యశోవతి దేశం రాజు మహీధరుడు ప్రజలకు మంచి పరిపాలన ఇవ్వడమే కాకుండా.. విద్యను ప్రోత్సహించి, ఎన్నో విద్యాలయాలు కట్టించి, విశేష పుస్తక సేకరణ కూడా చేశాడు.
ఒకరోజు మహారాణి నీలాంబరి ఈ విధంగా చెప్పింది. 'మహారాజా! అంతఃపురంలోనే ఉండి ఉండి ఈ రాజ భోగాల మధ్య కొంత విసుగు కలుగుతోంది. నా కోరిక మన్నించి, నన్ను మన రాజ్యం పక్కనే ఉన్న అడవికి తీసికెళ్ళండి. ఆ అడవి గాలి హాయిగా ఉంటుంది. అదొక గొప్ప అనుభూతినిస్తుంది' అని చెప్పింది. రాణి మాటలు విన్న మహీధరుడికి కూడా ఒకరోజు అడవిలో హాయిగా గడపాలనిపించింది.
మరుసటి రోజు రాజు, రాణి కేవలం ముగ్గురు పరివారాన్ని తీసుకుని, అడవికి వెళ్లారు. అక్కడ పెద్దపెద్ద చెట్లు, వెదురు, దుంప చెట్లు, వింతైన పువ్వుల గురించి రాణికి వివరించాడు రాజు. ఎత్తయిన చెట్ల మీద ఉన్న పక్షుల తియ్యని పాటలు రాణికి ఎంతో ఆనందాన్ని ఇచ్చాయి. అంతే రాణి కూడా పాట పాడటం మొదలుపెట్టింది. 'అడవిలోని కాలుష్యం లేని వాతావరణం, అద్భుతమైన ప్రకృతి మన కళలకు, శక్తులకు మరింత మెరుగునిస్తాయని విన్నా.. కానీ ఇప్పుడే అది చూస్తున్నా' అంటూ రాణిని ప్రశంసలతో ముంచెత్తాడు రాజు. భోజనం చేసుకుని తిన్న తర్వాత రాజు, రాణి కొంతసేపు అడవి లోపలికి షికారుకు వెళ్లారు. అప్పుడే వారికి చెట్టుకు ఎత్తులో గిజగాడి గూళ్లు కనబడ్డాయి. దూరంగా ముగ్గురు గొర్రెల కాపరులు గొర్రెలు మేపుతూ కనబడ్డారు. అంత కళాత్మకమైన గిజగాడి గూళ్లు చూసిన మహారాణి 'రాజా! నాకు రెండు గిజగాడి గూళ్లు కావాలి. మన అడవి సందర్శన జ్ఞాపకంగా అంతఃపురంలో అలంకరిస్తా' అని అడిగింది.
దూరంగా ఉన్న గొర్రెల కాపరుల్లో నుంచి ఒక యువకుడిని పిలిచి రాజు. 'నీవు ఆ చెట్టెక్కి జాగ్రత్తగా రెండు గిజిగాడి గూళ్ళు తీసి ఇస్తావా?' అని అడిగాడు. అతడు రాజు, రాణి వైపు చూడసాగాడు. ఆ చూపుకి రాజు, రాణి ఆశ్చర్యపోయారు.
'అయ్యా! నన్ను తప్పుగా అనుకోకండి. పక్షి గూడు తీస్తే అందులో దాని గుడ్లు ఉండవచ్చు! లేదా పిల్లలు ఉండవచ్చు. తల్లి పక్షి అడవంతా తిరిగి వచ్చేసరికి దాని గుడ్లు, పిల్లలు లేకపోతే అది బాధతో విలవిలలాడుతుంది. ఒకవేళ మీరు పక్షి గూడు తీసుకుని వెళ్లినా ఆ గుడ్లు, పిల్లలు తల్లి లేక ఏడుస్తాయి. ఒక్కసారి ఆలోచించండి!' అన్నాడు.
ఆ యువకుడి ఆలోచనకు రాజు, రాణి ఆశ్చర్యపోయారు. వెంటనే రాజు తన మెడలోని ముత్యాలహారం ఇవ్వబోయాడు. 'అయ్యా! మీరు అడిగిన పని నేను చేయలేదు. కాబట్టి నాకు హారం వద్దు' అన్నాడు.
అతని సంస్కారానికి మరోసారి ఆశ్చర్యపోయాడు రాజు. 'నీవు పక్షిగూడును గురించి చెప్పిన మాటలు మా కళ్లు తెరిపించాయి. ఈ హారం తీసుకో' అంటూ ఆప్యాయంగా అతని తల నిమిరి ఇచ్చాడు రాజు.
'మనం ఎన్ని చదువులు చదివినా.. ఆ గొర్రెలు కాచే యువకుడిలా ఆలోచించలేకపోయాం. కొన్ని విషయాలు ప్రత్యక్షంగానే తెలుసుకోగలుగుతాం' అన్నాడు రాజు. 'అవును మహారాజా! మన ఆనందం కోసం పంజరాల్లో చిలుకల్ని, జింకలను, నెమళ్లను పెంచుతున్నాం. వాటిని అడవిలో వదలి స్వేచ్ఛ కల్పిద్దాం' అన్నది రాణి.
'లెస్సగా పలికావు రాణి, అలాగే చేద్దాం!' అని రాజు సంతోషంగా పరివారంతో కలసి అంతఃపురానికి తిరిగి వెళ్ళారు.
- కంచనపల్లి వెంకట కృష్ణారావు
9348611445