
'గూగుల్ పే గానీ ఫోన్ పే గానీ లేదా మేడం?' ఉష ఇచ్చిన ఐదొందల నోటు వైపు చూసి, చిల్లర లేదన్నట్టు చెయ్యి వూపాడు ఆటో డ్రైవర్.
'లేవు, చిల్లర ఉంచుకోవాలి కదా నువ్వు. రెండొందల యాభై ఛారీకి ఐదొందలు ఇస్తే కూడా చిల్లర లేదంటే ఎలా?'.
'యాభై అయినా రెండొందల యాభై అయినా ఒకటే మేడం. చిల్లర లేదు. ఎందుకంటే పది రూపాయలు అయినా అందరూ ఈ మజ్జన గూగుల్ పేనో, ఫోన్ పేనో చేస్తున్నారు. అందుకే నా తాన కూడా నోట్లు లేవు. అయినా మీ దగ్గర గూగుల్ పే లేకపోతే ఎట్లమ్మా? మేమే పెట్టుకుంటుంటే?'.
'అవన్నీ పెట్టుకోవాలో వద్దో నా ఇష్టం. ఇప్పుడేం చేద్దామో చెప్పు?' ఒకళ్ల మీది కోపం ఇంకొకరి మీద చూపించడం సులభం.
'చేంజ్ తెచ్చి ఇయ్యండి' కదిలేది లేదన్నట్టు కూచున్నాడు.
ఎదురుగా మెడికల్ షాపుకి వెళ్లి 10 మాస్కులు, ఒక శానిటైజర్ బాటిల్ తీసుకుని ఐదొందల నోటు ఇచ్చింది.
'చిల్లర లేదు మేడం, గూగుల్ పే ఉందా?'.
కోప్పడే ఓపిక లేక శాంతంగా 'లేదు, చిల్లర కోసమే ఇవి కొన్నాను' అంది.
కొట్లో అమ్మాయి సొరుగులన్నీ వెతికి, చిల్లర ఇచ్చింది.
వాలెట్లు ఫోన్లో వేసుకోడం పెద్ద పనేమీ కాదు. కానీ ఆ తర్వాత అతని నస భరించడం చాలా పెద్దపని.
'ఆఫీసుకి ఆటో ఎక్కి వెళ్లే పనిలేదు. నేనే దింపుతా కదా! వీకెండ్స్ ఎక్కడికైనా వెళ్లాలంటే నేనుంటాను కదా! నువ్వెందుకు ఖర్చు పెట్టాలి? అదీ కాక, నిజం ఉషా, ఇలాటి వాలెట్లవీ ఉంటే, జేబులోంచి డబ్బు తీసే పని ఉండదు కాబట్టి, కనపడ్డ ప్రతిదీ కొనాలనిపిస్తుంది. వూరికే అందరూ ఇవి కంఫర్ట్ అంటారు గానీ, కంఫర్ట్ కంటే మన జేబు ఖాళీ చేయించే యాప్‌లు ఇవి.'
'ఆ యాప్‌లు అసలు సేఫ్ కాదట తెల్సా? మొన్న చదివాను, క్యూ ఆర్ కోడ్ మోసాలు ఎన్ని జరుగుతున్నాయో అసలు.'
'చేతిలో డబ్బు ఇచ్చినంత కంఫర్ట్ ఏ యాప్ ఇస్తుంది? అదే సేఫ్ అసలు. ఎక్కడైనా నెట్‌వర్క్ లేక అవి పని చెయ్యకపోతే?'.
ఇలా ఎంతసేపైనా, ఎన్ని రకాలుగానైనా వాదించగలడు.
ఇంతకుముందు వేసుకుంటే అదే అయింది. రోజూ ఏదో ఒక టాపిక్ తెచ్చి, దాన్ని గూగుల్ పే మీదికి మళ్లించడం.
వాలెట్ వాడి ఏదైనా కొనగానే 'చెప్పానా? ఫోన్లో యాప్ ఉంటే, ఇదే జరుగుతుంది. దేనికో ఒకదానికి ఖర్చు పెట్టేస్తూ ఉంటాం' అనటం.
నవ్వుతూనేలే, అయితే మాత్రం?
విసుగు పుట్టి, పీకి పారేసింది.
రాధికతో చెప్తే 'నువ్వలా విసుగు పుట్టి తీసేస్తావని అతనికి తెల్సు. అతను ఏం మాట్లాడినా, ఎంత మాట్లాడినా పట్టించుకోకుండా ఉంటే, అతనికే విసుగు పుట్టి, ఊరుకుంటాడు. వాలెట్స్ తీసేస్తే నీకే ఇబ్బంది. అది తెల్సుకో. ఇంత సెన్సిటివ్‌గా ఉంటే లాభం లేదు' అని చీవాట్లు పెట్టింది.
కానీ తనకి చేతకావట్లేదు. అతను ఏదైనా అనగానే ముందు రోషం వచ్చి కూచుంటుంది పిలవని పేరంటాలు మల్లే.
గవర్నమెంట్ ఉద్యోగంతో నెలకు లక్షా యాభై వేలు సంపాదించే తనకి ఇంటి ఆర్థిక వ్యవహారాల్లో చేతులు పెట్టొద్దని ప్రతి క్షణం సున్నితంగా హెచ్చరికలు.
ఏ చిన్న వస్తువు కొన్నా, 'వాడికి చెప్పావా?' అనో 'వాడితో ఒక మాట చెప్పి, కొనకపోయావా?' అనో డైలాగ్స్ తప్పకుండా వినపడకపోతే అది తన ఇల్లే కాదు.
ఇద్దరి అకౌంట్సూ అతనే హాండిల్ చేస్తాడు. 'ఈ రోజుల్లో కూడానా?' అని బుగ్గలు నొక్కుకునే సోషల్ మీడియా నివాసితులకు 'ఈ రోజుల్లో కూడా' బయట ప్రపంచంలో జరుగుతున్న అనేక దుర్మార్గాలు తెలియవు.. చూడరు.
ఇంటికి సంబంధించిన ఖర్చులూ అవీ అతనే చూస్తుంటే అది సహాయం అనుకుందిగానీ అదెంత పెద్ద కుట్రో గ్రహించలేక పోయింది.
'ఇంటికోసమేగా?' అని వదిలేసింది గానీ, తన సంపాదన తను ఖర్చు పెట్టుకుంటే కూడా లెక్క చెప్పాల్సి వస్తుందని ఊహించలేదు.
ఆ చిన్నపాటి నిర్లక్ష్యం తన డబ్బు మీద తన హక్కుల్ని నెమ్మదిగా హరించి వేస్తోందని తెలిసేసరికి, అది అతని హక్కు అయి కూచుంది.
రిటైర్మెంట్‌కి ఇంకా ఇరవై ఏళ్ల దూరంలో నిలబడ్డ తను ఓ మోస్తరు ఖర్చు ఏదైనా పెడితే, అతను వెంటనే ఆడిటర్ పాత్రలోకి వచ్చేస్తాడు.
పెద్దగా అభ్యంతర పెడుతున్నట్టు కనపడకుండానే 'ఎందుకూ ఏమిటీ? ఎవరికీ..' అంటూ వివరాలు రాబట్టే ప్రజ్ఞ.
'ఒక లెక్కంటూ ఉండాలి కదా?' అంటాడు ఎక్సెల్ షీటు తెరుస్తూ అలవోకగా పలికే జాగ్రత్త.
అతను పెట్టే ఖర్చుల గురించి ఎన్నడూ ఆరా తీయాలనో, అడగాలనో తట్టలేదు తనకి.
ఏ ఆడపిల్లల హోమ్‌కో, వాళ్ల స్కూలు ఫీజులకో విరాళం ఇస్తే, 'ఏమాత్రం ప్రయోజనం లేని ఛారిటీలు చేస్తావేంటి ఉషా? ఫలానా గుడికి ఇవ్వొచ్చు కదా, 80 జీ కింద ఎగ్జెంప్షన్ వచ్చేది కదా? ఇప్పుడు చూడు, ఆ పిల్లలకు ఫీజు కడితే మనకేం లాభం?'
ఈ ఆర్గ్యుమెంట్‌కి ఎంత వివరణ ఇస్తే, ఎన్ని విషయాలు, ఎన్ని సామాజిక వాస్తవాలు వివరిస్తే చాలుతుంది?.
చదువు పూర్తి కాగానే, గ్రూప్స్ రాసి వెంటనే జాబ్ సంపాదించింది తను. నెల నెలా జీతమేం చేసుకోవాలో తెలీక మొత్తం నాన్నగారికి ఇచ్చేది. నాన్న పైసా కూడా ఖర్చు పెట్టకుండా బ్యాంక్‌లో వేసేవారు.
'ఇష్టమైనంత ఖర్చు పెట్టుకో' అనేవారు కానీ, తనకే ఏ ఖర్చులూ ఉండేవి కాదు.
ఇప్పుడు అమ్మా వాళ్లింటికి వెళ్తే, వచ్చేటప్పుడు నాన్నగారు పదివేలు చేతిలో పెట్టి 'ఏదైనా కొనుక్కో' అంటారు తన వైపు చూడకుండా.
తన సంపాదన మీద తనకెంత హక్కుందో ఆయనకు తెలుసు.
'నాకెందుకు నాన్నా?' అంటుంటే తన గొంతు తనకే నూతిలోంచి వినిపిస్తుంది.
ఇంత అభిమానం లేకుండా ఉంటున్నానేంటని సందేహం వస్తుంది తనకే.
బయటి ప్రపంచానికి, బంధువులకు, కొలీగ్స్‌కీ మాత్రం తనొక ఐకాన్. బోలెడు జీతం, మంచి మొగుడు, టాపర్స్‌గా చదువుకుంటున్న ఇద్దరు ముత్యాల్లాంటి పిల్లలు, అత్తామామా! 'చల్లని సంసారం, పచ్చని కాపురం' లాంటి సినిమాటిక్ అడ్మిరేషన్ అందరికీ.
సాయంత్రం కాస్త ఆలస్యంగా ఇంటికి వస్తే చాలు.. అత్తామామలిద్దరూ ఒకరివైపు ఒకరు ఎందుకు చూసుకుంటారో ఇన్నేళ్లుగా చూస్తున్నా ఉషకి అర్థంకాదు.
అత్తగారు రిటైర్డ్ టీచర్. 'స్కూలు అవగానే డైరెక్ట్‌గా ఇంటికొచ్చి పడిపోయేదాన్ని. మిగతా టీచర్లు ఇంకా కబుర్లు చెప్పుకుంటూ ఆగమన్నా ఆగేదాన్ని కాదు. ఎంతసేపూ ఇంటి మీదే ధ్యాస. పిల్లలు ఏమైనా తిన్నారో లేదో అని కంగారుగా ఉండేది' అని కోడలికి ఉత్తమ ఇల్లాలు లక్షణాలు అట్టే లేవని గుర్తు చేస్తుంది.. ఇలా కనీసం వారానికి మూడుసార్లు.
'చేసుకున్న వారికి చేసుకున్నంత' అని ఆయన, సందర్భ శుద్ధి లేని సామెత ఒకటి వాడతాడు.
కోడలు ఉద్యోగం చేసి లక్షలూ తేవాలి, ఇంట్లో ఉత్తమ ఇల్లాలు పాత్ర సమర్థవంతంగా పోషించాలి.
రెండూ బాలెన్స్ చేసుకుంటూ తానెలా లాక్కొచ్చిందో వివరంగా చెప్పడానికి అత్తగారు ఎపుడూ సిద్ధ్దంగా ఉంటుంది.
ట్రాన్స్‌ఫÛర్ అవాయిడ్ చెయ్యడానికి రెండు ప్రమోషన్లు వదులుకున్న సందర్భాలు గుర్తొస్తే, ఉషకి ఆ రోజు అన్నం సయించదు.
పైగా కోడలు ఎక్కడి నుంచో వూడి పడి, రేప్పొద్దున కొడుకు సంపాదించిన దానికి ఓనరై కూచుంటుందని ఒక దుగ్ధ మనసులో. అది మాటల్లో కనబరుస్తూ ఉంటారు.
'ట్రాన్సఫర్ అయి ఏదో పల్లెటూర్లో యూపీ స్కూల్‌లో పనిచేయాల్సి వచ్చినపుడు ఎంత కష్టపడ్డాననుకున్నావు? ఆ కష్టం నీకొద్దు. ఇప్పుడు వస్తుంది చాల్లే.'
చెవులు మూసుకుంటుంది ఉష.
వాదన పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. కానీ తగాదాలు, గొడవలు అంటే తనకి భయం. ఆ తర్వాత రేగే అశాంతి, ఆందోళన ఇవన్నీ రోజుల తరబడి వెంటాడతాయి. వాటన్నిటినీ భరించలేదు.
'ప్రవీణ్, పొద్దున నీకు వాట్సప్లో పంపింది చూశావా? మా ఆఫీసులో చేతన్, అతని ఫ్రెండ్సూ కల్సి ఊరు చివర ఆ వెంచర్‌లో తలా రెండు ప్లాట్స్ తీసుకుంటున్నారట. ఆ బ్రోచర్ పంపాడు చూడు. ఇంటరెస్ట్ ఉందేమో చూడమన్నాడు.' ఇస్త్రీ చీరలు లెక్క చూస్తోంది ఉష.
'చూశాన్లే'
'ఏమంటావ్? ఆఫీసులో అందరూ తీసుకుంటున్నారు. పిల్లల పేరు మీద మనం కూడా..'
'ఇప్పుడేం వద్దు'
'ఎందుకు? నరేష్ వాళ్లు వెళ్లొచ్చారు. వీడియో చూపించారు. ఈ వీకెండ్ చూడ్డానికి ఇంకొంత మంది వెళ్తున్నారు. చిన్న వెంచర్ అది. అందరం ఒకేచోట తీసుకుంటే, రిటైర్మెంట్ తరవాత ఒకేచోట కట్టుకోవచ్చు లాంటి ప్లాన్స్ వేస్తున్నారు.'
తను ఇలాటి డబ్బు విషయాల్లో యాక్టివ్‌గా మాట్లాడ్డం అతనికి అయిష్టంగా తోస్తుంది
'రిటైర్మెంట్ ఇప్పుడప్పుడే దగ్గర్లో లేదు కదా? అయినా ఆ తర్వాత ఎక్కడికో పోయి ఎందుకుంటాం, ఇంత పెద్ద ఇల్లు పెట్టుకుని? ఐనా నేను షాద్‌నగర్ దగ్గర స్థలం ఫైనల్ చేశాను. చాలా బాగుంది అది. లోన్ అవసరం పడుతుంది. అప్లై చేయాలి నువ్వు'.
ఇలాటి సందర్భాలు ఎన్నిసార్లు ఎదురైనా, ఎప్పటికప్పుడు కొత్తగా ఆశ్చర్య పడటం మానదు ఉష.
'అదేంటి, చెప్పలేదేం?'.
'ఫైనల్ చేశాక చెప్దామని ఆగాను'.
'ఫైనల్ చేశాక ఇక చెప్పేదేముంది? నేను చూడొద్దా?'.
'ఏముంది ఉషా చూడ్డానికి? ఇన్వెస్ట్‌మెంట్ కోసం తీసుకుంటున్నాం అది. ఎప్పుడైనా చూడొచ్చు. అయినా నీకెందుకు ఆ తలనొప్పులన్నీ. నేను చూసుకుంటాను కదా! ఇన్వెస్ట్మెంట్ విషయాలు ఇద్దరిలో ఒకరు చూసుకుంటే చాలు. ఇవన్నీ చాలా హెడ్డేక్ తెల్సా? నువ్వు నీ ఆఫీసు, ఇల్లు, పిల్లలు.. ఎన్నని చూస్తావు?'.
మళ్లా ఇందులో ప్రశంస ఒకటి.
'నువ్వు పిల్లల సంగతి కాస్త చూస్తే, నేనూ ఇన్వెస్ట్మెంట్ సంగతి చూడగలను' అనాలని చాలాసార్లు ఉష అనుకుంటుంది. కాానీ, ఆ తర్వాత జరిగే పొడుగాటి నస పూర్వక పాఠాలు భరించడం బహు కష్టం కాబట్టి వదిలేస్తుంది.
తనకి కనీసం చెప్పకుండా కొనాలని డిసైడ్ చేసిన ఆస్తికి తను లోన్ తీసుకుని, వాయిదాలు కట్టాలి. అడిగితే అది మనకే కదా అనే వాదన రెడీగా ఉంటుంది.
ఉషకి ఇంతకంటే ఆశ్చర్యం కలిగించే విషయం.. ఆఫీసులో ఆడ కొలీగ్స్ చాలా మందికి ఇలాటి విషయాల మీద పెద్ద అభ్యంతరం లేకపోవడం.
'అబ్బ, ఆ తలనొప్పులన్నీ ఎవడు పడతాడు. ఆ షేర్లూ అవీ బోలెడంత టెన్షన్. అవన్నీ వాళ్లు పడతాం అంటుంటే మనకేమే? మనకు ఆఫీసులో ఉన్న టెన్షన్లు చాలవా?' అంటుంది వైదేహి.
'ఆఫీస్ తర్వాత నాకు దొరికే కొద్ది టైమూ నా పుస్తకాలూ, సినిమాలూ, పాటలూ.. అంతే.
'ఇంట్లో పన్లు ఎలాగూ తప్పవు' నీరజ చాలా ఏళ్లుగా ఇవన్నీ చూస్తూ, అనుభవిస్తూ, ఇహ ఇవన్నీ సహజమే అని సర్ది చెప్పుకుంటూ, ప్రతి ఇంట్లోనూ ఉంటాయనే యాక్సెప్టెన్స్‌లోకి దాదాపుగా తను జారిపోతున్న విషయం తెలుస్తున్నా, లోలోపల ఎక్కడో ఏదో స్వరం అరుస్తూ ఉంటుంది. ఎంత గొంతు నొక్కినా అది ఊరుకోదు.
ఈ రెంటి మధ్యా తను నలిగిపోతున్న విషయం ఉషకి గ్రహింపుకి వచ్చినపుడల్లా ఆ సంఘర్షణ తట్టుకోవడం భయంకరంగా ఉంటుంది.
వర్షం వచ్చేలా ఉందని మూడయ్యే సరికి ఆఫీసులో చాలామంది వెళ్లిపోయారు. తుపాను అలర్ట్ అని చెప్తోంది లంచ్ రూములోని టీవీలో న్యూస్ యాంకర్.
పని పూర్తయ్యేసరికి వర్షం మొదలవనే అయింది.
అంతకంతకూ పెద్దదైపోతోంది. మిగిలిన ఒకరిద్దరూ కూడా వెళ్లిపోయారు 'ఇంకా ఆలస్యం అయితే ఇరుక్కుపోతాం' అంటూ 'మీ ఇంటి దగ్గర దింపేసి వెళ్తాను రండి' మర్యాదగా పిలిచాడు అసిస్టెంట్ మేనేజర్ ప్రకాష్.
అతని ఇల్లు తన ఇల్లు వూరికి చెరోవైపూ.
'అయ్యో వద్దండీ, ప్రవీణ్‌కి ఫోన్ చేస్తాను'.
'ఇక్కడ కూడా పెద్ద వర్షం కురుస్తోంది ఉషా. రోడ్లన్నీ బ్లాక్ ఐపోయాయి అంటున్నారు. అయినా సరే, ట్రై చేస్తానుండు?'.
కారు తనకి అవసరం. టూ వీలర్ అయితే యాక్సిడెంట్స్ అవుతాయని కొనుక్కోనివ్వలేదు.
ఈ మధ్య కూడా ఎలక్ట్రానిక్ బైక్ ఒకటి బుక్ చేస్తానంటే, 'అవన్నీ పేలి పోతున్నాయి' వొద్దన్నారు.
'నీకెందుకు శ్రమ, నేను దింపుతాగా రోజూ ఆఫీసు దగ్గర.'
రోజూ అలా అతను పని గట్టుకుని దింపడం ఇష్టం లేదు తనకి. తనకు డ్రైవింగ్ వచ్చు. కారు తను తీసుకెళితే అతనికి ఇబ్బంది.
కొత్త కారు కొనుక్కుంటానంటే ఎంతెంత ఆశ్చర్యాలు పడ్డారో ఇంట్లో.
'అదేంటి వదినా? కారు నడుపుకుంటూ ఆఫీసుకు వెళ్తావా? ఏరా అన్నయ్యా? బావుంది రా మీ ఇంట్లో. మీ బావగారు నేను డ్రైవింగ్ నేర్చుకుంటా అంటేనే అంతెత్తున ఎగిరారు' అంది ఆడపడుచు.
వాళ్లింట్లో రాజ్యాంగమే అన్నిచోట్లా ఉండాలని ఆవిడ ఆకాంక్ష.
కాసేపు ఫేస్బుక్కూ, ట్విట్టరూ చూసింది. వాటిలో తన ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. చాలామందిలాగే తనూ బోల్డన్ని ఫోజులు కొడుతుంది ఇక్కడ.
నవ్వొచ్చింది. ఎవరూ లేని ఆ ఏకాంతంలో హాయిగా నవ్వేసింది.
ఎక్కడో పిడుగు పడినట్టు పెద్ద ఉరుములతో ఆకాశం దద్దరిల్లి పోయింది. హడలిపోయింది ఒక్క క్షణం.
ఇంటికి ఎలా వెళ్లాలి? పాపం ప్రవీణ్ కంగారు పడుతున్నాడేమో?!
కాబ్ బుక్ చేస్తే? ఫోన్లో యాప్ లేదు.

'అసలు ఆ యాప్‌ల వాళ్లు ఎంతెంత ఛార్జ్ చేస్తారో తెల్సా? అయినా అవన్నీ ఎందుకు? ఆఫీసుకైతే నేను దింపుతాను. ఎక్కడికైనా వెళ్లాలంటే ఆటోలో వెళ్తే సరి. మెట్రో వచ్చాక అసలు ఎంతెంత దూరాలైనా, కాసేపట్లో వెళ్లిపోతున్నాం. అసలు ఆ కాబ్ సర్వీస్ వాళ్లు, ముందు యాక్సెప్ట్ చేసి తర్వాత కాన్సిల్ చేసేస్తారు. మనం కాన్సిల్ చేస్తే, మనకి ఛార్జెస్ పడతాయి. వాళ్లు కాన్సిల్ చేస్తే..'
ఇందుకే యాప్ వేసుకోలేదు తను. ఇలాంటప్పుడు రాధిక తిట్లు ఉపశమనంగా ఉంటాయి తనకి.
ఇప్పుడు అత్యవసరం తనకి. వెంటనే కాబ్ సర్వీస్ యాప్ డౌన్‌లోడ్ చేసింది. మొదటిసారి కావడంతో కాబ్ బుక్ చేయడానికి కొద్దిగా టైం పట్టింది.
కాబ్ వస్తుందనే ఆశ లేదు. ప్రవీణ్ చెప్పినట్టు డ్రైవర్ కాన్సిల్ చేస్తే?
ప్రవీణ్ ఫోన్ 'కొంచెం తెరిపివ్వగానే బయలుదేరతాను.
కంగారుపడకు. అయిదు కూడా కాలేదు'
కాబ్ కాన్సిల్ అయింది.
'ఆలస్యం చేయొద్దు. మెట్రోస్టేషన్ దగ్గర దింపేస్తాను రండి' సీనియర్ అసిస్టెంట్ భాస్కర్ బయలుదేరుతూ అన్నాడు.
ట్రైన్లో ఎక్కువ మంది జనం లేరు. లేడీస్ కంపార్ట్‌మెంట్ తన ముందే రావడంతో ఎక్కి, సీట్లో కూచుని ప్రవీణ్‌కి మెసేజ్ చేసింది స్టేషన్ దగ్గరికి రమ్మని.
టింగ్ మంటూ ఈ లోపు టెక్స్ట్ మెసేజ్, బాంక్ నుంచి.. తన అకౌంట్ నుంచి మూడు లక్షలు ప్రవీణ్ అకౌంట్‌కి ట్రాన్స్ఫర్ అయ్యాయని. స్థలానికి అడ్వాన్స్ కోసం తీసుకుని ఉంటాడు.
తన అకౌంట్స్ లాగిన్స్ అన్నీ అతని దగ్గర కూడా ఉన్నాయి.
ఇవన్నీ సహజమే తన ఇంట్లో. తన ఇంట్లోనే కాదు, చాలా ఇళ్లలో కూడానేమో!
'మన గ్రూప్‌లో ఇంకా ఎవరెవరు వస్తారక్కా రామప్ప గుడికి? మొత్తం ఆరుగురమయ్యాం ఇప్పటికి. యాదమ్మ రానంది. మొన్న పొడులు అమ్మిన డబ్బులన్నీ మొగుడు తీసుకున్నాడంట. మళ్లీ చేతిలో డబ్బులు పడ్డాక చూస్తానంది'.
'ఇది రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదించటమేంటో, వాడు డబ్బులు లాక్కోటమేంటో. వాణ్ణి తన్నేవాళ్లు లేకపోయె. యాదమ్మకి పుట్టింటి అండ కూడా లేకపాయ.'
చెవులు అటు వైపు మళ్లాయి వాళ్ల మాటలు వినాలని..
'ఏమోనక్కా, నా దగ్గర అయితే అట్లా కుదరదు. నాలుగు డబ్బులు ఇంటికి తోడుగా ఉండాలని ఇంత కష్టపడుతున్నామా? ఎందుకు? మొత్తం మొగుడు చేతిలో పొయ్యాలనా? ఇంటి కోసమే అయితే మనమే అవసరం కొద్దీ ఖర్చు పెడతాం కానీ, తీసుకో సామీ అని మొత్తం వాళ్ల చేతికిచ్చి, పదీ పరకా అడుక్కోవటమేంటి?
మా ఆయన కూడా నా దగ్గర నాలుగు డబ్బులాడుతుండే సరికి ఇట్టాంటి వేషాలే ఎయ్యాలని సూశాడు. ''నీకెందుకు, నేను చూసుకుంటాగా? డబ్బులన్నీ నాకిచ్చెరు, డబుల్‌కాట్ కొందాం, బీరువా కొందాం'' అని. ''అంత కొనాలనిపిస్తే, నేను కొంటాలే, నువ్వు మూసుకోని కూచో'' అని చెప్పేశాను'.
అప్రయత్నంగా ఆ పిల్ల వైపు చూసింది ఉష. గట్టిగా పాతికేళ్లుండవు. జుట్టు అటూ ఇటూ ఫాషన్‌గా వదిలేసి, బుజ్జి సెంటర్‌క్లిప్ పెట్టింది. చేతులకు మొరాకో డిజైన్‌తో మెహందీ. డజనేసి గాజులు. అందరూ కల్సి ఏదో ఫంక్షన్ నుంచి వస్తున్నట్టున్నారు. అంతా మెరిసే చీరల్లో ఉన్నారు.
'చేతిలో నాలుగు పైసలుంటేనే ఆడదానికి ధైర్యం. అయి మనం సంపాదించుకున్న డబ్బులైతే దానందం వేరు' అంది అందర్లో పెద్దామె.
'అంతే కదక్కా, ఈ గ్రూప్‌లో చేరకముందు, పైసాకీ రూపాయికీ చెయ్యి చాచటం, ఆయన లేవని విసుక్కోవడం, ఇస్తే కూడా సణుక్కుంటూ ఇవ్వడం, ఇచ్చినదానికి లెక్కలు అడగటం.. అబ్బ, ఎంత చీదరగా ఉండేదో. ఇప్పుడయ్యేమీ లేవు. ఇప్పుడు కళ్యాణికి కాస్త ఘనంగా వెండి కుంకుమ భరిణి కొన్నానంటే, నా చేతిలో డబ్బులుండబట్టే గదా. మన డబ్బు మీద మనకి ఆమాత్రం అధికారం ఉండాలి కదా!'
వీళ్లందరూ ఏదో పొదుపు సంఘంలో సభ్యులు కాబోలు.
'పెద్ద పెద్ద ఉజ్జోగాలున్నోళ్లైతే, ఏదైనా జమాయించి మాట్టాడగలరు. నా డబ్బు నా ఇష్టం అని. పాపం యాదమ్మ లాంటోళ్లు నోరెత్తితే తంతాడు గదా అ మొగుడు. ఎంతైనా ఉజ్జోగం ఉంటే ఆ దారే వేరు' కొద్దిపాటి నిరాశ మరో గొంతులో.
'లేదు, లేదు యాదమ్మే కాదు. ఉష కూడా అంతే' మనసులో ఎవరో అరిచారు.
'యాదమ్మని తన్ని లాక్కుంటాడు మొగుడు. ఉషకి అంతదాకా వెళ్లక్కర్లేదు. మన ఇంటికే కదా అని మభ్యపెట్టుకుంటూ ఇచ్చేస్తుంది.'
'చిట్టీలేసే శ్రీలక్ష్మీ, చీరెలు అమ్మే వసంతా, అందరూ ఎవరి డబ్బులు ఆళ్లు ఆళ్ల సొంతానికి కొంత దాచుకునే, మిగతాది ఇంట్లోకి పెడుతుంటారక్కా. ఎంతైనా మన అవసరాలకి మన చేతుల్లో..' ఇంకా మాటలు కొనసాగుతూనే ఉన్నాయి.
మెట్రో మెత్తగా, నిశ్శబ్దంగా తను దిగవలసిన స్టేషన్‌లో ఆగింది.
'నువ్వు వేరే వూళ్లో ఉంటే, ఇల్లెలా ఉషా? అర్థం చేసుకోవేంటి? ట్రాన్స్‌ఫర్లు తీసుకోవద్దు అనుకున్నావుగా?'
'ఆల్రెడీ రెండుసార్లు తీసుకోలేదు. ఇక పై అలా వద్దనుకున్నాను. ఈ ట్రాన్స్‌ఫర్ తప్పనిసరి నాకు. ప్రమోషన్‌తో పాటు వచ్చింది ఈసారి కూడా. నెలకో రెణ్ణెల్లకో మీరో నేనో తిరుగుదాం.'
'చెప్పేది అర్థమవుతుందా నీకు?'
'అవుతోంది' లాప్టాప్ ఓపెన్ చేసి, ఒళ్లో పెట్టుకుని కూచుంది.
'అది కాదు ఉషా, నువ్వులేక పోతే మా ముగ్గురికీ ఎంత ఇబ్బంది? పిల్లలు హాస్టల్ నుంచి వస్తే? నువ్వు మాత్రం ఒక్కదానివే ఉండగలవా?'
'ట్రై చేస్తే కదా తెలిసేది మీకైనా, నాకైనా' వణుకుతున్న చేతులతో తన బాంక్ అకౌంట్స్ లాగిన్స్ పాస్వర్డ్స్ మార్చింది. ఓటీపీ ఎంటర్ చేసి, బ్రౌజర్ క్లోజ్ చేసి లాప్టాప్ మూసి, బాగ్‌లో సర్దింది.
తర్వాత జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో ఊహించడానికి ప్రయత్నించ లేదు. చాలా భయంగా ఉంది. కానీ తప్పదు. ఎదురైనపుడు ఎదుర్కోవడమే.
అక్కడికి వెళ్లగానే ఎలక్ట్రిక్ బైక్ కొనుక్కోవాలని అతనికి చెప్తే?
ఇప్పుడే వద్దు. వన్ స్టెప్ ఎట్ ఏ టైమ్.
ఒక్కతే ఉండటం తనకీ కొత్తే. కొంత దిగులుగానే ఉంది.
కానీ తన లోలోపల మొదలవ్వాలని తపన పడుతోన్న యుద్ధంలో తను గెలవాలంటే, తన మీద తనే గెలవాలంటే ఎక్కడో ఒకచోట పోరాటం మొదలు పెట్టాలి. ఈ పోరాటం ముందు తనతోనే.
ఎదురు చెప్పలేని తన సంకోచాల మీద, భయాల మీద, లొంగుబాటు మీద తను ముందు యుద్ధం ప్రకటించాలి. తన హక్కుని తాను అడగలేని బలహీనత మీద యుద్ధం ప్రకటించాలి.
తన హక్కులు లాగేసుకునే హక్కుని అతనికి ఇచ్చిన తన చేతగానితనం మీద యుద్ధం చేయాలి.
తనని తాను కోల్పోకుండా ఉండాలంటే ఈ యుద్ధం తనకి తప్పనిసరి.
విజయం వరిస్తుందో లేదో తరవాత సంగతి. విజయం కాకపోతే వీర స్వర్గం.
యుద్ధం మాత్రం చేసి తీరాలి.
ఏళ్ల తరబడి పేరుకుపోయిన ఈ నైరాశ్యం మీద తను యుద్ధం చేసి తీరాలి.
ఆఖరుగా కాఫీ ఫిల్టర్ బాగ్‌లో సర్ది, అటు తిరిగి కళ్లలోంచి వూరుతున్న నీటిని గోటితో విదిలించి, లోపలికి నడిచింది ఉష.
సుజాత వేల్పూరి