
వామపక్షం రాకతో మనం మరో ''రాజకీయ శకం'' లోకి అడుగు పెట్టనున్నామా? అవును, వామపక్షం మళ్ళీ వచ్చింది. అయితే, ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, అది ఏ విధమైన వామపక్షం? ఎంతకాలం మనగలుగుతుంది? అనేది. ఇది అనేక విధాలా భిన్నమైన వామపక్షం. బొగోటా మాజీ మేయరు, ఆర్థికవేత్త అయిన 62 ఏళ్ల పెట్రో పర్యావరణ సవాళ్లను ఎదుర్కోవాలనే దానిలో మునిగివున్నాడు. భూమి నుంచి లభించే పెట్రోలియం, బొగ్గు లాంటి శిలాజ ఇంధనాలపై కొలంబియా ఆధార పడకూడదని... సహజ వాయువు, పెట్రోలియం వెలికితీతకు ఉపయోగించే ఫ్రాకింగ్ టెక్నిక్ వాడకూడదని, ఇంధన వాడకంలో మార్పులు జరగాలని ఆయన ఎజెండాలో ఉన్నది.
కొలంబియా నూతన అధ్యక్షుడు గుస్తావో పెట్రో ఎన్నిక గురించి అతిగా అంచనా వేయలేం. రెండు వందల సంవత్సరాల చరిత్రలో జనాభా రీత్యా మూడవ అతి పెద్ద లాటిన్ అమెరికా దేశమైన కొలంబియాలో వామపక్షం అధ్యక్ష భవనంలో అడుగు పెట్టడం ఇదే మొదటిసారి. దేశ చరిత్రలో మొట్టమొదటిసారి 58 శాతం ఓటర్లు పాల్గొని కోటి పది లక్షల ఓట్లు వేసిన అధ్యక్షుడు 'పెట్రో'నే. దేశం మొత్తంమీద అత్యధిక మంది ఈయన వైపే మొగ్గటం కీలకాంశం. మొట్టమొదటిసారి ఒక ఆఫ్రో-కొలంబియన్ మహిళ ఫ్రాంకియా మార్క్వెజ్ దేశ ఉపాధ్యక్షురాలిగా ఎన్నియ్యారు. ఆమె ప్రముఖ పర్యావరణ కార్యకర్త కూడా. ఆ దేశంలోని అత్యంత పేదలుండే ప్రాంతానికి చెందిన మహిళ ఆమె.
కొలంబియా గొప్ప చరిత్ర, అక్కడి వాస్తవికతలు లాటిన్ అమెరికాలో అతి గొప్ప నవలాకారుడు గాబ్రియెల్ గార్సియా మార్క్వెజ్‌కు నోబెల్ బహుమతి వచ్చేలా చేశాయి. లాటిన్ అమెరికా రంగుల లోకాన్ని మార్క్వెజ్ తన కాన్వాస్‌పై చూపారు. అలానే దేశాధ్యక్షుడుగా ఎన్నికైన పెట్రో గాథ కూడా. ఆయన పట్టణ ప్రాంత మాజీ గెరిల్లా యోధుడు. 1960 నుండి 2016 వరకు ప్రపంచంలో అత్యంత సుదీర్ఘ కాలం సాయుధ పోరాటం జరిగింది కొలంబియా లోనే. పెట్రో ముందున్న సవాళ్లు ఆ ప్రాంతం లోని మిగిలిన దేశాల్లో ఎన్నికైన పాలకులు ఎదుర్కొనే సమస్యల వంటివే! ఆగస్టు 7న ఆయన ప్రమాణస్వీకారం చేసిన వెంటనే ఆయన్ని ముసురుకునేవే!
కరోనా దుష్ఫలితాలే !
చిలీలో గాబ్రియల్ బోరిక్, హోండూరాస్‌లో జియోమాం కాస్ట్రో, బొలీవియాలో లూయిస్ అర్సె, పెరూలో పెడ్రో కాస్టిల్లోల విజయాల నేపథ్యంలో పెట్రో విజయాన్ని చూడాలి. దానికంటే ముందు మెక్సికోలో లోపెజ్ ఓబ్రడార్, అర్జెంటీనాలో అల్‌బర్టో ఫెర్నాండెజ్‌ల విజయాలు లాటిన్ అమెరికాలో పునరుద్థానం పొందుతున్న వామపక్షాల బలానికి నిదర్శనాలు. అక్టోబర్‌లో జరిగే ఎన్నికల్లో బ్రెజిల్‌లో లూలా గెలుస్తాడని ప్రస్తుతం సంకేతాలు వెలువడుతున్నాయి. దాంతో ఈ అల పరిపూర్ణమవుతుంది. వీరందరి విజయాలు కరోనా దెబ్బకి ఆ ప్రాంతం విలవిల్లాడిన ఫలితంగా సాధ్యమైంది. ప్రపంచం లోని మొత్తం మరణాల్లో 30 శాతం ఈ దేశాల్లోనే జరిగాయి. ఇది ప్రపంచ జనాభాలో 8 శాతం. కొన్ని దేశాల్లోని మితవాద ప్రభుత్వాలు మీడియాలో వచ్చేది తప్పు అని ఖండించడం తప్ప వారి ప్రజలకి మెరుగైన సేవలందించింది లేదు. దీనికి పెద్ద ఉదాహరణ బ్రెజిల్. బోల్సనారో హయాంలో సుమారు 7 లక్షల మరణాలతో మితవాద విధానాల అసలు స్వరూపాన్ని ప్రపంచానికి చూపింది.
దీన్నే యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ కమిషన్ ఫర్ లాటిన్ అమెరికా అండ్ కరీబియన్ (లిక్‌లాక్)...120 సంవత్సరాలలో ఈ ప్రాంతం చవిచూసిన అతి దారుణ సంక్షోభం అన్నది. 2020లో ఈ ప్రాంత దేశాల ఆర్థిక వ్యవస్థ 7 శాతం కుంచించుకుపోయింది. ఇది ప్రపంచ జిడిపి కంటే రెండు రెట్లు ఎక్కువ. ఈ ప్రాంతంలోని అత్యంత అభివృద్ధి చెందిన దేశమైన చిలీ 2022లో 1.4 శాతం, 2023లో 0.1 శాతం అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు. ఇది సంక్షోభ తీవ్రతకు అద్దం పడుతోంది. ఏమైనా ప్రస్తుత పరిణామాలు లాటిన్ అమెరికాలో మరో ''పింక్ అల''కు దారి తీస్తాయనిపిస్తోంది. ఇది ఈ శతాబ్దపు మొదటి దశకంలో జరిగిన పరిణామాలు రెండవ దశకంలో వెనక్కి తగ్గినా మళ్లీ పునరుద్ధానమొందేటట్లున్నాయి. 2003-13 మధ్య కొన్ని ప్రధాన సరుకుల ధరలు పెరగడంతో ప్రపంచంలోకెల్లా అంతరాలు విపరీతంగా ఉండే లాటిన్ అమెరికా ప్రాంతంలో సంపద పెరిగింది. పేద, ధనిక అంతరాలు కొంత తగ్గాయి. పేదరికం తగ్గింది. బ్రెజిల్, బొలీవియా, చిలీ, ఉరుగ్వే వంటి దేశాల్లో ప్రజల్ని పేదరికం లోంచి బయట పడేస్తూనే విత్త సంబంధమైన విధానాన్ని సరిగానే నిర్వహించవచ్చని రుజువు చేశారు ఆ దేశాల పాలకులు.
ఇది దక్షిణ అమెరికా దేశాల కూటమి ఏర్పాటు, కమ్యూనిటీ ఆఫ్ లాటిన్ అమెరికన్ అండ్ కరీబియన్ స్టేట్స్ (సెలాక్), పసిఫిక్ అలయన్స్ వంటి వాటి ఏర్పాటుకు దారితీసింది. దీనికి ఇరుసుగా ఉన్న త్రిమూర్తులు క్యూబా, వెనిజులా, చిలీల విదేశాంగ మంత్రులు 2012లో అనూహ్యమైన రీతిలో ఒక ప్రయత్నం చేశారు. ఇటు భారతదేశంతో, అటు చైనాతో చర్చలు జరిపారు.
బొగోటా ఎజెండా
రాబోయే సంవత్సరాలలో ఇటువంటి దానినే చూడబోతున్నమా? ఇంకో విధంగా చెప్పాలంటే, వామపక్షం రాకతో మనం మరో ''రాజకీయ శకం'' లోకి అడుగు పెట్టనున్నామా? ఔను, వామపక్షం మళ్ళీ వచ్చింది. అయితే, ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, అది ఏ విధమైన వామపక్షం? ఎంతకాలం మనగలుగుతుంది? అనేది. ఇది అనేక విధాలా భిన్నమైన వామపక్షం. బొగోటా మాజీ మేయరు, ఆర్థికవేత్త అయిన 62 ఏళ్ల పెట్రో పర్యావరణ సవాళ్లను ఎదుర్కోవాలనే దానిలో మునిగివున్నాడు. భూమి నుంచి లభించే పెట్రోలియం, బొగ్గు లాంటి శిలాజ ఇంధనాలపై కొలంబియా ఆధారపడకూడదని, సహజ వాయువు, పెట్రోలియం వెలికితీతకు ఉపయోగించే ఫ్రాకింగ్ టెక్నిక్ వాడకూడదని, ఇంధన వాడకంలో మార్పులు జరగాలని ఆయన ఎజెండాలో ఉన్నది. అయితే ఆ దేశం ఆర్థిక ఆదాయంలో 40 శాతం పెట్రోల్ ఎగుమతుల నుంచే వస్తుంది.
మరో లాటిన్ అమెరికా దేశమైన చిలీ నాయకుడు బోరిక్ లైంగిక సమానత్వం మీద (ఇతని కాబినెట్‌లో మగవారికన్నా మహిళా మంత్రులు ఎక్కువగా ఉన్నారు), అలాగే స్థానిక ప్రజల హక్కులు సాధించటం మీద దృష్టి కలిగి ఉన్నాడు. కేవలం 10 శాతం ప్రజలు దేశ ఆదాయంలో 60 శాతం పొందుతూ ఆర్థిక అసమానతలు అత్యధికంగా ఉన్న చిలీని యూరప్ దేశాలతో సమానమైన సంక్షేమ రాజ్యంగా తయారు చేయాల్సిన అవసరం ఉందని కూడా ఆయన గట్టిగా అభిప్రాయ పడుతున్నాడు. చిలీ కూడా కొలంబియా లాగ ఆదాయ పంపిణీలో అసమానతలు ఎక్కువగా ఉన్న దేశం.
హోండూరస్ సమస్యలు మరో రకమైనవి. హోండూరస్ మాజీ అధ్యక్షుడు జుయాన్ ఓర్లండో హెర్మాండెజ్ తన పాలనలో దేశాన్ని అమెరికా కింద వుండే మొట్టమొదటి మాదక ద్రవ్యాల దేశంగా తయారు చేశాడు. ప్రస్తుతం ఈ హెర్మాండెజ్ అమెరికాలో అరెస్టయి ఉన్నాడు. తనకు గత ప్రభుత్వం నుంచి సంక్రమించిన అవినీతి రాజ్య యంత్రాగాన్ని ధ్వంసంచేయటంలో, మత్తు పదార్థాల రవాణాతో కఠినంగా వ్యవహరించటంలో, ప్రపంచంలోనే ''హత్యల రాజధాని'' పేరు తెచ్చుకున్న హోండూరస్ లోని శాన్ పెడ్రో సులా పట్టణంలో హింసా దౌర్జన్యాలను నియంత్రించటంలో...కొత్తగా అధ్యక్ష పదవి చేపట్టిన జియోమరా కాస్ట్రో బిజీ అయిపోయాడు.
ఇవన్నీ ఇట్లా ఉండగా లాటిన్ అమెరికాకు అదనంగా కలిసి వచ్చిన అంశం గతంలో వామపక్షం వైపు మొగ్గు చూపిన ప్రభుత్వాల పాలన ఉండటం. 13 ఏళ్లు వర్కర్స్ పార్టీ బ్రెజిల్‌లో అధికారంలో ఉంది. అలాగే చిలీ వామపక్ష పార్టీ కాన్సర్టాసియన్ వరుసగా 20 ఏళ్లు అధికారంలో ఉంది. ఆ తరువాత సోషలిస్టు పార్టీ నాయకత్వాన రెండవసారి అధికారంలోకి వచ్చిన మిషెల్లి బాచిలెట్ తో కలిసి మరో నాలుగేళ్లు (2014-2018) అధికారంలో ఉంది. అర్జెంటీనాను వామపక్ష కిర్చినర్స్ 12 ఏళ్లు పాలించాడు. బొలీవియాలో ఇవో మొరేల్స్ 13 ఏళ్లు అధికారంలో ఉన్నాడు. ఈక్వెడార్‌లో రాఫెల్ కొర్రియా 10 ఏళ్లు, ఉరుగ్వేలో ఫ్రెంటె అంపిలో 2005-2020 వరకు అధికారంలో ఉన్నారు.
అయితే, ఇప్పుడున్నది ప్రత్యేక రాజకీయ వాతావరణం. ప్రభుత్వ వ్యతిరేకత అనే భావన రాజ్యమేలుతున్నది. కేవలం ఒకసారి అధికారంలో ఉండగానే ఆ ప్రభుత్వాల నిర్వాకాలవల్ల ''రాస్కెల్స్‌ను బయటికి నెట్టండి'' అనే ఆలోచన ప్రజలకు కలుగుతుంది.
చట్టసభలలో (చాలా సందర్భాలలో) మెజార్టీ లేక, తీవ్రమైన ఆర్థిక పరిమితులలో, అల్లకల్లోలంగా ఉన్న అంతర్జాతీయ వాతావరణంలో, ప్రజలకు ఉపయోగకరమైన సంస్కరణల కార్యక్రమాన్ని చేపట్టటానికి అధికారంలోకి రానున్న ప్రభుత్వాలలో రాజకీయ పార్టీల కలయిక అంత తేలికగా సాధ్యమయ్యేది కాదు.
కొత్తగా అధికారం లోకి వస్తున్న ప్రభుత్వాలు త్వరితగతిని అభివృద్ధి సాధించటానికిగాను బ్రెజిల్‌కు చెందిన లూలా తోనూ, చిలీకి చెందిన బోరిక్ తోనూ కలిసి పని చేయాలనే కోరికను పెట్రో వ్యక్తం చేశాడు. దక్షిణ అమెరికాలో ఒక రాజకీయ సమన్వయం ఏర్పాటుకు ఇది మొదటి అడుగు. అయితే, గతంలో ఏర్పడి విఫలమైన 'యూనియన్ ఆఫ్ సౌత్ అమెరికన్ నేషన్స్' నుంచి గుణపాఠాలు తీసుకోవటానికి ముందు ప్రాధాన్యత ఇవ్వాలి.
అలీన విదేశాంగ విధానం పట్ల మొగ్గు
రెండవ ప్రపంచ యుద్ధానంతరం తన వికృత రూపం ప్రదర్శిస్తున్న సమయంలో, 1950లలో జవహర్‌లాల్ నెహ్రూ ఆలోచనతో చురుకైన అలీన విదేశాంగ విధానాన్ని భారతదేశం అనుసరించింది. ఇప్పుడు 21వ శతాబ్దపు వాస్తవ పరిస్థితులకు ఆ విధానం అనుగుణంగా వుండటంతో ప్రభుత్వ విధానాలు నిర్ణయించే బృందాలలో అది అత్యంత ఆసక్తిని కలిగిస్తున్నది. అంతర్జాతీయ వ్యవస్థలు మార్పులకు లోనవుతున్న తరుణంలో, ప్రపంచ వ్యవహారాలలో ఈ ప్రాంతం తన ఉనికిని తక్షణమే పున:స్థాపించుకోవలసిన సందర్భంలో లాటిన్ అమెరికా దేశాలు తమ విదేశాంగ విధానాన్ని రూపొందించుకోవటంలో ఇది ఉపయోగకరమైన మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది.
జార్జ్ హీనీ బోస్టన్ యూనివర్సిటీ లోని పార్డీ స్కూల్ ఆఫ్ గ్లోబల్ స్టడీస్‌లో రీసెర్చ్ ప్రొఫెసర్. భారతదేశంలో చిలీ మాజీ రాయబారి
/ 'హిందూ' సౌజన్యంతో/
జార్జ్ హీనీ