నాల్గవ తేదీ రాత్రి రాజయ్య గారి మరణ వార్త పిడుగుపాటులా వచ్చి పడింది. ఆ విషయం నిజం కాకుంటే బాగుండనిపించింది. ఎందుకంటే మాది సుదీర్ఘ ప్రయాణం. డివైఎఫ్‌ఐ, భద్రాచలం డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులుగా మా ప్రయాణం మొదలైంది. పార్టీ డివిజన్ కేంద్రంలో, ఖమ్మం జిల్లా ఉద్యమంలో, ఉమ్మడి ఎ.పి రాష్ట్ర కమిటీలో, రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ రాష్ట్ర కమిటీలో కలిసి పనిచేశాం. రాజయ్య ఎ.పి క్యాడర్‌గా 2018లో రాష్ట్రం మారినప్పటికీ ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ (ఎఎఆర్‌ఎం) జాతీయ స్థాయి కమిటీలో కలిసి పని చేశాం. పార్టీ నిర్మాణంలో 30 సంవత్సరాల పాటు కలిసి పని చేసినా...ఈ విచార సమయంలో...మా అనుబంధం గురించి మాటలు రావడం లేదు. రేఖా మాత్రంగా కొన్ని విషయాలు.
రాజయ్య తన నలుగురు పిల్లలకు పార్టీ నాయకుల్లో ఉద్యమకారుల పేర్లు పెట్టారు. తను ఎంతగానో అభిమానించే చంద్రరావు పేరు పెద్ద కుమారుడికి, మన్యం వీరుడు అల్లూరి పేరు చిన్న కుమారుడికి, తెలంగాణ సాయుధ పోరాట నాయకురాలు మల్లు స్వరాజ్యం, కెప్టెన్ లక్ష్మి సెహగల్ పేర్లను ఇద్దరు కుమార్తెలకు పెట్టుకున్నారు. చాలా చిన్న వయస్సు నుండే ఆయన మీద అక్కడి స్థానిక నాయకులు, డివిజన్ నాయకులైన కుంజా బొజ్జి, బండారు చంద్రరావు ప్రభావం అధికంగా ఉంది. వీరితో పాటు బొప్పన భీమయ్య, కుంజా లాలయ్య, ఇతర సీనియర్ నాయకులతో కలిసి పని చేశారు.
రాజయ్య రాజకీయ ప్రవేశం చేసేనాటికి భద్రాచలంలో తీవ్రమైన నిర్బంధాల మధ్య పీపుల్స్‌వార్ గ్రూపు నక్సలైట్ల దాడులు, హత్యాకాండ కొనసాగుతోంది. 1985 నవంబర్ 5న వర రామచంద్రాపురం మండలం, జీడిగుప్ప గ్రామం దగ్గర ఒక పెద్ద ఘటన జరిగింది. అక్కడ పార్టీ నాయకులు ప్రయాణిస్తున్న వాహనాన్ని పీపుల్స్‌వార్ దళాలు అడ్డుకుని కిరాతకంగా దాడి చేశాయి. ఈ దాడిలో బండారు చంద్రరావు, బత్తుల భీష్మారావు మరణించారు. ఆనాడు శాసనసభ్యులుగా ఉన్న కుంజా బొజ్జి గాయపడ్డారు. రాజయ్య, కుంజా బొజ్జి పార్టీలో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించకపోతే వారికి కూడా ఇదే గతే పడుతుందని ఈ ఘటన లోనే నక్సలైట్లు హెచ్చరించారు. ఆ తర్వాత 1989, 1994 సంవత్సరాల్లో కూడా బొజ్జి ఎమ్మెల్యేగా భద్రాచలం నియోజకవర్గం నుండి గెలుపొందారు. ఇక్కడ ప్రత్యేకంగా రాజయ్య గురించి పేర్కొనదగిన విషయం ఒకటుంది. తన కళ్ల ముందే కిరాతకంగా ఇద్దరు నాయకులను హత్య చేయడాన్ని చూసినా, బెదిరింపులకు గురైనా...ఏమాత్రం వెనకడుగు వేయక పార్టీలో పని చేస్తూ అంచెలంచెలుగా ఎదిగారు.
1985 ఘటన కంటే ముందు...1982 డిసెంబర్ 28న రాజయ్య స్వగ్రామం సున్నంవారి గూడెం వద్ద పార్టీ నాయకత్వానికి నక్సలైట్ దళాలకు మధ్య తీవ్రమైన వాగ్వివాదం జరిగింది. ఈ ఘటన సందర్భంగా పట్టుమని పాతిక సంవత్సరాలు కూడా లేని రాజయ్య నాయకత్వంలో ఆదివాసీలు విల్లంబులు ధరించి, నక్సలైట్ దళాల దాడిని తిప్పికొట్టి చంద్రరావు, ఇతర నాయకులను కాపాడుకున్నారు.
రాజయ్య డివైఎఫ్‌ఐ డివిజన్ అధ్యక్షులుగా 1989-94 మధ్య కాలంలో పనిచేశారు. 1994లో డివిజన్ పార్టీ మధ్యంతర నిర్మాణంలో ప్రత్యేక అవసరాల రీత్యా సిపిఎం డివిజన్ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. అప్పటి నుండి 1999 వరకు ఆ బాధ్యతల్లో ఉన్నారు. ఈ సందర్భంగా 1985 నుండి ఇటీవలి కాలం వరకు వివిధ దాడులు, హత్యాకాండలో 13 మంది నాయకులు, కార్యకర్తలు అమరులయ్యారు. 1986లో మడివి మూకయ్య, 1988లో పులి రామయ్య (చింతూరు డిపిసిబి చైర్మన్) హత్యగావించబడ్డారు. 1991లో ఆనాటి డివిజన్ పార్టీ అగ్ర నాయకులు శ్యామల వెంకటరెడ్డిపై హత్యాయత్నాలు జరిగాయి. 1996లో ఆయన తన స్వగ్రామం మల్లంపేటలో అత్యంత పాశవికంగా హత్యకు గురయ్యారు. ఈ దాడులు తర్వాత కూడా కొనసాగాయి. పార్టీలో పని చేస్తున్న నాయకులందరికీ బెదిరింపులు కొనసాగాయి. 2009లో దుమ్ముగూడెం మండలంలో ఇద్దరు గిరిజన నాయకులు హత్యకు గురయ్యారు. 2014లో చింతూరు మండలంలో పట్ర ముత్యం, అంతకు ముందు 2007లో మడకం గంగరాజు హత్య చేయబడ్డారు. 2015లో కుంజా బ్రహ్మయ్య చింతూరు మండలం బుర్కన కోటలో హత్యకు గురయ్యారు. 2006లో చర్ల మండలం, కుర్నపల్లి గ్రామ పార్టీ కార్యదర్శి, ఉప సర్పంచ్ వీరయ్య హత్యకావించబడ్డారు. ఇలా దాడులు, హత్యాకాండల పరంపర నడుమ, అక్కడి నాయకత్వం తీవ్రమైన నిర్బంధాలను ఎదుర్కొంది. అప్పటికే 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కుంజా బొజ్జిని మార్చి యువకుడిగా ఉన్న రాజయ్యను 1999 ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించింది పార్టీ. సిపిఎం, కాంగ్రెస్, టిడిపి ల మధ్య హోరాహోరీగా జరిగిన త్రిముఖ పోటీలో రాజయ్య విజయం సాధించారు. ఆ తర్వాత పార్టీ డివిజన్ సహాయ కార్యదర్శి, కార్యదర్శిగా కలిసి పనిచేశాం. 1996 సెప్టెంబర్ 6న శ్యామల వెంకటరెడ్డి హత్య జరిగే నాటికి, డివిజన్ పార్టీ కేంద్రంలో సున్నం రాజయ్య, వెంకటరెడ్డి, నేను డివిజన్ కేంద్రంలో బాధ్యులుగా ఉన్నాం. వెంకటరెడ్డిని కోల్పోయిన తర్వాత 1985 నాటి కష్టాలు పార్టీకి వచ్చి పడ్డాయి. అయినా ప్రజలను సమీకరించి, ఏకకాలంలో వ్యవసాయ కూలీ పోరాటాలు, రైతాంగ ఉద్యమాలు, గిరిజన చట్టాల పరిరక్షణ అమలు కోసం ఉద్యమాలతో పాటు శాసన సభ్యుడిగా కృషి...ఎంతో సమన్వయంతో కొనసాగించారు. ఇలా ఈ క్రమం లోనే 1999లో విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా గొప్ప ఉద్యమాన్ని రాష్ట్రంలో కొనసాగించారు. సిపిఎం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ... క్వార్టర్స్ వద్ద 2000 ఆగష్టులో ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. రాజయ్య ఆ సమయంలో కిడ్నీ సంబంధిత వ్యాధికి గురై తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆనాడు సిపిఎం నుండి ఇద్దరే శాసన సభ్యులుగా ఉన్నారు. 1997లో భద్రాచలం డివిజన్‌లో తునికాకు పోరాటం జరిగింది. ఈ పోరాటాన్ని రాజయ్య ముందుండి నడిపారు. తునికాకు కార్మికులు ఆ సీజన్ వదులుకున్నారు, కానీ పోరాటాన్ని వదులుకోలేదు. తునికాకు పోరాట చరిత్రలో నిలిచిపోయిన ఘట్టమిది. తునికాకు కార్మికులకు ప్రభుత్వం ఇచ్చే రాయితీని బోనస్‌గా ఇవ్వాలన్న ఉద్యమం చంద్రబాబు హయాంలో భద్రాచలం నుండి రాష్ట్ర వ్యాప్తంగా 2004 వరకు నడిచింది. వైఎస్‌ఆర్ సి.ఎం అయ్యాక భద్రాచలం పార్టీ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం ఆయన్ను కలిసింది. 2005లో పోరాటం విజయవంతం అయ్యింది. 2006 నుండి 2012 వరకు తునికాకు కార్మికులు బోనస్ పొందారు. వ్యవసాయ కూలీ పోరాటాలతో పాటు, పోలవరం ముంపుకు వ్యతిరేకంగా పోరాడాల్సి వచ్చింది. 2004లో రాజయ్య రెండవ సారి ఎమ్మెల్యే ఎన్నికయ్యారు. డాక్టర్ మిడియం బాబూరావు పార్లమెంటు సభ్యులుగా ఎన్నికయ్యారు. వీరిద్దరూ కలిసి డివిజన్‌లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. వెంకటాపురం పాలెంవాగు ప్రాజెక్టు నుండి భద్రాచలం పట్టణంలో మూడో వాటర్ ట్యాంకు వరకు మారుమూల గ్రామల్లో టెలీకమ్యూనికేషన్ అభివృద్ధికి కృషి చేశారు. 2006లో పోలవరం ముంపు బాధితుల మహా పాదయాత్ర రాజయ్య అధ్యక్షతన వి.ఆర్.పురం మండలం, ఇప్పూరు గ్రామం నుండి ప్రారంభమై, ఖమ్మం జిల్లా లోని ఏడు మండలాలు తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం నుండి పశ్చిమగోదావరి జిల్లా పోలవరం వరకు 616 కిలోమీటర్ల పాదయాత్ర అడుగడుగునా జన నీరాజనాల మధ్య సాగింది. పోలవరం ఉద్యమంపై అప్పటి ప్రభుత్వం 2007 జనవరి 29న తుపాకి తూటాలను కూడా ప్రయోగించారు. 2009లో రాజయ్య శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయారు. అయినా నియోకవర్గాన్ని అంటిపెట్టుకుని పోరాటాలు సాగించారు. 2012లో గిరిజన గ్రామాల అభివృద్ధి కోసం సైకిల్ యాత్ర నిర్వహించారు. 2014లో ఎమ్మెల్యేగా గెలిచారు. పోలవరం ముంపు మండలాలను విడగొట్టవద్దని, వాటిని ఖమ్మం జిల్లాలోనే కొనసాగించాలని నిరాహార దీక్ష చేశారు. మొత్తంగా చూసినప్పుడు ఉమ్మడి ఎ.పి అసెంబ్లీ అయినా, తెలంగాణ అసెంబ్లీ అయినా 3 సార్లు ఎమ్మెల్యేగా ప్రజా సమస్యలపై నిరంతరం గొంతెత్తి నినదించారు. వివిధ తరగతులు ప్రజల సమస్యలపై ఆయా ప్రజాసంఘాల వద్ద సమాచారం సేకరించుకుని కార్మికులు, కర్షకులు, అన్ని తరగతుల ప్రజల కోసం నిలబడి పోరాడారు. జీఓ నెంబరు 3ను సవరించాలని తెలంగాణలో ప్రయత్నం జరిగిప్పుడు, పాలక మండలిలో తిప్పి కొట్టారు. 2000 సంవత్సరంలో విశాఖ బాక్సైట్ మైనింగ్ కోసం 1/70 చట్టాన్ని సవరించాలని అప్పటి ప్రభుత్వం ప్రయత్నించినప్పుడు పెద్దఎత్తున జరిగిన గిరిజన ఉద్యమంలో రాజయ్య నిలబడ్డారు. ఈవిధంగా రాజయ్య విప్లవ ప్రస్థానం ఎర్రజెండా నీడలో కొనసాగింది. ప్రస్తుతం సిపిఎం ఎ.పి రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులుగా సేవలందిస్తున్న తరుణంలో మరణించడం ప్రజా ఉద్యమానికి తీరని నష్టం చేకూరింది. ఆయన అసెంబ్లీకి ఆటోకి వెళ్లిన సందర్భంలో గేటు దగ్గర పోలీసులు అడ్డగించారు. ఆ విధంగా నిరాడంబర జీవితాన్ని కొనసాగించారు. భద్రాచలం డివిజన్ అమర వీరుల విప్లవ వారసత్వాన్ని నిలబెట్టేందుకు సహచర నాయకులు, కార్యర్తలతో కలిసి తనదైన పాత్ర నిర్వహించారు. ప్రజలను, ఉద్యమాన్ని కంటికి రెప్పలా కాపాడుకోవడానికి రాజయ్య స్ఫూర్తితో కంకణధారులం కావడమే ఆ కామ్రేడ్‌కు అర్పించే నిజమైన నివాళి.
- బండారు రవికుమార్
(వ్యాసకర్త సిపిఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు)










