ప్రజాశక్తి-ఆదోని : ప్రభుత్వ ఆసుపత్రులలో కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా మెరుగైన వైద్యం అందిస్తామని పాలకులు చెబుతూనే ఉన్నారు. జ్వరంతో ఆసుపత్రికి వస్తే సామాన్య రోగులకు విశ్రాంతి తీసుకున్నందుకు కూడా అవకాశం లేకపోవడంతో నిల్చోలేక నేలపైన కూర్చుంటున్నారు. ఆస్పత్రి ఆవరణంలో సేద చీరెందుకు కూడా అవకాశం లేని పరిస్థితి ఓపి రాయించుకునేందుకు బారులు తీరుతున్నారు. అసలే ఎండాకాలం కావడంతో ఉక్కుపోతకు వరుసలో నిలుచలేక కొందరు ఆయాస పడుతూ ఉంటున్నారు ఆన్లైన్ సర్వర్ మురారిస్తుండడంతో వివరాలు నమోదుకు కొంత సమయం అవుతుండడంతో మరో కౌంటర్ ఏర్పాటు చేయాలని రోగులు కోరుతున్న పట్టించుకునే వారే లేరు.
- కర్నూలు రేఫర్ అంటున్న వైద్యులు :
రోడ్ యాక్సిడెంట్లు,ఇరువర్గాల ఘర్షణ ఇతర ప్రమాదాల బారిన పడ్డ వారికి అరకొరగా ప్రాథమిక చికిత్స అందించి కర్నూలు కు రెఫర్ చేస్తున్నారు. కర్నూలు ఆస్పత్రి 100 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో కోలుకోక కొందరు మార్గమధ్యలోనే మృత్యువాత పడుతున్న ఘటనలో ఉన్నాయి. మంచి ట్రీట్మెంట్ ఇస్తే కాపాడిన వారు అవుతారని పలువురు అంటున్నారు. ఆలూరు,హాలగుంద, కోసిగి, కౌతాళం, ఆస్పరి,పెద్దకడబురు ఇతర గ్రామాల వారు ఈ ఆసుపత్రికి వస్తూ ఉంటారు రోగుల సంఖ్య అనుగుణంగా వైద్య సదుపాయాలు కల్పించాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ వైద్యము పేదలకు అందని ద్రాక్ష అని పలువురు చెబుతున్నారు.
- పెంచేసిన ఓపి చార్జీలు:
ఆదోనిలో ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులు ఓ పి చార్జి అమాంతంగా పెంచారు. 100 నుండి 200 రూపాయలకు వసూలు చేస్తున్నారు. రోజు మరిచి రోజు రోగులు వెళ్లిన కొత్తగా ఓపి తీసుకోవాల్సి ఉంది. దీనికి తోడు ఇష్టానుసారంగా మందులు వ్రాయిస్తూ, ఎక్స్రే, స్కానింగ్, రక్త పరీక్ష అంటూ కనీసం రూ 2వేలకు తగ్గకుండా డబ్బు చెల్లించాల్సి వస్తుందని రోగులు చెబుతున్నారు. ఈ మొత్తం చెల్లించుకోలేక ప్రభుత్వ ఆసుపత్రికి వెళితే అక్కడ కనీసం చూసేవారే కరవడంతో పేద రోగు లు ఇబ్బందులు పడుతున్నారు.
జ్వరము, తలనొప్పి శ్వాస సంబంధమైన రుగ్మతలను ఎదుర్కొంటున్న వారు అధికంగా వస్తున్నారు. కనీసం రోగాలు ఎదుర్కొంటున్న పరిస్థితులు సమస్యలు వినే వారే కరువయ్యారని వాపోతున్నారు. ఆదోని పట్టణంలోనే ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగుల పరిస్థితి అద్వానంగా ఉంది. సీజనల్ వ్యాధులు ప్రభలతుండడంతో ప్రైవేట్ ఆస్పత్రులలో వేలాది రూపాయలు ఫీజులు చెల్లించుకోలేక సామాన్య రోగులు ప్రభుత్వ హాస్పిటల్ ను ఆశ్రయిస్తున్నారు. అక్కడ మెరుగైన వైద్యం దేవుడు ఎరుగు కానీ కనీసం సెలెన్ బాటిల్ కూడా స్వేచ్ఛగా ఎక్కించుకోలేని పరిస్థితులు ఉన్నాయని రోగులు వాపోతున్నారు.
- ఓపి చీటికి అవస్థలు:
ఆదోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి రోజుకు 300 మంది రోగులు ఓపి కి వస్తున్నారు. అందులో ఆయాసం ,దగ్గు, జ్వరం ,ఒళ్ళు నొప్పులు,ఇతర ప్రమాదాలు జరిగిన వారు వస్తూ ఉంటారు. ఓపి కౌంటర్లో వివరాలు ఆన్లైన్లో నమోదు చేసి స్లిప్ చేతికిచ్చేలోపు సమయం పడుతుండడంతో వరుసలో నిలవలేక ఇబ్బందులు పడుతున్నారు. మహిళలు పురుషులకు ఒకే కౌంటర్ ఉండడంతో వరుసలో నిల్చలేక సోమ్మసిల్లి పడిన సందర్భాలు ఉన్నాయని రోగులు వాపోతున్నారు. కనీసం మరొక కౌంటర్ ఏర్పాటు చేయాలని ఆస్పత్రి నిర్వహకులకు కోరిన పట్టించుకునే వారే లేరని రోగులు మండిపడుతున్నారు.
- పేరుకే 100 పడకలు:
ఆదోని ఏరియా ఆసుపత్రి 100 పడకలుగా గుర్తింపు ఉంది అందుకు తగ్గట్టు సదుపాయాలు, వైద్యులు, నర్సులు,మందులు, ఇతర సిబ్బంది లేరని రోగులు చెబుతున్నారు.అరకొర డాక్టర్లు ఉన్నా కనీసం చేయి ముట్టి చూడని వైనం అంటూ కొందరు రోగులు ఆవేదన చెందుతున్నారు. తాము చెప్పిందే మాత్రమే వింటున్నారని పారాసిటిమల్, పెయిన్ కిల్లర్, సెలైన్ బాటిల్స్ మాత్రమే ఇస్తూ, మెరుగైన వైద్యము కనపడని పరిస్థితిని బహిరంగంగానే చెబుతున్నారు .పడకలు చాలక ఒకే మంచం పై ఇద్దరేసి పడుకోవడం వల్ల కనీసం పక్కకు కూడా తిరగలేని దుస్థితి అని ఈ నేపథ్యంలో నరకం చూస్తున్నామని వాపోతున్నారు. సామాన్యులంటే ఇంత చులకనా అంటూ వైద్యులు తీరు పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు
- ఆస్పత్రిలో మారని పరిస్థితి:
ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులు పడుతున్న అవస్థలను కళ్లకు కట్టినట్లు వివరిస్తున్న డివిజన్ కేంద్రమైన ఆదోనిలో ఉన్నత అధికారులు అటువైపు కన్నెత్తి చూడని పరిస్థితిని పలువురు విమర్శిస్తున్నారు. ఇటీవల జిల్లా కలెక్టర్ సృజన ఆస్పత్రిని తనిఖీ చేసి సమస్యలను తెలుసుకున్నారు అక్కడ ఉన్న పరిస్థితులు చూసి ఆమె కూడా చలించిపోయిన సందర్భాలు ఉన్నాయి. తరచుగా తనిఖీలు చేసి ఉద్యోగుల్లో మార్పు దిశగా అధికారులు కృషి చేయాలని కోరుతున్నారు . కొందరు వైద్యులు ప్రవేటు క్లినికులపై ఉన్న శ్రద్ధ డ్యూటీ పై చూపడం లేదని అంటున్నారు ఆదోనిలో సబ్ కలెక్టర్ ఉన్న అప్పుడప్పుడు ఆసుపత్రిని సందర్శించాలని రోగులు కోరుతున్న పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి .నెలకు ఒకసారి ఆసుపత్రి అభివృద్ధి సలహా కమిటీ సమావేశం ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి సమక్షంలో జరుగుతున్న సమస్యల ప్రస్తావన లేకపోవడం దురదృష్టకరమంటున్నారు. సమస్యలను సమావేశం దృష్టి తీసుకొచ్చి పరిష్కార దిశగా చొరవ చూపే అవకాశమున్న ఆస్పత్రి అధికారులు ఆదిశగా దృష్టి సారించకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనమని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.










