Sep 10,2023 13:50

ఒక అడవిలో పక్షులు, జంతువులు కలిసి మెలిసి ఉండేవి. చిన్న జంతువులు, పెద్ద జంతువులనే తారతమ్యం లేకుండా పరస్పర అవగాహనతో స్నేహంగా ఉండేవి. ఆ అడవికి రాజు సింహం.. మంచి పరిపాలనాధీశుడు.
అడవిలోకి శత్రువులు ఎవరయినా వస్తే సమాచారం చేర వేయడానికి సుమతి అనే కాకిని వేగుగా నియమించాడు రాజు. 'మనుషులందరూ అప్పుడప్పుడు విహారయాత్రలకు వెళ్తున్నారు. మనం కూడా ఎక్కడికైనా విహార యాత్రలకు వెళ్దామా మహారాజా?' అని ఒకసారి రాజుగారిని అడిగింది సుమతి.
'ఇదేదో బాగానే ఉంది మృగరాజా! మనం కూడా సరదాగా ఎక్కడికైనా విహారయాత్రకు వెళ్తే బాగుంటుంది' సంబరంగా అన్నది ఏనుగు.
'ఎక్కడకు వెళ్దాం? మనుషులయితే వనాలకు, తోటలకు వెళ్తారు. మరి మనం ఎక్కడకు వెళ్తే బాగుంటుందో ఆలోచించండి' అన్నది రామచిలుక.
'మృగరాజా! నేను మన అడవికి ఆనుకొని ఉన్న సెలయేరుకి ఆవలి వైపుకు వెళ్ళి చూసాను. అక్కడ మంచి ఫలాలతో నిండి ఉన్న వృక్షాలు, పూల మొక్కలు చాలా ఉన్నాయి. అక్కడ ఉన్న కాసేపూ నాకు ఆనందంగా అనిపించింది. అక్కడకు వెళ్దామా?' అన్నది హంస.
'అటువైపుకి వెళ్ళాలంటే సెలయేరు దాటాలి కదా? అది ఎలా సాధ్యమవుతుంది? ఆకాశంలో రెక్కలతో ఎగిరే జీవులు అన్నీ అవలీలగా వెళ్ళవచ్చు. మిగిలిన జంతువులు వెళ్ళే దారి లేదు కదా?' అన్నది నక్క.
'అవును.. అంత సుందరమైన ప్రదేశం మనం చూడాల్సిందే! కష్టపడకుండా ఏదీ సాధ్యం కాదు. మనం ఒక వారధి నిర్మిద్దాం. మనకు, మన తర్వాత తరానికి కూడా అది ఉపయోగపడుతుంది' అన్నది మృగరాజు.
'అవును.. మనందరం కలిసి ఒకటిగా పనిచేస్తే, వంతెన నిర్మాణం సులువవుతుంది. మా వానర జాతి గతంలో ఇలాంటి వారధి కట్టడానికి సహాయపడ్డారని మా తాత ముత్తాతలు చెప్పారు' అన్నది కోతి.
'ఆలస్యం ఎందుకు? పని మొదలుపెడదాం. అందరూ ఎవరు మోయతగిన బరువు కర్రలు వారు తీసుకురండి!' అన్నది మృగరాజు.
'ఈ వంతెన నిర్మాణాలు మన వల్లవుతాయా మహారాజా?' అన్నది నక్క.
'కష్టపడితే సాధించలేనిది ఏదీ ఉండదు' అన్నాడు మృగరాజు.
రాజు ప్రోత్సాహకరమైన మాటలకు ఎలుక, కుందేలు, ఏనుగు, నక్క ఇలా అన్ని ప్రాణులూ ఎండిపోయిన కర్రలు తీసుకువచ్చి, వంతెన నిర్మాణం మొదలుపెట్టారు. వంతెన పూర్తయ్యాక 'నేను ముందు వెళ్ళి వంతెన బలం ఎలా ఉందో చూసి చెప్తాను' అంది కుందేలు.
'సరే, అలాగే' అన్నారు మిగిలినవారు.
కుందేలు కొంచెం దూరం వెళ్ళగానే వంతెన కదులుతున్నట్లు అనిపించి, వెనక్కు తిరిగి పరుగులు తీస్తూ వచ్చింది. వెంటనే వంతెన కూలిపోయింది.
'నేను చెప్పానా, ఇలాంటివి సాధ్యం కాదని?' అన్నది నక్క.
'మళ్ళీ ప్రయత్నం చేద్దాం రండి' అని ధైర్యం చెప్పింది సింహం.
మళ్ళీ ఈసారి కొంచెం పటిష్టంగా వంతెన నిర్మించారు.
'ఈమారు నేను వెళ్లి వంతెన బలం చూస్తాను' అన్నది కోతి. కోతి మధ్య వరకు వెళ్ళగానే వంతెన కదులుతున్నట్లు అనిపించి, వెనక్కు తిరిగి పరుగెత్తుకుంటూ వచ్చింది. వంతెన మళ్ళీ కూలిపోయింది.
'నేను చెప్పింది వినండి మహారాజా! ఈ వంతెన నిర్మాణం మన వల్ల కాదు. ఆపేయండి' మళ్ళీ అన్నది నక్క.
'ఏ పనైనా మొదలు పెట్టేటప్పుడు ఉన్న ఉత్సాహం పూర్తయ్యే వరకూ ఉండాలి. మధ్యలో ఆటంకాలు ఎదురైనా సరే ఆపకూడదు. మన ప్రయత్నంలో లోపం ఉంటే సరిదిద్దుకోవాలి, పని ఆపకూడదు' ఆజ్ఞ జారీ చేసింది రారాజు.
అందరూ తిరిగి వంతెన నిర్మాణం మొదలుపెట్టారు. ఈసారి మరింత బలమైన కర్రలతో దృఢంగా నిర్మించారు.
వంతెన మీద నడవడానికి ఏనుగు ముందుకు వచ్చింది. 'నేను మీ అందరి కంటే పెద్ద జంతువుని, నేను సురక్షితంగా ఆవలి వైపుకి చేరుకుంటే మీరంతా క్షేమంగా రావచ్చు. ఒకవేళ నాకు ఏదయినా జరిగితే మన రాజుగారు నన్ను కాపాడగలరనే నమ్మకం నాకుంది' అన్నది ఏనుగు. మృగరాజు ఏనుగు తన మీద ఉంచిన నమ్మకంతో తన బాధ్యత రెట్టింపు అయ్యిందని గ్రహించి, అనుమతిచ్చింది.
ఏనుగు సురక్షితంగా ఆవలి ఒడ్డుకు చేరింది. ఆనందంగా మిగిలిన జంతువులన్నీ హుషారుగా వంతెన మీద నుంచి నడుస్తూ వెళ్ళాయి. అక్కడ ఉన్న ఉద్యానవనంలో అందరూ చక్కగా ఆడుకున్నారు. కోయిలమ్మలు పాటలు పాడితే మయూరాలు నాట్యం చేశాయి. రామచిలుకలు మురిపాల పలుకులు పలికాయి. అన్ని ప్రాణులు విహారయాత్రలో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ గడిపారు.
'నేను మనకు సాధ్యం కాదని ఎన్నిసార్లు వారించినా మీరు సాధించి చూపించారు మృగరాజా! ఇంకెప్పుడూ నిరాశ కలిగించే మాటలు మాట్లాడకూడదని నాకు అర్థమయింది' సిగ్గుపడుతూ అన్నది నక్క.
'పరిపాలన చేసేవాడు సమర్థుడయితే వారి నాయకత్వంలో అందరూ విజయులే!' అన్నది విహారయాత్రకు శ్రీకారం చుట్టిన సుమతి.
 

- కె.వి సుమలత
94926 56255