
సీతమ్మ, రామయ్య దంపతుల ముద్దుల కూతురు పావని. ఐదవ తరగతి చదువుతోంది. ఒకరోజు పెరటిలోని పూలమొక్కలకు నీరుపోస్తున్న పావనికి ఒక ఉడుత పిల్ల మొక్కల మధ్యలో పడిపోయి కీక్ కీక్ మని అరుస్తూ కనిపించింది. వెంటనే దానిని చేతిలోకి తీసుకొని, ఇంట్లోకి చేర్చింది. కళ్ళు తెరిచి, నడవడం నేర్చాక దానికి లిల్లీ అని పేరు పెట్టింది. మొదట్లో చిన్న స్పూను సాయంతో పాలు పోసేది. కొంచెం పెద్దయ్యాక స్వయంగా అన్నీ తినడం నేర్చుకుంది లిల్లీ. పప్పులంటే దానికి బాగా ఇష్టం.
లిల్లీ కోసం అట్టపెట్టెలో పాతబట్టలు, దూది, పీచులను పేర్చి, గూడును తయారుచేసింది. దానిని ఇంటి వరండాలో బాగా ఎత్తులో అమర్చింది. తొలి రోజుల్లో ఇంట్లోనే తిరుగుతూ అల్లరి చేసే లిల్లీ రానురాను గూటిలోకి చేరి, విశ్రాంతి తీసుకోవడం నేర్చుకుంది.
ఆ రోజు పావని బడి నుండి ఇంటికి చేరేసరికి క్రీచ్.. క్రీచ్ మని అరుస్తూ ప్రహరీగోడపై నుండి ఒక్కసారిగా కిందికి దూకి, పుస్తకాల సంచి మీదుగా పావని భుజాలపైకి పాకి, చక్కిలిగింతలు పెట్టింది.
'లిల్లీ! నీకు బాగా అల్లరి ఎక్కువైంది. అయినా బడి నుంచి నేను వచ్చేశానుగా' అంటూ లిల్లీని తన చేతిలోకి తీసుకొని తలను, కుచ్చు తోకను ఐదారుసార్లు నిమిరింది పావని.
అలా ముద్దు చేసేసరికి బెంగంతా తీరినట్లు చేతి నుండి చెంగున దూకి, బట్టలు మడత పెడుతున్న సీతమ్మ దగ్గరకు వెళ్ళి చుట్టూ తిరిగింది లిల్లీ. క్రీచ్.. క్రీచ్.. మని అరుస్తూ కుచ్చు తోకను ఊపుతూ మడతపెట్టిన బట్టల్లోకి దూరి కాసేపు దాగుడు మూతలాడింది.
బడి నుండి వచ్చాక ఏదో ఒక చిరుతిండి తినడం పావనికి అలవాటు. వేయించి డబ్బాలో దాచిన వేరుశెనక్కాయలని, ప్లేటులో పోసుకుని ఒలిచి తింటోంది పావని. ఒలుస్తున్న శబ్దం లిల్లీకి ఎప్పుడు వినిపించిందో ఏమో ఒక్క దూకుతో క్రీచ్.. క్రీచ్ మని అరుస్తూ పావని ముందుకు చేరిపోయింది.
కింద పడివున్న సెనక్కాయ తొక్కల్లోకి దూరి, పప్పుల కోసం వెదుకుతోంది. దాని చేష్టలకు పావని నవ్వుకుని, ఒలిచిన పప్పులను దానికి అందించింది. ఒక్కో పప్పునూ అందుకుని గబుక్కున మింగేసి, దవడల్లో దాచుకుంటోంది లిల్లీ. ఇంకా కావాలని పావని మీదకి ఎగబడి ఒడిలో కూర్చుంది.
మరుసటి రోజు ఉదయం పావని బడికి బయల్దేరుతుంటే పుస్తకాల సంచిలో దాక్కుంది. లిల్లీ తనతో పాటు బడికి రావడానికి ఇష్టపడుతున్నట్లు గ్రహించి, తల్లిని ఒప్పించి లిల్లీని బడికి తీసికెళ్ళింది పావని.
అక్కడ లిల్లీ బడిపైకి ఎక్కి, తిరిగి రావడం, పక్క తరగతుల్లో టీచర్లు పాఠాలు చెప్తూ, గేయాలను పాడిస్తుంటే తనూ తోక ఊపుతూ క్రీచ్.. క్రీచ్ మని డాన్సు చేసేది. బడిలోని పిల్లలు అందిస్తున్న పండ్లు బాగా తిని లిల్లీ పెద్దగా బలంగా తయారైంది. బడికి వెళ్ళిన దగ్గర నుండి చాలా మారిపోయింది. ఇంటి పక్క చెట్ల మీద ఉన్న ఉడుతలతో స్నేహం చేస్తోంది. ఇప్పుడు దాని ఆటలన్నీ చెట్లమీదనే! రోజులో ఒకసారో రెండుసార్లో అలా పావనికి కనిపించి, వెంటనే చెట్లమీదికి వెళ్ళిపోయేది. లిల్లీ సరిగా ఇంటికి రాకపోవడంతో పావని దిగులుపడింది.
'నీకు బాలా అలవాటై నీతో ఉందిగానీ, దానికి చెట్లంటేనే ఇష్టం పావనీ' అని తల్లి చెప్పేసరికి పావనిలో విచారం ఎక్కువైంది.
'అయితే ఇక లిల్లీ మన ఇంటికి రాదా?' అని దీనంగా అడిగింది పావని.
'చెట్లమీదనే దానికి ఇష్టమైన చోట ఉంటుంది. ఇష్టమైనపుడు వస్తుంది. అది కూడా పెద్దది అవుతోంది కదమ్మా' అని తల్లి చెప్పింది.
'రేపు నా పుట్టినరోజు కదా! రేపన్నా వస్తుందో లేదో?' మరింత దిగులుపడింది పావని. తరువాత నిప్రోయింది!
తెల్లవారుతుండగా క్రీచ్..క్రీచ్ మని శబ్దం వినిపించింది. తలుపు తీసి చూసి.. ఆశ్చర్యపోయింది పావని. పండిన పెద్ద జామపండును ముందు కాళ్ళతో దొర్లించు కుంటూ వస్తోంది లిల్లీ. సీతమ్మ వచ్చి లిల్లీని చూసింది. 'మన మాటలు ఎప్పుడు విందో ఏమో ఇవాళ నీ పుట్టినరోజు అనే విషయం దానికీ తెలిసిందమ్మా! నీకు శుభాకాంక్షలు చెప్పేందుకు లిల్లీ ఇంత పొద్దున్నే వచ్చింది' అంటూ ఆశ్చర్యపోయింది.
పావని ఆనందంతో లిల్లీని ఎత్తుకుని గిరగిరా తిప్పి, తలనూ తోకనూ నిమిరింది. క్రీచ్.. క్రీచ్‌మని ఆపకుండా అరుస్తున్న లిల్లీతో.. 'నాకు బర్త్‌డే విషెస్ చెప్పడానికి గుర్తుపెట్టుకుని మరీ వచ్చావు. థాంక్స్ లిల్లీ' అంటూ లిల్లీ తెచ్చిన జామపండును దాని నోటికే అందించింది. అది ఆప్యాయంగా కొంచెం కొరికింది.
'నువ్వు కొరికితే మరీ తియ్యగా ఉంటుంది. నేను ముఖం కడుక్కొని తింటాను' అని ఆ పండును దాచుకుంది పావని.
కాసేపు ఇంట్లోని గదులన్నీ తిరిగింది లిల్లీ. తన గూటిని చూసుకొంది. క్రీచ్ క్రీచ్ మని అరుస్తూ ప్రహరీగోడ మీదికి గెంతుతూ వెళ్ళింది. అప్పటికే అక్కడికి వచ్చి ఉన్న ఐదు ఉడుతలతో కలిసి డాన్స్ చేసింది. తోకలను ఊపుకుంటూ వయ్యారంగా క్రీచ్.. క్రీచ్ మని ఒకేసారి అరుస్తూ అవి చేస్తున్న డాన్స్ చూసి, పావని సంతోషానికి అంతులేకుండా పోయింది.
డాక్టర్ రావెళ్ళ శ్రీనివాసరావు
9030105618