
- సామ్రాజ్యవాద కుట్రలు - ప్రతిఘటన !
కేస్టిలో అధ్యక్ష పదవి చేపట్టిన ఏడాదిన్నరకే పార్లమెంటరీ కుట్ర ద్వారా కూల్చివేయగా, లూలాను అధికారం చేపట్టిన ఎనిమిది రోజులకే కూల్చేందుకు అమెరికా అదే తరహా కుట్ర పన్నింది. పెరూలో పెడ్రో కేస్టిలోను గద్దె దింపేందుకు అమెరికా పన్నని కుట్ర లేదు. కేస్టిలో తోపాటు ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన దినా బొలార్టే మితవాదుల మద్దతుతో అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. ఆందోళన మరింత విస్తరించకుండా చూసేందుకు 2026కు బదులు 2024 ఏప్రిల్‌లో (రెండు సంవత్సరాలు ముందుగా) ఎన్నికలు నిర్వహించేందుకు పార్లమెంటును కోరతానని బొలార్టే చేసిన ప్రకటనతో నిరసనలు ఆగలేదు.
లాటిన్ అమెరికా లోని రెండు దేశాలు బ్రెజిల్, పెరూ. రెండు చోట్లా ప్రజలు ఎన్నుకున్న వామపక్ష ప్రభుత్వాలను కూల్చివేసేందుకు కుట్ర జరిగింది. పెరూలో మితవాద శక్తులు తమ పథకాన్ని అమలు జరిపారు, బ్రెజిల్‌లో విఫలయత్నం చేశారు. పెరూ వామపక్ష ప్రభుత్వాన్ని కూల్చివేసి పెడ్రో కేస్టిలోను జైలు పాలు చేసినందుకు నిరసనగా డిసెంబరు ఎనిమిది నుంచి జనం వీధుల్లోకి వస్తున్నారు. అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా ఉన్న మచ్చుపిచ్చు విమానాశ్రయాన్ని నిరవధికంగా మూసివేశారు. ఇతర విమానాశ్రయాలదీ దాదాపు అదే స్థితి. రైలు, విమాన సర్వీసులను రద్దు చేశారు. దేశమంతటా 80 రోడ్డు మార్గాలను నిరసనకారులు మూసివేసినట్లు వార్తలు. ఇప్పటి వరకు జరిపిన దమనకాండల్లో 50 మందికి పైగా మరణించారు. ఈ ఉదంతాలలో అవసరమైనదాని కంటె ఎక్కువగా హింస జరిగిందని, దీన్ని మారణకాండగా పరిగణిస్తూ బాధ్యులైన వారిని గుర్తించేందుకు 11 విచారణలు జరపాలని పెరూ అటార్నీ జనరల్ నిర్ణయించారు. దీనిలో తాత్కాలిక అధ్యక్షురాలు దినా బొలార్టే, పలువురు మంత్రులు, అధికారుల పాత్రను విచారిస్తారు. జనవరి 9,10 తేదీలలో పునో ప్రాంతంలో జరిపిన దమనకాండలో 18 మంది మరణించారు.
కేస్టిలో అధ్యక్ష పదవి చేపట్టిన ఏడాదిన్నరకే పార్లమెంటరీ కుట్ర ద్వారా కూల్చివేయగా, లూలాను అధికారం చేపట్టిన ఎనిమిది రోజులకే కూల్చేందుకు అమెరికా అదే తరహా కుట్ర పన్నింది. పెరూలో పెడ్రో కేస్టిలోను గద్దె దింపేందుకు అమెరికా పన్నని కుట్ర లేదు. కేస్టిలో తోపాటు ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన దినా బొలార్టే మితవాదుల మద్దతుతో అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. ఆందోళన మరింత విస్తరించకుండా చూసేందుకు 2026కు బదులు 2024 ఏప్రిల్‌లో (రెండు సంవత్సరాలు ముందుగా) ఎన్నికలు నిర్వహించేందుకు పార్లమెంటును కోరతానని బొలార్టే చేసిన ప్రకటనతో నిరసనలు ఆగలేదు.
కేస్టిలో ప్రజలెన్నుకున్న పార్లమెంటును రద్దు చేసేందుకు పూనుకున్న కారణంగానే దాన్ని కాపాడేందుకు అభిశంసన తీర్మానాన్ని పెట్టి ప్రజాస్వామికంగానే పదవి నుంచి తొలగించామని చెబుతున్నదాన్ని జనం నమ్మటం లేదు. పార్లమెంటుకు అలాంటి అధికారం ఇచ్చిన అక్కడి రాజ్యాంగం అదే పార్లమెంటు అప్రజాస్వామికంగా ఉంటే దాన్ని రద్దు చేసే అధికారాన్ని అధ్యక్షుడికి కూడా కట్టబెట్టింది. తన పాలనకు అడుగడుగునా అడ్డుపడుతున్న మితవాదుల ప్రాబల్యం కలిగిన పార్లమెంటును రద్దు చేసేందుకు కేస్టిలో ఆ నిబంధనను ఉపయోగించకుండానే పదవి నుంచి తొలగించారు. పార్లమెంటులోని 130 స్థానాలకు గాను వామపక్ష 'ఫ్రీ పెరూ' పార్టీకి వచ్చిన ఓట్లు 13.41 శాతం కాగా 37 సీట్లు వచ్చాయి.
తాను గెలిస్తే నూతన రాజ్యాంగాన్ని ఆమోదించేందుకు గాను రాజ్యాంగసభ ఏర్పాటు గురించి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తానని ఎన్నికల్లో కేస్టిలో వాగ్దానం చేశాడు. దాన్ని అడ్డుకొనేందుకు గతేడాది డిసెంబరులో పార్లమెంటులోని మితవాద శక్తులు ఒక తీర్మానాన్ని ఆమోదించాయి. సంస్కరణల కోసం ప్రజాభిప్రాయ సేకరణ జరపాలంటే ముందుగా పార్లమెంటు అనుమతి పొందాలని దానిలో పేర్కొనటం ద్వారా అధ్యక్షపదవి అధికారాలను పరిమితం చేశారు. పార్లమెంటు స్పీకర్ మరియా డెల్ కార్‌మెన్ అల్వా స్పెయిన్ పర్యటనలో అక్కడి పార్లమెంటులో ప్రసంగిస్తూ ''పెరూ కమ్యూనిజం ఆక్రమణకు గురైంది. పెడ్రో కేస్టిలోకు అధ్యక్షుడిగా ఎలాంటి చట్టబద్దత లేదు'' అని ఒక ప్రకటన చేయాలని స్పెయిన్ పాపులర్ పార్టీని కోరటం మితవాదుల కుట్రకు అద్దం పట్టింది.
పెరూ రాజ్యాంగం లోని ఆర్టికల్ 134 ప్రకారం అధ్యక్షుడు లేదా క్యాబినెట్ గానీ రెండు సార్లు విశ్వాస తీర్మానాలను కోరినపుడు తిరస్కరిస్తే పార్లమెంటును రద్దు చేసే అధికారం అధ్యక్షుడికి ఉంటుంది. దాంతో కేస్టిలో ఎక్కడ పార్లమెంటు మీద వేటు వేస్తారోనని ముందుగానే మితవాదులు రంగంలోకి దిగారు. అభిశంసన తీర్మానాన్ని ఆమోదించి కేస్టిలోను గద్దె దించి అరెస్టు చేశారు. కుట్ర పేరుతో విచారణ బూటకానికి తెరలేపారు. ఈ పూర్వరంగంలో కేస్టిలోకు మద్దతుగా, నూతన ప్రభుత్వం గద్దె దిగాలని, తిరిగి ఎన్నికలు జరపాలని కోరుతూ జనం వీధుల్లోకి వచ్చారు. నియంత ఫుజిమొరి ఏర్పాటు చేసిన రాజ్యాంగ పునాదుల మీద అమలు జరుపుతున్న నయా ఉదారవాద ఆర్థిక విధానాలను మార్చేందుకు వీలుగా నూతన రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసేందుకు పూనుకోవటం అక్కడి పాలక వర్గాలకు, అమెరికన్ సామ్రాజ్యవాదులకు రుచించలేదు.
2023 జనవరి ఎనిమిదిన లాటిన్ అమెరికాలో పెద్ద దేశమైన బ్రెజిల్ అధ్యక్ష భవనం, పార్లమెంటు, సుప్రీం కోర్టులపై జైర్ బోల్సనారో అనుచర మూకలు దాడికి తెగబడ్డాయి. అమెరికాలో ట్రంప్ మద్దతుదారులు కూడా జో బైడెన్ ఎన్నికను నిర్ధారించరాదంటూ 2021 జనవరి ఆరున పార్లమెంటు మీద దాడి చేశారు. బ్రెజిల్‌లో లూలా సర్కార్‌ను కూలదోసేందేకు అదే తరహాలో దాడి జరిగింది. బోల్సనారో ఫ్లోరిడా నుంచి ఇందుకు సంబంధించిన కుట్రకు పథక రచన చేశాడు. బ్రెజిల్ అధ్యక్షుడిగా లూలా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు రోజే బోల్సనారో అమెరికాకు పారిపోయాడు.
కుట్రలో బోల్సనారో పాత్ర గురించి విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఎన్నికల్లో అక్రమాలు జరిగినట్లు పునరుద్ఘాటిస్తూ బోల్సనారో జనవరి పదవ తేదీన తన ఫేస్‌బుక్‌లో ఒక వీడియోను పోస్టు చేసి దాడి చేసిన మద్దతుదార్లను సమర్ధించేందుకు పూనుకున్నాడు. అయితే దాన్ని వెంటనే తొలగించాడు. లూలాను సుప్రీంకోర్టు, ఎన్నికల కమిషన్ ఎన్నుకున్నది తప్ప జనం కాదని, ఎలక్ట్రానిక్ ఓటింగ్ అక్రమం అని కూడా దానిలో పేర్కొన్నాడు. దాడిని ప్రోత్సహించిన నేరానికి గాను బోల్సనారో మీద కేసు దాఖలు కోరుతూ 79 మంది ప్రాసిక్యూటర్లు, సహాయ ప్రాసిక్యూటర్లు అటార్నీ జనరల్‌కు లేఖ రాశారు. బోల్సనారో తప్పుడు వార్తలను ప్రచారంలో పెట్టారని, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టేందుకు సామాజిక మాధ్యమ (డిజిటల్) తీవ్రవాదులు వాటిని వ్యాపింపచేసినట్లు పేర్కొన్నారు. జనవరి పదవ తేదీన బోల్సనారో పదకొండు సందేశాలు పోస్టు చేశాడని, చట్టాన్ని ఉల్లంఘించాలని బహిరంగంగా రెచ్చగొట్టాడని కూడా పేర్కొన్నారు. బోల్సనారో వీసాను రద్దు చేసి వెనక్కు పంపాలని అనేక మంది అధికారపక్ష ఎంపీలు జో బైడెన్‌ను డిమాండ్ చేస్తున్నా ఎలాంటి స్పందన లేదు.
తనకు మద్దతు ఇచ్చేదిగా మిలిటరీని మార్చుకోవాలని చూసిన బోల్సనారోకు ఎదురుదెబ్బ తగిలింది. మిలిటరీ, పోలీసు బలగాల్లో మితవాదులు, వామపక్ష వ్యతిరేకులు ఉన్నప్పటికీ ఏకాభిప్రాయం లేదని తాజా పరిణామాలు వెల్లడించాయి. అమెరికా మద్దతుతో 1964 నుంచి 1985 వరకు 21 ఏళ్ల పాటు అక్కడ మిలిటరీ పాలన సాగింది. దాని బాధితులు, వ్యతిరేకంగా పోరాడిన వారు ఇంకా ఎందరో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మరోసారి సైనిక ఉక్కుపాదాల కింద నలిగేందుకు సిద్ధంగా లేరు.
జనవరి ఎనిమిదిన జరిగిన దాడి తీరుతెన్నులను చూస్తే దుండగులకు కొందరు సహకరించినట్లు అధ్యక్షుడు లూలా చెప్పాడు. అధ్యక్ష భవన తలుపులకు ఎలాంటి నష్టం జరగలేదంటే అక్కడ ఉన్నవారు వాటిని తీసి దుండగుల ప్రవేశానికి సహకరించారని అన్నాడు. మిలిటరీ, పోలీసు యంత్రాంగంలో ఉన్న మితవాద శక్తుల మద్దతు కారణంగానే తాజా దాడి జరిగిందని చెప్పవచ్చు. అధ్యక్ష భవనం, పార్లమెంటు, సుప్రీం కోర్టు మీద దాడికి వచ్చిన వారు ఎనిమిది కిలోమీటర్ల దూరం ప్రయాణించి వచ్చే వరకు నిఘా, భద్రతా దళాలు ఏమి చేశాయన్నది ప్రశ్న. విధుల్లో ఉన్నవారి నుంచి ఆ భవనాల్లో ప్రవేశించిన దుండగులకు ఎలాంటి ప్రతిఘటన లేకపోగా అనుమతించినట్లు కొన్ని వార్తలు వచ్చాయి. దుండగులు మిలిటరీ ప్రధాన కేంద్రం వెలుపలి నుంచే ప్రదర్శనగా వచ్చారని, అప్పుడు ఒక హెలికాప్టర్ ఎగిరిన శబ్దం వినిపించినట్లు, అనేక మంది పోలీసులు ప్రతి చోటా ఉన్నారని, అనేక రోడ్లను మూసివేశారని, తాము లూలాను వదిలించుకొనేందుకే వెళుతున్నట్లు, తమకు బోల్సనారో మద్దతు ఉందని దాడికి వెళ్లిన వారిలోని ఒక మహిళ చెప్పినట్లు లండన్ నుంచి వెలువడే గార్డియన్ విలేకరి కథనం. దుండగులకు బస్సులను సమకూర్చింది ఎవరన్నది కూడా విచారణ జరగనుంది.
వామపక్షాలు, ప్రగతిశీల శక్తులు ఎక్కడ అధికారంలోకి వచ్చినా కార్పొరేట్, సామ్రాజ్యవాద శక్తులు సహించలేవని... లాటిన్ అమెరికా లోనే కాదు...మన దేశంలోను జరుగుతున్న కుట్రలు, కుతంత్రాలు తెలియచేస్తున్నాయి.
ఎం. కోటేశ్వరరావు