ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్ : ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ మేయర్స్ (ఏఐసిఎం) కార్యనిర్వాహక కమిటీ సభ్యుడిగా నగర మేయర్ బి.వై. రామయ్య నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసిఎం కార్యదర్శి మనోజ్ గుప్తా గురువారం నియమక పత్రాన్ని రామయ్యకు పంపారు. సంస్థ పట్ల విధేయత అంకితభావం, నిబద్దతతో పాటు అద్భుతమైన పనితీరు, నాయకత్వ లక్షణాలను గుర్తించి ఏఐసిఎం చైర్మన్, (మధ్యప్రదేశ్ రాష్ట్రం బుర్హాన్‌పూర్ మేయర్) మాధురీ అతుల్ పటేల్ ఈ నియామకాన్ని చేపట్టినట్లు కార్యదర్శి గుప్తా పేర్కొన్నారు. బి.వై. రామయ్య రెండేళ్ళ పాటు సభ్యుడిగా కొనసాగుతారని తెలిపారు. సంస్థ అభివృద్ధికి నిబద్ధతతో మరింతగా కృషి చేస్తారని, పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నట్లు అతుల్ పటేల్ పేర్కొన్నారు. కాగ తన నియామకానికి సహకరించిన చైర్మన్, కార్యదర్శి, ఇతర సభ్యులకు మేయర్ బి.వై.రామయ్య కృతజ్ఞతలు తెలియజేశారు. 1958 నుంచి 1968 వరకు అనధికారికంగా ఏఐసిఎం సాగినప్పుడు, తొలి సమావేశం ఉమ్మడి రాజధాని హైదరాబాదులోనే జరిగినప్పటికీ, తెలుగు రాష్ట్రాల్లో అనేక మేయర్లకు సభ్యత్వం ఉన్నప్పటికీ 25 మంది సభ్యులు ఉండే కమిటీలో ఇప్పటి వరకు తెలుగువారికి ప్రాతినిధ్యం లేదు. 62 ఏళ్ళ చరిత్ర గల ఏఐసిఎంలో తొలిసారి తెలుగు వారికి ప్రాతినిధ్యం కల్పించడం విశేషం. ఆ అవకాశం కర్నూలు మేయరుకి దక్కడం నగర ప్రజలకు గర్వకారణం. ఈ సంస్థ సర్వసభ్య సమావేశాలకు రాష్ట్ర గవర్నర్లు, ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు హాజరవుతుంటారు. 1968 లో ఢిల్లీలో ఏఐసిఎంగా నమోదై, ఇప్పటికి వివిధ రాష్ట్రాల్లో 33 సర్వసభ్య సమావేశాలు నిర్వహించారు.










