Aug 27,2023 08:36

ఈ నేలపై యుద్ధం కొత్తదేమీ కాదు
కాల ప్రవాహంలో సాగుతూనే ఉంది
చరిత్రలో కథలెన్నో పుట్టినాయి
కళ్ళ ముందు కదలాడే చిత్రాల్లా...

లెక్కలేనన్ని యుద్ధాలు నేర్పాయి
చరిత్ర గతిని, స్థితిని మారుస్తూ
వెన్ను చూపని కాలం నేర్పిస్తూనే ఉంది
తారీకులు మారుస్తూ గుర్తుచేస్తుంది....

జయాపజయాల మిశ్రమాలు మిగిల్చి
ఎందరో ఆశల తోరణాలకు నిలయమై
మత్తులో మౌనంగా ముందుకు సాగుతూ
పండుగల వేడుకలు సృష్టిస్తూ పోయాయి...

ఆదిలో జాతుల మధ్య ఆధిపత్యం
మధ్యలో రాజుల మధ్య
రణరంగపు విన్యాసాలు
ఆధునిక యుగములో అణు విస్ఫోటాలు
ఆకలి నేర్పిన రణములో ఆశల బతుకులు..

నేలపై వ్యామోహముతో సరిహద్దులు గీస్తూ
ధరాధిపతులు రాజ్యంపై మోజు పడి
రుధిరపు బలిదానాలను సమర్పించి
పదునైన కత్తులకు
రక్త తర్పణలను కావించారు..

అస్థిత్వమే నిత్యం యుద్ధం చేస్తుంటే
అక్షరము ఆకలితో మౌనంగా కదులుతుంటే
శాంతి కపోతముగా కావ్యాలు వెలువడితే
మూఢత్వాలు..
ఈ నవీన యుగములో సాగవు..

కొప్పుల ప్రసాద్‌
9885066235