
కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య అనూహ్యంగా పెరుగుతుండటంతో అనేక దేశాలు మళ్లీ ఆంక్షలను విధిస్తున్నాయి. కొన్ని దేశాలు ఇప్పటికే విమాన ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి. మన దేశంలోనూ వైరస్ వ్యాప్తిపై ఆందోళనలు నెలకొన్నాయి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేస్తూ లేఖ రాయడం ఆహ్వానించదగిన పరిణామం. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ బుధవారం ఉన్నత స్థాయి సమావేశాన్ని కూడా నిర్వహించింది. అయితే లేఖతో పాటు సమావేశంలోనూ రాష్ట్రాలకు సూచనలు చేయడం తప్ప కేంద్ర ప్రభుత్వం చేపట్టే నిర్దిష్ట చర్యల ఊసు లేదు. గతానుభవాల దృష్ట్యా ఈ తరహా ధోరణి ఏమాత్రం మంచిది కాదు. కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్న సమాచారం ప్రకారమే కరోనా వైరస్ తాజా విజృంభణకు కారణమైన ఒమిక్రాన్ కొత్త వేరియంట్ బిఎఫ్-7 కూడా మన దేశంలో వెలుగులోకి వచ్చింది. బుధవారం నాటికి దేశంలో ఈ రకం వైరస్ ముగ్గురికి సోకింది. ఇది బలంగా ఇన్‌ఫెక్షన్ కలిగిస్తుందని, ఇంక్యుబేషన్ వ్యవధి తక్కువగా ఉండటంతో పాటు ఒకరి నుండి మరొకరికి త్వరగా వ్యాపిస్తుందని, వ్యాక్సిన్ల సామర్ధ్యాన్ని సైతం అధిగమిస్తుందని అంతర్జాతీయ నిర్ధారణ. అయితే, మన దేశంలో బిఎఫ్-7 రకం తొలి కేసును అక్టోబర్‌లోనే గుజరాత్‌లో గుర్తించారు. ఆ తరువాత ఇప్పటి వరకు మరో మూడు కేసులు మాత్రమే వెలుగులోకి వచ్చాయి. వీటిలో రెండు గుజరాత్ లోనే నమోదుకాగా, మరొకటి ఒడిశాలో వెలుగులోకి వచ్చింది.
జాన్స్ హాప్కిన్స్ కోవిడ్ ట్రాకర్ తాజా గణాంకాల ప్రకారం గడిచిన 28 రోజుల్లో (డిసెంబర్ 21 నాటికి) జపాన్‌లో అత్యధికంగా 34 లక్షల కేసులు నమోదయ్యాయి. దక్షిణ కొరియాలో 16 లక్షల కొత్త కేసులు, 1,385 మరణాలు సంభవించాయి. అమెరికాలో గత 28 రోజుల్లో 15,89,284 మందికి వైరస్ సోకింది. కోవిడ్ 19 వెలుగులోకి వచ్చినప్పటినుండి ఆ దేశంలో మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య 100 మిలియన్లకు చేరింది. ఫ్రాన్స్‌లో 15,26,427 మంది ఈ కాలంలో కొత్తగా వైరస్ బారిన పడ్డారు. బ్రెజిల్‌లో 9,45,568 మందికి వైరస్ సోకగా, 3,125 మంది మరణించారు. చైనాలో 9,17,308 కేసులు నమోదుకాగా, 646 మరణాలు సంభవించాయి. జీరో కోవిడ్ పాలసీని సడలించిన తరువాత చైనాలో వైరస్ ఉధృతంగా వ్యాపిస్తోంది. జీరో కోవిడ్ విధానాన్ని కార్పొరేట్ మీడియా తీవ్రంగా విమర్శించిన సంగతి ఈ సందర్భంగా ప్రస్తావనార్హం. ఈ సమయంలోనే మన దేశంలో 6,482 మంది వైరస్ బారిన పడగా 86 మంది మృతి చెందినట్లు జాన్స్ హాప్కిన్స్ కోవిడ్ ట్రాకర్ నమోదు చేసింది.
కరోనా వ్యాప్తితో గత మూడేళ్ల కాలంలో దేశంలో కోట్లాది మంది ఆప్తులను కోల్పోయారు. ఆకస్మిక లాక్‌డౌన్ సామాన్యుల జీవితాలను ఛిన్నాభిన్నం చేసింది. కోల్పోయిన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఇంకా పూర్తిస్థాయిలో పునరుద్ధరణ జరగలేదు. ఆర్థిక సంక్షోభం ప్రజలను వెంటాడుతూనే ఉంది. ఈ పరిస్థితుల్లో వైరస్ వ్యాప్తిచెందకుండా చర్యలు చేపట్టడంతో పాటు, కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత. గతానుభవాలను దృష్టిలో ఉంచుకుని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వరకు వైద్య, ఆరోగ్య వ్యవస్థలను తక్షణమే బలోపేతం చేసుకోవాలి. దానికవసరమైన నిధులను యుద్ధ ప్రాతిపదికన రాష్ట్రాలకు కేంద్రం ఇవ్వాలి. మందులకు కొరత రాకుండా చూడాలి. వ్యాక్సినేషన్ గురించి కేంద్ర ప్రభుత్వం ఎంత గొప్పగా చెబుతున్నప్పటికీ దాదాపుగా 27 శాతం మంది ఇంకా మొదటి విడత వ్యాక్సినే అందలేదు. రెండు డోసులు వేసుకోని వారి సంఖ్య 32 శాతం దాకా ఉంది. ఇక బూస్టర్ డోస్ లెక్కల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచింది. ఈ వాస్తవాన్ని గుర్తించి ప్రజలందరికి ఉచితంగా వ్యాక్సిన్ అందించడానికి కేంద్రం ఇప్పటికైనా సిద్ధపడాలి. వైరస్‌ను అడ్డుపెట్టుకుని కార్పొరేట్ మిత్రులకు కోట్లు కట్టబెట్టే విధానానికి స్వస్తి పలికి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్రాలతో కలిసి కార్యాచరణకు కదలాలి. అటువంటి చర్యలే ప్రజలకు ధైర్యాన్నిస్తాయి. మహమ్మారిని నియంత్రించడంలో వారందరినీ భాగస్వామలను చేస్తాయి.