Aug 24,2022 06:48

అమెరికాలో కార్మికులు.. ప్రత్యేకించి యువకులు...ఇటీవలి సంవత్సరాలలో కార్మిక సంఘాల ఏర్పాటుకు చొరవ చూపుతున్నారు. ప్రపంచాన్నే శాసిస్తున్న అమెరికన్‌ కార్పొరేట్ల వేధింపులు, సాధింపులు, సంఘాల విచ్ఛిన్నాలను ఎదుర్కొని ముందుకు సాగుతున్నారు. తాము సంఘటితంగా
ఉంటే తప్ప యజమానుల పీడన, దోపిడీ నుంచి తప్పించుకోలేమన్న ఆలోచనే అమెరికాతో సహా ప్రతి దేశ కార్మికుల్లో తలెత్తిన ఆలోచనే కార్మిక సంఘాల ఏర్పాటుకు నాంది. అమెరికా లోని కాలేజీ విద్యావంతులైన కార్మికులు గత కొద్ది సంవత్సరాలుగా జరుగుతున్న పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్నారు.


మెరికా లోని టెక్సాస్‌ రాష్ట్రం రౌండ్‌ రాక్‌ పట్టణంలో ఇటీవల చురుకైన యువ కార్మిక నేతల మూడవ వార్షిక సమావేశం (వైఏఎల్‌ఎల్‌-యాల్‌) జరిగింది. ఇటీవలి కాలంలో ముఖ్యంగా గత రెండు సంవత్సరాల్లో జరిగిన అనేక పరిణామాలు అమెరికా కార్మికోద్యమంలో కొత్త దశ, దిశను సూచిస్తున్నాయి. అమెరికన్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ లేబర్‌-కాంగ్రెస్‌ ఆఫ్‌ ఇండిస్టియల్‌ ఆర్గనైజేషన్స్‌ (ఎఎఫ్‌ఎల్‌-సిఐఓ) టెక్సాస్‌ విభాగంలోని పురోగామి భావజాల కార్యకర్తల చొరవతో మిలిటెంట్‌ కార్యకర్తలను ఆకర్షించేందుకు మూడు రోజుల పాటు ఈ సమావేశం జరిగింది. ప్రధాన వక్తగా అమెజాన్‌ కార్మిక సంఘం నేత క్రిస్‌ స్మాల్స్‌ పాల్గ్గొన్నాడు. ఈ సభలో టెక్సాస్‌ కార్మిక ఉద్యమ పురోగతి, భవిష్యత్‌ కార్యాచరణ కోసం పనిచేస్తున్న యువ నేతలు, కార్మికులు, పురోగామి భావజాలం కలిగిన ఇతర అనుబంధ సంస్థల వారు పాల్గ్గొన్నారు. పలువురు వివిధ అంశాల మీద చర్చల్లో భాగస్వాములయ్యారు. కార్మిక సంఘాల నిర్వహణలో సాంప్రదాయ ఆటంకాలను అధిగమించి టెక్సాస్‌ ఉద్యమాలను పురోగామి పధంలో ముందుకు నడిపేందుకు పనిచేస్తున్నామని ''యాల్‌'' నేత చెప్పాడు. సంఘాలలో లేని అనేక మంది కార్మికులు ఇప్పుడు ముందుకు వస్తున్నారని అన్నాడు. గత ఏడు నెలలుగా ప్రపంచంలోనే అతి పెద్దవి, లాభదాయక సంస్థలుగా ఉన్న అమెజాన్‌, స్టార్‌బక్స్‌, ఆపిల్‌ వంటి కంపెనీల్లో జరుగుతున్న సంఘటిత నిర్మాణాలు, సాధించిన విజయాల గురించి వివరించారు. సంఘాలను ఎలా నిర్మించాలి, కార్మికుల్లో విశ్వాసాన్ని ఎలా కల్పించాలి, శ్వేత జాతి దురహంకారాన్ని ఎలా పోగొట్టాలి, పర్యావరణ పరిరక్షణ తదితర అనేక అంశాల మీద బృందాలుగా చర్చించారు.
    ప్రస్తుతం యువకుల చురుకుదనం, ఉద్యమాల్లో వారి భాగస్వామ్య పెరుగుదల తీరుతెన్నులను చూస్తే పెద్ద మార్పులు సాధ్యమే అన్న ఆశాభావం కలుగుతున్నదని సీనియర్‌ నేత క్రిస్‌ టౌన్‌సెండ్‌ చెప్పాడు. వామపక్షంతో కలిస్తే మరింత శక్తివంతమైన సంఘాలను నడపటంతో పాటు మంచి ఒప్పందాలను సాధించవచ్చని, మెరుగైన రాజకీయ కార్యక్రమాన్ని కలిగి ఉండవచ్చునన్నాడు. టెక్సాస్‌ ఎఎఫ్‌ఎల్‌ నేత రికీ లెవీ మాట్లాడుతూ ఉద్యమం మారింది, నాయకులు పెద్దవారైనారు, యువతరానికి నాయకత్వ బాధ్యతలు అప్పగించేందుకు మార్గాన్ని సుగమం చేయాలన్నాడు. అమెజాన్‌ కార్మిక నేత క్రిస్‌ స్మాల్స్‌ న్యూయార్క్‌ లోని స్టాటెన్‌ ఐలాండ్‌ అమెజాన్‌ గోదాములో తొలిసారిగా కార్మిక సంఘ ఎన్నికల్లో విజయం సాధించి కార్పొరేట్‌ శక్తులకు దేశమంతటా వణుకు పుట్టించాడు. సంఘాల్లో చేరతామంటూ అనేక మంది ముందుకు వచ్చేందుకు స్ఫూర్తినిచ్చాడు. ''యాల్‌'' సభలో మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో మితవాద శక్తులు అధికారానికి వచ్చే అవకాశం ఉందని హెచ్చరించాడు. ఇప్పటికే కార్పొరేట్‌ శక్తులతో పోరాడుతున్నామని, మితవాదులు అధికారానికి వస్తే ప్రస్తుతం జరుగుతున్న కార్మిక సంఘాల నిర్మాణానికి మరింత సవాలు ఎదురవుతుందని హెచ్చరించాడు. ఇప్పటికే కార్మిక సంఘాల గుర్తింపు వివాదాలు కార్మిక శాఖ ముందున్నాయని ఉద్యమాలను మరింత పటిష్టంగా ముందుకు తీసుకుపోవాలన్నాడు. కార్మికవర్గం ఉద్యమించాలి తప్ప ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ మీదో అతను ప్రవేశ పెట్టే బిల్లుల మీదో ఆధారపడకూడదన్నాడు. కార్పొరేట్లకు డబ్బు కావాలి తప్ప మన గురించి పట్టదు, వారిని సంప్రదింపులకు రప్పించాలంటే దేశంలోని కార్మికులందరూ ఒక్క రోజు సమ్మె చేస్తే చాలన్నాడు. స్మాల్స్‌ సభికులను ఎంతగానో ఉత్తేజపరిచాడు. కరోనా మహమ్మారి నుంచి రక్షించేందుకు అవసరమైన నివారణ ఏర్పాట్లు తగినన్ని చేయాలంటూ జెఎఫ్‌కె8 గోదాములో కార్మికులను సమీకరించి ఆందోళన చేసినందుకు 2020లో స్మాల్స్‌ను అమెజాన్‌ కంపెనీ తొలగించింది. తరువాత అతని చొరవతో ఏర్పడిన కార్మిక సంఘాన్ని అదే గోదాములో కార్మికులు గుర్తించారు.
     సుప్రీంకోర్టు మొదలు టీవీ ఛానళ్ల వరకు దేశంలోని 16 వ్యవస్థల విశ్వసనీయత గురించి గాలప్‌ సర్వే జరపగా కార్మిక సంఘాల మీద తప్ప మిగతావాటి మీద తమకు విశ్వాసం లేదని అమెరికన్లు చెప్పారు. కరోనా కాలంలో కార్మిక సంఘాలు, తోటి కార్మికులు తప్ప మిగతా వ్యవస్థలేవీ తమను ఆదుకోలేదని కార్మికులు స్వానుభవంలో గ్రహించారు. అది వారిని ఆందోళన బాట పట్టించటమే కాదు, కొన్ని విజయాలను కూడా సాధించారు. ఇదే కొత్తగా సంఘాల్లో చేరేందుకు ఇతరులను ప్రోత్సహిస్తున్నది.
     స్టేటెన్‌ ఐలాండ్‌ లోని జెఎఫ్‌కె8 అనే అమెజాన్‌ గోదాములో ఎన్నికలో నేతలు కార్మికులను బలవంత పెట్టి అనుకూలంగా ఓట్లు వేయించారని యాజమాన్యం చేసిన ఫిర్యాదును జాతీయ కార్మిక సంబంధాల బోర్డు విచారణకు స్వీకరించింది. తమ సిబ్బంది వైఖరి ఏమిటో వినాలని తాము కోరుతున్నామని, ఎన్నికల్లో అలాంటి అవకాశం రాలేదని గోదాములోని సిబ్బందిలో మూడో వంతు మాత్రమే కార్మిక సంఘానికి ఓటు వేశారని అమెజాన్‌ వాదిస్తోంది. ఎక్కువ మంది పాల్గ్గొనకుండా లేబర్‌ బోర్డు అడ్డుకుందని, కార్మిక నేతలు గంజాయి పంచినట్లు ఆరోపించింది. కార్మిక సంఘం వీటిని తీవ్రంగా ఖండించింది. ఇక్కడ ఓటింగ్‌ తక్కువగా ఉందికనుక తాము అంగీకరించేది లేదని చెబుతున్న కంపెనీ అలబామాలో తక్కువ మంది పాల్గొని కార్మిక సంఘం వద్దని వేసిన ఓట్లను ఎలా పరిగణన లోకి తీసుకున్నదని ప్రశ్నించింది. నిజానికి రెండు చోట్లా కంపెనీ కార్మికులను బెదిరించినట్లు తెలిపింది.
      అమెరికాలో మరో పెద్ద కంపెనీ స్టార్‌బక్స్‌. ప్రపంచంలోని 80 దేశాల్లో 40 వేల వరకు కాఫీ దుకాణాలుండగా అమెరికాలో పదిహేను వేలకు పైగా షాపులున్నాయి. తమ సంస్థలో కార్మిక సంఘం పెట్టటానికి వీల్లేదని వాదిస్తున్నది. 2021 ఆగస్టులో బఫెలో, న్యూయార్క్‌ లోని మూడు స్టార్‌బక్స్‌ దుకాణాల్లో కార్మిక సంఘాన్ని గుర్తించాలంటూ దరఖాస్తు చేశారు. డిసెంబరు తొమ్మిదవ తేదీన బఫెలో దుకాణంలో జరిగిన ఎన్నికల్లో సంఘం తొలిసారిగా గుర్తింపు పొందింది. గతేడాది డిసెంబరు చివరి నాటికి 36 రాష్ట్రాల్లోని 310 దుకాణాల నుంచి ఎన్నికల కోసం దరఖాస్తు చేశారు. ఇప్పటి వరకు 220 చోట్ల సంఘాలకు అనుకూలంగా ఓట్లు వేశారు. గుర్తింపు లభించింది. కార్మిక సంఘాలను దెబ్బ తీసేందుకు సంఘాలున్న దుకాణాల కంటే లేని చోట్ల వేతనాలను పెంచి సంఘాన్ని వదులుకుంటే వేతనాలు పెంచుతామని ఆశ చూపుతున్నది. కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్నదని లేబర్‌ బోర్డు కంపెనీకి నోటీసులు జారీ చేసింది. వాటిలో సంఘాలను అడ్డుకోవటం కూడా ఒకటి. ఈ అంశంలో కోర్టు జోక్యం చేసుకోవాలని కూడా బోర్డు కోరటం విశేషం. దీనికి ప్రతిగా స్టార్‌బక్స్‌ కంపెనీ 2022 ఆగస్టు 22న లేబర్‌ బోర్టుకు రాసిన లేఖలో కార్మిక సంఘాలను లేబర్‌ బోర్డే అక్రమంగా ప్రోత్సహిస్తున్నదని, అడిగిన వెంటనే ఎన్నికలు పెడుతున్నదని పేర్కొన్నది. బోర్డు సిబ్బంది కార్మిక నేతలకు సమాచారం చేరవేస్తున్నారని, తటస్థంగా ఉండటం లేదని, దొంగ ఓట్లు వేయిస్తున్నారని ఆరోపించింది.
    అమెరికాలో కార్మికులు ప్రత్యేకించి యువకులు ఇటీవలి సంవత్సరాలలో కార్మిక సంఘాల ఏర్పాటుకు చొరవ చూపుతున్నారు. ప్రపంచాన్నే శాసిస్తున్న అమెరికన్‌ కార్పొరేట్ల వేధింపులు, సాధింపులు, సంఘాల విచ్ఛిన్నాలను ఎదుర్కొని ముందుకు సాగుతున్నారు. తాము సంఘటితంగా ఉంటే తప్ప యజమానుల పీడన, దోపిడీ నుంచి తప్పించుకోలేమన్న ఆలోచనే అమెరికాతో సహా ప్రతి దేశ కార్మికుల్లో తలెత్తిన ఆలోచనే కార్మిక సంఘాల ఏర్పాటుకు నాంది. అమెరికా లోని కాలేజీ విద్యావంతులైన కార్మికులు గత కొద్ది సంవత్సరాలుగా జరుగుతున్న పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్నారు. గత తరాలు దిగువ నుంచి మధ్యతరగతిగా మారినట్లు తాము మారటం, ఆరంకెల ఆదాయానికి చేరటం ఎంతో కష్టమని వారు భావిస్తున్నారు. కార్మికోద్యమం పెరిగేందుకు ఈ పరిస్థితి దోహదం చేస్తోంది. 1990 దశకంలో కాలేజీ డిగ్రీలు ఉన్నవారు కార్మిక సంఘాలకు 55 శాతం మంది మద్దతు ఇస్తే ఇప్పుడు వారి సంఖ్య 70 శాతానికి పెరిగింది. చరిత్ర పునరావృతం అవుతుంది. దాని రూపు, లక్షణాలు గతం మాదిరే ఉండనవసరం లేదు. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలన్నట్లు కార్మికులకు సంఘాలు, సంఘటిత శక్తి తప్ప మరో దగ్గర దారి లేదు.

ఎం. కోటేశ్వరరావు

ఎం. కోటేశ్వరరావు