Jun 11,2022 06:59

'మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు.. నేను..అమ్మా, నాన్నా, ఇంకా మోడీజీ. ఔను మేలు చేసేవారు మన ఇంట్లోనే కాదు..గుండెల్లో ఉంటారు' అంటూ ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం గుప్పిస్తున్న ప్రకటనలు ఎంతటి హాస్యాస్పదమో భారత ఆహార భద్రత ప్రమాణాల సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌సి) విడుదల చేసిన గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. దేశంలో కల్తీ ఆహారాన్ని అడ్డుకోవడానికి పటిష్టమైన అధికార యంత్రాంగం కూడా లేకపోవడం సిగ్గుచేటు. సురక్షిత ఆహారం అందక, పోషకాహార లేమితో ఏటా అసువులు బాస్తున్న చిన్నారులు, పేద తల్లులు ఎందరో! 'ఏ ఇంట్లో ఏం వండుతున్నారో..' వేటాడి వేటాడి శోధిస్తున్న పాలకులకు మార్కెట్‌లో విచ్చలవిడిగా అమ్ముడైపోతున్న కల్తీ ఆహారాన్ని అరికట్టే సోయి లేకపోవడం క్షంతవ్యం కాదు. సురక్షిత ఆహార సూచికలో తెలుగు రాష్ట్రాలు అట్టడుగున నిలవడం కూడా తీవ్ర ఆందోళన కలిగించే అంశం. దేశంలో బాగా వెనుకబడిన రాష్ట్రంగా పేరున్న బీహార్‌కు కాస్త అటుఇటుగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ నిలిచాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఎ.పి పరిస్థితి మరింత దయనీయంగా బీహార్‌ కంటే వెనుకబడిపోవడం గమనార్హం. భారత ఆహార భద్రత ప్రమాణాల సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఐ) 20 పెద్ద రాష్ట్రాలకు ప్రకటించిన ర్యాంకుల్లో తెలంగాణ 15వ స్థానంలోనూ, బీహార్‌ 16వ స్థానంలోనూ, ఆంధ్రప్రదేశ్‌ 17వ స్థానంలోనూ నిలిచాయి. ఈ సర్వే కోసం పరిగణలోకి తీసుకున్న కొలమానాలు : 1.మానవ వనరులు, సంస్థాగత సమాచారం (ఇన్‌స్టిట్యూషనల్‌ డేటా), 2. నిబంధనలకు కట్టుబడి ఉండటం, 3. ఆహార పరీక్ష - మౌలిక వసతులు, నిఘా, 4. శిక్షణ, సామర్థ్యం పెంపు, 5. వినియోగదారులకు సాధికారతల కల్పన అంశాల్లో ఆంధ్రప్రదేశ్‌కు అత్తెసరు కంటే తక్కువ మార్కులే వచ్చాయి. ప్రత్యేకించి ఆహార పరీక్ష, మౌలిక వసతులు, నిఘా విషయంలో రాష్ట్రానికి సున్నా మార్కులు రావడం గమనార్హం. మిగిలిన అంశాల్లోనూ నిర్దేశిత మార్కుల్లో సగం మార్కును కూడా చేరుకోకపోవడం దారుణం. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం కలుషితాహారం తిని ప్రతి ఏటా 4.2 లక్షల మంది మరణిస్తున్నారు. ప్రతి పది మందిలో ఒకరు అనారోగ్యానికి గురౌతున్నారు. పేద, అల్పాదాయ దేశాల్లో సురక్షితం కాని ఆహారం వల్ల వైద్యం కోసం ప్రజలు ప్రతి ఏటా రూ.8.58 లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇక మన దేశంలో ఇందుకోసం ప్రతి యేటా రూ.1.17 లక్షల కోట్ల సొమ్మును ప్రజలు వదిలించుకోవాల్సి వస్తోందని అనేక అధ్యయనాల్లో తేలింది. అలాగే పేద, అల్పాదాయ దేశాల్లో ప్రతి యేటా కలుషితాహారం కారణంగా 1.25 లక్షల మంది పసిపిల్లలు అకాల మరణం చెందుతున్నారు. ఈ దేశాల్లో 40 శాతం మంది ప్రజలు ఆహార సంబంధిత రుగ్మతలతో కునారిల్లుతున్నారు. దేశంలో అత్యధిక శాతం మంది ప్రజలకు ఆహార ప్రమాణాలు, సురిక్షతపై కనీస అవగాహన లేదని పోషకాహార నిపుణులు పదేపదే హెచ్చరిస్తున్నా పాలకులు మిన్నకుండిపోతుండటం శోచనీయం.
        బహుళజాతి సంస్థలు మసిపూసి మారేడు కాయ చేస్తున్న ఆహార ఉత్పత్తులకు హద్దే లేదు. చిల్లర మార్కెట్‌లోకి కార్పొరేట్‌ కంపెనీలు చొరబడిన తర్వాత కల్తీ ఆహారం అందమైన ప్యాకింగ్‌లో ప్రజల ప్రాణాలు తోడేస్తున్నాయి. యోగా గురు రాందేవ్‌ బాబాకు చెందిన రుచీస్‌ సంస్థ ఉత్పత్తుల్లో మానవుల ఎముకల అవశేషాలు బయటపడటం కొంత కాలం కిందట కలకలం రేపింది. నెస్లే సంస్థకు చెందిన మ్యాగీ నూడుల్స్‌లో పాదరసం లాంటి భార లోహాలున్నాయన్న అభియోగాలతో గతంలో నిషేధం విధించారు. తేనె, తేయాకు, కాఫీ, పాలు, నెయ్యి సహా కల్తీకి గురికాని ఆహార పదార్థాలంటూ ఏమీ లేవు. సర్వం కల్తీమయం. ఏది సురిక్షత ఆహారమో.. ఏది కల్తీ ఆహారమో.. కూడా తెలుసుకోలేని స్థితిలో ప్రజలున్నారని గతంలోనే న్యాయస్థానాలు వ్యాఖ్యానించాయి కూడా. ఇప్పటికైనా ఆహార భద్రత పట్ల పాలకులు మొద్ద నిద్ర వీడాలి. ఆహార కల్తీ పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలి. ఆహార భద్రత ప్రమాణాల చట్టం నియమ నిబంధనలపై విస్తృత ప్రచారం చేపట్టాలి. ఆహార పదార్థాల ఉత్పత్తిదారులు, విక్రయశాలల్లో నిరంతరం తనిఖీలు నిర్వహించి అక్రమాలకు పాల్పడినవారిని కఠినంగా శిక్షించాలి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో స్థానిక ప్రభుత్వాల పాత్రను పెంచి ఆహార భద్రతను కట్టుదిట్టం చేయాలి.