వెన్నెముక అరిగేలా కష్టపడి
వరి గొలకలు వొరిగేలా
చెమటచుక్కలతో మొక్కలను తడిపితే
ధాన్యలక్ష్మి కరుణించినా
దళారుల దోపిడీతో
భాగ్యలక్ష్మి నిన్ను దాటెళ్ళిపోతుంది
కారే కన్నీళ్లూ ఎండిన గొంతును తడపవు
మిగిలిన గడ్డిపోచలూ కడుపు నింపవు
తరతరాలుగా సేద్యంలో తరిగిపోతున్నావు
నీ పిల్లలనైనా అక్షరసేద్యం చేయనీ
అక్షరాల మొలకలు ఎవరూ దోచుకోలేని
బంగారు దిగుబడుల పంటలనిస్తాయి
అక్షర తపస్సు చేసి పొందనీ
పాశుపతాస్త్రం లాంటి విజ్ఞానాన్ని
చెదలు అంటని నిప్పులా
ఏ దోపిడీకి గురికాని సూర్యులుగా
భావితరాలకూ తరగని వెలుగయ్యేలా!
సురేంద్ర రొడ్డ,
94915 23570