
ప్రజాశక్తి-తెనాలిరూరల్ : రైతు ఉద్యమాలతోనే సమస్యలు పరిష్కారమౌతాయని రైతు సంఘం రాష్ట్ర నాయకులు అన్నారు. రైతుల్ని రక్షించుకుంటేనే వ్యవసాయ రంగాన్ని కాపాడుకోగలుగుతామని ఆయన ఉద్గాటించారు. శనివారం ఉదయం స్థానిక మార్కెట్ యార్డులో ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కార్యకర్తలకు శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ తరగతుల్లో జిల్లా అధ్యక్షులు జొన్న శివశంకర్ ప్రిన్సిపాల్ గా వ్యవహరించారు. జిల్లా కార్యదర్శి కంచుమాటి అజయ్ కుమార్ క్లాస్ షెడ్యూలు ప్రకటించారు. మొదటి క్లాసులో రైతాంగ ఉద్యమాలు, చరిత్ర అంశాలపై రాష్ట్ర నాయకులు కేశవరావు రైతులకు బోధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1936లో దేశంలో అఖిలభారత రైతు సంఘం ఏర్పడి దీనికి అనుబంధంగా 1928లో గుంటూరు జిల్లాలో రాష్ట్ర రైతు సంఘం ఏర్పడిందన్నారు. గుంటూరు జిల్లా లో 1922లోనే సంఘము ఏర్పాటు జరిగిందన్నారు. దేశంలో, రాష్ట్రంలో 90 సంవత్సరాల నుండి అనేక రూపాల్లో ఆందోళనలు, ఉద్యమాలు చేపట్టి రైతాంగ సమస్యలు పరిష్కరించగలిగామని తెలిపారు. ఢిల్లీ రైతు పోరాటం 540 సంఘాలతో చరిత్రలో నిలిచిపోయే విధంగా నిర్వహించి అఖిల భారత సంఘం అగ్రభాగాన నిలబడిందని అన్నారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి కంచుమాటి అజయ్ కుమార్ మాట్లాడుతూ అనేక రైతాంగ ఉద్యమాలు చేపట్టి విజయవంతం చేయడంలో గుంటూరు జిల్లా రైతు సంఘం ముందుందన్నారు. భూ యజమానులు భూములు వదిలేయడంతో కౌలు రైతులే పంటలు పండిస్తున్నారని అన్నారు. కౌలు రైతుల హక్కుల కొరకు గత 15 సంవత్సరాలుగా ఆందోళనలు చేపట్టి గుర్తింపు కార్డులు, బ్యాంకు రుణాలు, ప్రభుత్వ సబ్సిడీలు అందించడం జరిగిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త జీవో తీసుకువచ్చి భూయజమానులతో అనుమతి సంతకం వలన కార్డులు ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. పంట రుణాలు సబ్సిడీలు అందడం లేదని దీని కొరకు పోరాటం చేయవలసి ఉందన్నారు. రైతాంగానికి రెండు లక్షల రూ 2 లక్షల వరకు రుణమాఫీ తదితర డిమాండ్లతో భవిష్యత్తు ఉద్యమాలను రూపొందించాలని అన్నారు. కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు మలకా శివ సాంబిరెడ్డి, వై వెంకటేశ్వర్లు, సిహెచ్ భాస్కరరావు, కాళ్ల సాంబిరెడ్డి, ఎం శ్రీనివాస్ రెడ్డి, వై బ్రహ్మేశ్వర రావు, ఐ రామారావు, ఎం సాంబశివరావు, ఎం కుమారి తదితరులు పాల్గొన్నారు