Jul 24,2023 16:31
  •  జిల్లా కలెక్టరేట్  వద్ద ధర్నా 
  • అగ్రిగోల్డ్ బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలి
  •  సిపిఐ రాష్ట్ర కార్యవర్గ  సభ్యులు తాటిపాక  మధు 

ప్రజాశక్తి-కాకినాడ : అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అగ్రిగోల్డ్ భాదితులకు న్యాయం చేయాలనీ కోరుతూ రాష్ట్ర కమిటీ  పిలుపులో భాగంగా సోమవారం స్థానిక కలెక్టరేట్ జిల్లా పరిషత్  సెంటర్ వద్ద వర్షంలో తడుస్తూ ధర్నా నిర్వహించారు. అనంతరం స్పందన లో వినతిపత్రం ఇచ్చారు. ఈ  ధర్నాను ఉద్దేశించి తాటిపాక మధు మాట్లాడుతూ అగ్రిగోల్డ్ బాధితుల్లో ఉన్న వారందరూ సామాన్య, మధ్యతరగతి ప్రజలని, వారు కాయ కష్టం చేసి రూపాయి రూపాయి దాచుకున్న సొమ్ము అని, సొంత ఇల్లు కట్టుకోవాలని, ఆడపిల్లల పెళ్లి చేయాలని, పిల్లల్ని చదివించుకోవాలని ఆశతో దాచుకున్న సొమ్ముకు భద్రత లేకుండా పోయిందన్నారు.  వైఎస్ఆర్సిపి రాష్ట్ర ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులకు భరోసా ఇచ్చి ఎన్నికల్లో గద్దెనెక్కి నాలుగు సంవత్సరాలు పైగా గడుస్తున్న అగ్రిగోల్డ్ బాధితుల సమస్యల పరిష్కరించడంలో విఫలం అయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం 2024 ఎన్నికల్లో లోపు అగ్రిగోల్డ్ బాధితుల బాండ్ రూపంలో ఉన్న సొమ్మును చెల్లించాలని లేకుంటే ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని మధు అన్నారు. మాట్లాడుతూ అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలను మాజీ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు  దృష్టికి తీసుకు వెళ్తానని,తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామని ఆయన అన్నారు. 
ఏఐటీయూసీ జిల్లా ప్రధాన  కార్యదర్శి తోకల ప్రసాద్, యూనియన్  నాయకులూ బాలరాజు మాట్లాడుతూ వైసిపి రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు  మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మూడు నెలల్లోగా  అగ్రిగోల్డ్ బాధితుల బాండ్ల సొమ్ము చెల్లిస్తానని అగ్రిగోల్డ్ బాధితులకు హామీ ఇచ్చిందని, ఆ ఎన్నికల హామీని తక్షణమే అమలు చేయాలన్నారు. కేవలం అగ్రిగోల్డ్ బాధితులు ఓట్లతో నెగ్గిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలు పట్టించుకోకపోవడం సిగ్గుచేటని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అగ్రిగోల్డ్ బాధితుల బాండ్స్ సొమ్ము వెంటనే చెల్లించాలని, లేకుంటే అగ్రిగోల్డ్ బాధితులకు అండగా ఉండి వారి ఉద్యమ  పోరాటానికి ఏ సమస్య అయినా పరిష్కారం కావాలంటే పోరాటం తప్ప వేరే మార్గం లేదని, ఆ పోరాటం ఫలితంగానే అగ్రిగోల్డ్ బాధితులు సమస్యలు కొంతవరకు పరిష్కారం అయ్యాయన్నారు.  20 వేల రూపాయలు పైగా ఉన్న బాండ్ల రూపంలో ఉన్న సొమ్ము చెల్లించాలంటే గ్రామీణ స్థాయి నుంచి, మండల స్థాయి,  జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు ఉద్యమం తీవ్రతరం చేయాలని, ఇది ఎన్నికల సమయం అని, తాడోపేడో తేల్చుకునే పోరాట సమయం అని, రాష్ట్ర ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితుల సమస్యల పరిష్కరించకపోతే 2024 ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఓటు వేయొద్దని ప్రతి అగ్రిగోల్డ్ బాధితులు అండ్ ఏజెంట్లు ఎన్నికల్లో ప్రచారం చేయాలన్నారు. ఎవరైతే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తారో వారికే మా మద్దతు ఉంటుందని అనే నినాదం ప్రజల్లోకి తీసుకెళ్లాలని వారన్నారు. సామాన్య, మధ్య మధ్యతరగతి, కార్మిక ప్రజా ప్రజానీకానికి  కేంద్ర కార్మిక సంఘాల తరఫున తమ మద్దతు ఉంటుందని, అగ్రిగోల్డ్ బాధితుల ఆధ్వర్యంలో చేపట్టిన ఏ ఉద్యమానికి అయినా తమ సంపూర్ణ సహకారం మద్దతు ఉంటుందని వారన్నారు. ఈ కార్యక్రమంలో అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు వై. నాగలక్ష్మి, వీరమణి , బొమ్మేటి రాంబాబు, కొల్లు శ్రీనివాస్,  వై.కే. రాజు, శేఖర్, అర్జున్ రావు, బాబి, ఏసు రాజు, వీర్రాజు, జోగిరాజు, మోహన్ ప్రసాద్ రాజబాబు తదితరులు  నాయకులు పాల్గొన్నారు.