- కార్మికులకు సంక్షేమ చట్టాలు అమలుచేయాలి
ప్రజాశక్తి-కాకినాడ : పరిశ్రమలో పనిచేసే కార్మికులకు రక్షణ సౌకర్యాలు కల్పించాలని, పారిశ్రామిక ప్రమాదాల నివారణకు శాశ్వత ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని, పరిశ్రమల తనిఖీలను పునరుద్ధరించాలని కోరుతూ కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఎన్జీవో హోం నందు జరిగిన అఖిలపక్ష సమావేశం డిమాండ్ చేసింది. ఈ సమావేశానికి సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వా శేషబాబ్జి, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, ఐ.ఎఫ్.టి.యు రాష్ట్ర కార్యదర్శి జే. వెంకటేశ్వరరావు, ఐఎన్టియుసి ఆర్గనైజింగ్ సెక్రటరీ తాళ్లూరి రాజు, టిఎన్టియుసి నగర అధ్యక్షులు గదుల సాయిబాబు, ఐ.ఎఫ్.టి.యు జిల్లా సహాయ కార్యదర్శి గుబ్బల ఆదినారాయణ అధ్యక్షత వహించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఉద్దేశిస్తూ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, ఏఐటియుసి జిల్లా నాయకులు పిఎస్ నారాయణ, ఆర్పిఐ రాష్ట్ర కార్యదర్శి పిట్టా వరప్రసాద్, సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి కామిరెడ్డి బోరకొండ, దళిత హక్కుల పోరాట కమిటీ నాయకులు శాఖ రామకృష్ణ, జై భీమ్ భారత్ పార్టీ నాయకులు ఏనుగుపల్లి కృష్ణ, ఆంధ్ర మాల మహానాడు నాయకులు సిద్ధాంతుల కొండబాబు, బహుజన్ సమాజ్వాది పార్టీ నాయకుడు సుబ్బు, ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కార్యదర్శి కృష్ణమోహన్ ఆర్పిఐ నాయకులు అయితాబత్తుల రామేశ్వరావు మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిశ్రమల తనిఖీలను నిలుపుదల చేయడంతో, పరిశ్రమల యాజమాన్యాలు ఇష్టానుసారం నైపుణ్యం లేని కార్మికులతో ప్రమాద భరిత ప్రాంతాలలో పనిచేయించడం వల్ల ప్రమాదాలు జరిగి అన్యాయంగా కార్మికులు చనిపోతున్నారన్నారు. తక్షణమే పరిశ్రమల్లో తనిఖీలను తరచుగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. స్కిల్డ్ వర్కర్లు పనిచేయాల్సిన కోర్ యాక్టివిటీలో క్యాజువల్ కార్మికుల చేత పనిచేయించడం ఆపాలన్నారు. మోడీ ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన నాలుగు లేబర్ కొడ్లను రాష్ట్రంలో అమలు చేయడానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తొందరపడుతుందన్నారు. ఇవి గనక రాష్ట్రంలో అమలు అయితే కార్మికుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యి మీద పడుతుందని హెచ్చరించారు. తక్షణమే నాలుగు లేబర్ కొడ్లను రాష్ట్రంలో అమలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. పరిశ్రమల్లో తనిఖీలు నిర్వహించకుండా విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తున్న డిప్యూటీ ఇన్స్ పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ని డిమాండ్ చేస్తూ ఈనెల 27వ తారీఖున కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించాలని అఖిలపక్షంగా తీర్మానం చేశారు. రాష్ట్రంలో ఎక్కడ ప్రమాదం జరిగినా బాధిత కుటుంబాలకు కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలన్నారు. అన్ని పనులను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని చెప్తున్న జిల్లా అధికార యంత్రాంగం పరిశ్రమల ఆడిట్ ని ఆన్లైన్ ద్వారా బహిరంగంగా ఎందుకు నిర్వహించటం లేదని ప్రశ్నించారు. పరిశ్రమల్లో కార్మికులను సంఘాలు పెట్టుకునే రాజ్యాంగబద్దమైన ప్రాథమిక హక్కుని జిల్లాలో అమలు చేయాలని లేని పక్షంలో అఖిలపక్షంగా పరిశ్రమలను తనిఖీ చేయడానికి సిద్ధపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్మికుల భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పరిశ్రమల్లో పనిచేసే మహిళా కార్మికులకు లైంగిక వేధింపుల నిరోధక కమిటీలను ప్రతీ పరిశ్రమలో తక్షణమే ఏర్పాటు చేయాలన్నారు. జగన్మోహన్ రెడ్డి హామీ మేరకు అన్ని పరిశ్రమల్లో 80 శాతం స్థానికులకు ఉపాధి కల్పించాలని, వలస కార్మికుల చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం సిఐటి జిల్లా కోశాధికారి మల్కారమున వందన సమర్పణ చేశారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ఐద్వా నగర ప్రధాన కార్యదర్శి జ్యోతి, ఏఐకేఎంఎస్ నాయకులు సూరిబాబు, సిఐటియు నగర ఉపాధ్యక్షులు మేడిశెట్టి వెంకటరమణ, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్సులు నర్ల ఈశ్వరి, చంద్రమళ్ల పద్మ, సిపిఐ నాయకులు పెదిరెడ్ల సత్యనారాయణ, కేశవరపు అప్పలరాజు, జై భీమ్ భారత్ పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బుంగ సురేష్ కుమార్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు గంగ సూరిబాబు, దినేష్ కుమార్, వేణి, రాణి తదితరులు పాల్గొన్నారు.










