న్యూఢిల్లీ : వివాదాస్పద అదానీ గ్రూప్ అంబుజా సిమెంట్‌లోని తన వాటాలో కొంత భాగాన్ని విక్రయించనుంది. రుణాలను తగ్గించుకునేందుకు, పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్పి పునరుద్ధరించే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు జాతీయ మీడియా ఓ నివేదికలో పేర్కొంది. జనవరిలో హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక అనంతరం అదానీ స్టాక్స్ దెబ్బతిన్న సంగతి తెలిసిందే. నివేదిక అనంతరం అదానీ గ్రూప్ జాబితా కంపెనీల మార్కెట్ విలువ నుండి 145 బిలియన్ డాలర్లు కోల్పోయింది. ఈ నేపథ్యంలో ఇది మొదటి ఆస్తి విక్రయం కానుందని ఆ నివేదిక తెలిపింది. అంబుజా సిమెంట్ కంపెనీలో ఉన్న తన వాటాలో 4-5 శాతం విక్రయించడం ద్వారా సుమారు 450 మిలియన్ డాలర్లు సేకరించనున్నట్లు పేర్కొంది. అయితే ఈ వాటాలను ఎవరు కొనుగోలు చేయనున్నారనే వివరాలను వెల్లడించలేదు.
అంబుజా సిమెంట్‌లో అదానీ 63 శాతం వాటాలను కలిగి ఉన్నారు. హోల్కిమ్ భారతీయ ఆస్తుల కోసం 10.5 బిలియన్ డాలర్ల ఒప్పందంలో భాగంగా అంబుజా సిమెంట్‌లో వాటాలను అదానీ కొనుగోలు చేశారు. దీంతో రాత్రికి రాత్రే అదానీ సంస్థ దేశంలోనే రెండవ అతిపెద్ద సిమెంట్ వ్యాపారిగా అవతరించింది. బార్క్లెస్, స్టాండర్డ్ చార్టర్డ్, డ్యుయిష్ బ్యాంక్‌ల నేతృత్వంలోని 14 అంతర్జాతీయ బ్యాంకుల కన్సార్టియం ఈ ఒప్పందానికి ఆర్థిక సహాయం కింద 4.5 బిలియన్ డాలర్లు అందించింది. ఈ రుణంలో కొంత భాగం చెల్లించినప్పటికీ... ఈ నెల ప్రారంభంలో మరికొంత చెల్లించాల్సి వుంది. ఈ నెల ప్రారంభంలో అదానీ గ్రూప్‌కు చెందిన ఓ ప్రైవేట్ సంస్థ తన నాలుగు కంపెనీల్లో 1.9 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను ప్లోరిడాకు చెందిన జిక్యూజి భాగస్వామ్యులకు విక్రయించింది.










