Jul 16,2023 07:31

తూటాల వాన కురిపించి
రాకెట్‌ లాంచర్లు సంధించి
ఫిరంగుల మోత మోగించి
బాంబు దాడులు జరిపించి
పెను విధ్వంసాలు సృష్టించి
మానవ హననం గావిస్తావు
ఓయీ.. యుద్ధపిపాసీ!
పచ్చటి బతుకుల కాల్చి
జీవన సౌధాలను కూల్చి
నేలను వల్లకాడుగా మార్చి
కడకు ఏమి బావుకుంటావు
ఏకాకివై దుఃఖించుట తప్పా!
యుద్ధాన్ని తెగ ముద్దాడిన
ముస్సోలిని నెపోలియన్‌
హిట్లర్‌ లాంటి నియంతలు
మట్టికొట్టుకు పోయారన్నది
చరిత్ర చెప్పిన నిష్ఠుర నిజం
ఇప్పటికైనా
దురహంకారం విడిచి
వినాశకర నైజం చెరిపి
సామ్రాజ్య కాంక్షను చెరిపి
మానవత్వాన్ని ప్రదర్శించు
సార్వజనీన ప్రేమలు పంచి
చరిత్రలో స్థానం సంపాదించు

కోడిగూటి తిరుపతి
95739 29493