జేడీ చక్రవర్తి.. తెలుగు సినీ పరిశ్రమలో విలన్‌గా, హీరోగా, కారెక్టర్ ఆర్టిస్టుగా, నిర్మాతగా, దర్శకుడిగా, సంగీత దర్శకుడిగా సుపరిచితుడే. విలన్‌గా తెరంగేట్రం చేసి హీరోగా మారారు. మంచి పాత్రలు చేస్తూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. కొన్ని సినిమాల్లో కారెక్టర్ ఆర్టిస్టుగానూ అలరించారు. పలు చిత్రాలకు దర్శకత్వమూ వహించారు. కొన్ని సినిమాలను నిర్మించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా ఎంతో గుర్తింపు సంపాదించుకున్నటువంటి జేడీ కొంతకాలం పాటు ఇండిస్టీకి దూరమయ్యారు. అయితే తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఆయన ప్రధానపాత్రలో నటించిన 'దయా' వెబ్‌సీరిస్ ఈ నెల 4న విడుదలైంది. ఈ సందర్భంగా ఆయన పలు విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు.
జేడీ చక్రవర్తి అసలు పేరు నాగులపాటి శ్రీనివాస చక్రవర్తి. కర్ణాటక గాయని ప్రొఫెసర్ డాక్టర్ కోవెల శాంత, నాగులపాటి సూర్యనారాయణరావు దంపతుల కుమారుడు. హైదరాబాద్‌లో జన్మించాడు. అతని అక్క వైజయంతి అమెరికాలో స్థిరపడింది. అతను సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్లో తన పాఠశాల విద్యను అభ్యసించారు. చైతన్య భారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీలో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు.
1989లో వచ్చిన దర్శకుడు రామ్‌గోపాల వర్మ ద్వారా 'శివ' సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. తర్వాత నేటి సిద్ధార్ధ, శ్రీవారి చిందులు, అతిరథుడు, రక్షణ, ఆదర్శం పలు సినిమాల్లో విలన్ రోల్స్ చేశాడు. తర్వాత శివ నాగేశ్వరరావు దర్శకత్వంలో వచ్చిన 'మనీ' చిత్రం ద్వారా హీరోగా పరిచయమయ్యాడు. అక్కడి నుంచి వరుసగా పలు చిత్రాల్లో హీరోగా నటించి, క్రేజ్ సంపాదించాడు. కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన గులాబీ సినిమా జేడీ చక్రవర్తి కెరీర్‌ని మలుపు తిప్పింది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు. అనగనగా ఓ రోజు, దెయ్యం, బొంబాయి ప్రియుడు, ఎగిరే పావురమా, ప్రేమకు వేళాయెరా.. వరుస సినిమాల్లో నటించారు. అవి అన్నీ మంచి పేరు తెచ్చిపెట్టాయి. 1998లో వచ్చిన సత్య సినిమాతో స్టార్‌డమ్ వచ్చింది. ఈ సినిమా తెలుగులోనే కాదు. హిందీలోనూ జేడీకి గుర్తింపు వచ్చిన చిత్రంగా నిలిచింది.
ఈ క్రమంలో ఈ నెల విడుదలైన 'దయా' వెబ్ సీరిస్‌లో చేపల్ని ఒక ఊరి నుంచి మరో ఊరికి తీసుకెళ్లే ఫ్రీజర్ వ్యాన్ డ్రైవర్ పాత్రలో కనిపించారు. ఈ సినిమాలో 'నాకు చెవుడు. నా పని, గర్భవతిగా ఉన్న నా భార్య.. ఇలా సాధారణ జీవితం గడుపుతుంటా. అనుకోకుండా నా వ్యాన్‌లో ఓ రోజు ఓ అమ్మాయి శవం కనిపిస్తుంది. ఆ భయంలో ఉండగానే మరో శవం దొరుకుతుంది. నా చుట్టూ చోటుచేసుకున్న ఘటనలు, భావోద్వేగాలు ప్రేక్షకుల్లో ఆసక్తిరేకిస్తాయి. తెలుగు నా సొంత భాష. ఎప్పుడు అనుకుంటే అప్పుడు తెలుగు ఇండిస్టీలోకి రావొచ్చనే ఓ నమ్మకం ఉంది.
హీరోయిన్లు చిన్న చిన్న దుస్తులు వేస్తేనే సినిమాలు ఆడతాయనుకుంటే అది అబద్ధం. సినిమాని సినిమాగా చూడటానికే వస్తారు ప్రేక్షకులు. దర్శకులకి వాళ్ల కథలపై నమ్మకం లేనప్పుడే అలాంటి సన్నివేశాల్ని, మాటల్ని జోడించాలనే ఆలోచనలు వస్తాయి. 'బాహుబలి', 'పుష్ప', 'ఆర్‌ఆర్‌ఆర్' సినిమాల్లో బూతులు ఉన్నాయనే చూశారా? లేదు కదా!. సినిమాకి, ఓటీటీలకు సెన్సార్ ఎందుకు ఉండాలి. ముందు దర్శకుడి బుర్రకి సెన్సార్ ఉండాలి. కథ రాస్తున్నప్పుడు నాలుగ్గోడల మధ్యే తేలిపోయే వ్యవహారం అది. గొప్ప దర్శకులు తీసిన మంచి సినిమాలు ఇప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో ఉన్నాయి. వాటి గురించి ఓసారి ఆలోచిస్తే అసభ్యకరమైన సన్నివేశాలు ఉండటంతోనే అవి మంచి సినిమాలుగా నిలిచాయా? లేదా? అనేది అర్థమవుతుంది.
తెలుగులోనే కాదు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ సినిమాల్లోనూ నటించారు. పాపే నా ప్రాణం సినిమాకి నిర్మాతగా వ్యవహరించారు. ఇక పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే జేడీ లక్నోకి చెందిన అనుకృతిని 2016లో వివాహమాడాడు. వ్యక్తిగత కారణాల వల్ల విడిపోయారు.
పేరు : నాగులపాటి శ్రీనివాస చక్రవర్తి
జననం : 1972 ఏప్రిల్ 16, రాజమండ్రి , ఆంధ్రప్రదేశ్.
ఇతర పేర్లు : జె. డి., గడ్డం చక్రవర్తి
వృత్తి : నటుడు, దర్శకుడు, నిర్మాత.
జీవిత భాగస్వామి : అనుకృతి