఇప్పుడు ఆయన స్మారక మందిరం అక్కడే ఉంది.. మన్యం నేల మీద సాగిన అపూర్వ పోరాటాన్ని, ఓ అమరవీరుడి గాధను తరతరాలకు ప్రసరిస్తూ ఉంది.
- సత్యాజీ