Apr 26,2023 07:38

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పసుపు పంటను క్వింటాలు రూ.10 వేలు చేసి మొత్తం పంటనంతా కొనుగోలు చేయాలి. పసుపు బోర్డు ఏర్పాటు చేయాలి. విత్తన పరిశోధనా కేంద్రాన్ని గుంటూరు జిల్లాలో ఏర్పాటు చేసిన భూమిని బట్టి కుర్క్‌మెన్‌ శాతం ఎక్కువగా ఉండే విత్తనాన్ని అభివృద్ధి చేయాలి. పసుపు పంటను అభివృద్ధి చేసేందుకుగాను ప్రతి ఎకరాకు లక్ష రూపాయల ప్రోత్సాహక బహుమతి ఇవ్వాలి. ఎకరాకు లక్ష రూపాయల రుణం ఇవ్వాలి. విపత్తు వల్ల పసుపు పంట దెబ్బ తింటే ఎకరాకు రూ.రెండు లక్షలు పరిహారం ఇవ్వాలి. మార్కెట్లో ఈనామ్‌, ఈ-ఫారం పద్ధతులను తొలగించి పాత పద్ధతిలోనే పాటలు పెట్టే విధానాన్ని పునరుద్ధరించాలి. పసుపు ఆధారంగా పని చేసే కార్మికులకు పని భద్రతా చట్టం తీసుకురావాలి. అసంఘటిత కార్మిక సంక్షేమ బోర్డు చట్టాన్ని వీరికి వర్తింపజేయాలి.

త కొన్ని సంవత్సరాలుగా పసుపు పంట రైతులకు గిట్టుబాటు కావడం లేదు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో వేల ఎకరాల్లో పండే పంట ఈ ఏడాది ఐదువేల ఎకరాలకు పరిమితం అయింది. గతంలో పంటవేసిన రైతులు లాభాలు రావడంతో కొద్దిపాటి భూములను కొనుగోలు చేశారు. నేడు పంట వేసిన రైతులు నష్టం పెరిగి కొద్దిపాటిగా ఉన్న భూములను అమ్ము కుంటున్నారు. బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలంలో పసుపు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పంటల్లో కెల్లా ఖరీదైన పంట పసుపు. ఒక ఎకరా కౌలుతో సహా రూ.1.50 లక్షల నుండి రూ.1.60 లక్షల వరకూ ఖర్చవుతుంది. ఎకరాకు 25 క్వింటాళ్లు పండితే క్వింటా ఉత్పత్తి ఖర్చు రూ.6500 ఉంటుంది. 20 క్వింటాళ్లు పండితే ఉత్పత్తి ఖర్చు రూ.7500 ఉంటుంది. 15 క్వింటాళ్లు పండితే రూ.10,000 ఉంటుంది. కానీ మార్కెట్లో పసుపు పంట ఉత్పత్తి రేట్లు పెరుగుతున్నాయి. పొటాష్‌ రూ.1000 నుండి రూ.1700కు పెరిగింది. కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు ఖరీఫ్‌, రబీలో పెరిగాయి. 20-26 కాంప్లెక్స్‌ ఎరువు రూ.950 నుండి రూ.1450కి పెరిగింది. పురుగు మందుల ధరలు పెరిగాయి. పసుపు రేట్లు తగ్గాయి. 2023 జనవరి నాలుగున కొమ్ములు రూ.5525-6500 వరకూ ఉన్నాయి. అదే రోజు కాయ రూ.5000-5720 ధర పలికింది. జనవరి 19న కొమ్ములు రూ.5000 నుండి రూ.5825గాను, కాయ రూ.5000 నుండి రూ.5725గా పడ్డాయి. జనవరి 30న కొమ్ములు రూ.4600 నుండి రూ.5820గాను, కాయ రూ.4600-5850గాను ధర పలికింది. ఫిబ్రవరి 16న కొమ్ములు రూ.4700 నుండి రూ.5275 ధర పలికాయి. మార్చి 13న కొమ్ములు రూ.4700-5275 ధర వచ్చింది. ఏప్రిల్‌ 18న కొమ్ములకు రూ.4611 నుండి రూ.5280 ధర పలికాయి. కాయ రూ.4800 నుండి రూ.5050 దాకా రేట్లు పడ్డాయి. మొత్తంగా సగటు ధరలు రూ.5400 మించి రాలేదు. పసుపు ఉత్పత్తి ఖర్చులు, రేట్లు చూస్తే పసుపు రైతులు పెద్దఎత్తున నష్టపోతున్నారనేది వాస్తవం.
 

                                                 పసుపు పంటలో వస్తున్న మార్పులు

కొంతమంది వ్యాపార ప్రముఖులు వేస్తున్న అంచనాలను బట్టి గతంలో తమిళనాడు లోని ఈరోడ్‌, సేలం, చామరాజనగర్‌ మార్కెట్లలో 20 లక్షల బస్తాల నుండి ఈ ఏడాది పది లక్షల బస్తాలకు పంట తగ్గింది. పసుపు గిట్టుబాటుగాక చెరకు, కంద, పెండలం లాంటి పంటల మీదకు మళ్లారు. దుగ్గిరాల, కడప మార్కెట్లలో ఏడు ఎనిమిది లక్షల బస్తాలు వచ్చే పంట ఈఏడాది మూడు లక్షల బస్తాలకు తగ్గుతుందని అనుకుంటున్నారు. తెలంగాణలో నిజామాబాద్‌ మార్కెట్లో 15 లక్షల నుండి 16 లక్షల బస్తాలు వచ్చే పంట ఈ ఏడాది 10 లక్షల నుండి 11 లక్షలకు తగ్గుతుందని అనుకుంటున్నారు. వరంగల్‌, కె.సముద్రం మార్కెట్లలో నాలుగు లక్షల నుండి లక్ష బస్తాలకు తగ్గిందని తెలిసింది. మహారాష్ట్ర లోని సాంగ్లీ మార్కెట్లో 10 లక్షల నుండి 13 లక్షలకు పెరిగిందని అంచనా వేస్తున్నారు. మహారాష్ట్రలోని నాందేడ్‌, బస్మత్‌నగర్‌, హింగేరీ, ప్రాంతాల్లో గత నాలుగు సంవత్సరాలుగా పంట బాగా పెరిగి 25 లక్షల నుండి 30 లక్షల బస్తాలకు పెరిగిందని చెబుతున్నారు. అంటే పాత సాంప్రదాయ ప్రాంతాల్లో మహారాష్ట్రలో పంట బాగా పెరిగింది. మన ప్రాంతంలో పంట ఉత్పతి ఖర్చులు పెరగడం, కుర్క్‌మెన్‌ శాతం తక్కువగా ఉండటం వల్ల పసుపు రేట్లు తక్కువగా ఉన్నాయని, మహారాష్ట్ర ప్రాంతంలో ఉత్పత్తి ఖర్చులు తక్కువగానూ, కుర్క్‌మెన్‌ శాతం ఎక్కువగా ఉండటంతో అధికరేట్లు వచ్చి లాభాలు పొందుతున్నట్లు చెప్పుకుంటున్నారు. మన ప్రాంతంలోనూ సేలం రకం విత్తనానికి ఈ మాత్రం రేట్లయినా పడుతున్నాయి. దుగ్గిరాల యార్డులో ఏ మాత్రం పసుపు పంట గిట్టుబాటు కాకుండా ఉంది. ఆంధ్రాలో 2021-2022 సంవత్సరాల్లో పసుపుకు రేటు పెరుగుతుందనే పుకారు వచ్చినందున 83,700 ఎకరాల్లో పంట వేశారు. రేట్లు పెరగలేదు. పైగా నష్టపోయారు. 2022-2023లో 45 వేల ఎకరాల్లోనే పసుపు పంట వేశారు. వచ్చే ఏడాది ఈ మాత్రం కూడా పంటవేసే పరిస్థితి కానరావడం లేదు. ఇప్పటికే కొనుగోళ్లు జరగనందువల్ల పేద రైతులు రూ.4200 నుండి రూ.4300కు కల్లాల్లోనే అమ్ముకుంటున్నారు.
          గత పది సంవత్సరాలుగా రేట్లు గిట్టుబాటు గాక... గోడౌన్లలోను, ఇళ్ల వద్ద నిల్వబెట్టుకున్న పసుపు కొనుగోళ్లు జరగక... అలాగే ఉండిపోయింది. కొంతమంది రైతులు వారి సొంత పంటగాక రూ.పది లక్షలు అప్పులు తెచ్చి మరీ పసుపుకొని రేటు పెరుగుతుందని నిల్వబెట్టుకున్న వాళ్లు కూడా పూర్తిగా దెబ్బతినిపోయారు. బ్యాంకుల వారు జారీచేస్తున్న నోటీసులను చూసి బెంబేలెత్తిపోవడం లేదా ఆత్మహత్యలు చేసుకోవడం వంటి చర్యలకు దిగుతున్నారు. కొంతమందయితే మీరే పసుపు అమ్మేసుకోండి అని బ్యాంకర్ల ముందు చేతులెత్తేస్తున్నారు. పసుపు కొమ్ములు, కాయ కన్నా పసుపు పొడి వ్యాపారం భారీగా పెరిగింది. దుగ్గిరాలలో కిలో పసుపు రూ.100 నుండి రూ.120కి తయారవుతుందనుకుంటే పెద్దపెద్ద మాల్స్‌కు కిలో రూ.250 వేసి అమ్ముకుంటున్నారు. పసుపు రోగ నిరోధక శక్తి బలంగా ఉన్న పంట. ఆంధ్ర ప్రాంతంలో ప్రతి ఇంట్లోనూ పుసుపు నిల్వ ఉంటుంది. దీని ద్వారా ఫార్మా కంపెనీలు కొన్ని రకాల క్రీములు, సబ్బులు, టూత్‌పేస్టులను తయారు చేస్తున్నారు. పసుపు మీద వ్యాపారం చేసే ఎరువుల కొట్లు, పురుగు మందుల షాపులు, డీజిల్‌ పెట్రోలు కంపెనీలు, పసుపు కొనుగోలు చేసిన వ్యాపారులంతా ఆర్థికంగా స్థిరపడుతున్నారు. రైతు మాత్రం హారతి కర్పూరంలా కరిగిపోతున్నాడు.
 

                                                         పసుపు రైతును ఆదుకోవాలి

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పసుపు పంటను క్వింటాలు రూ.10 వేలు చేసి మొత్తం పంటనంతా కొనుగోలు చేయాలి. పసుపు బోర్డు ఏర్పాటు చేయాలి. విత్తన పరిశోధనా కేంద్రాన్ని గుంటూరు జిల్లాలో ఏర్పాటు చేసిన భూమిని బట్టి కుర్క్‌మెన్‌ శాతం ఎక్కువగా ఉండే విత్తనాన్ని అభివృద్ధి చేయాలి. పసుపు పంటను అభివృద్ధి చేసేందుకుగాను ప్రతి ఎకరాకు లక్ష రూపాయల ప్రోత్సాహక బహుమతి ఇవ్వాలి. ఎకరాకు లక్ష రూపాయల రుణం ఇవ్వాలి. విపత్తు వల్ల పసుపు పంట దెబ్బ తింటే ఎకరాకు రూ.రెండు లక్షలు పరిహారం ఇవ్వాలి. మార్కెట్లో ఈనామ్‌, ఈ-ఫారం పద్ధతులను తొలగించి పాత పద్ధతిలోనే పాటలు పెట్టే విధానాన్ని పునరుద్ధరించాలి. పసుపు ఆధారంగా పని చేసే కార్మికులకు పని భద్రతా చట్టం తీసుకురావాలి. అసంఘటిత కార్మిక సంక్షేమ బోర్డు చట్టాన్ని వీరికి వర్తింపజేయాలి. తయారయ్యే ప్రతి వస్తువు నుండి వచ్చే పన్నుల్లో సగం రైతుకే కేటాయించాలి. 2023 మార్చి ఆఖరు వరకు పసుపు రైతుల బకాయిలన్నిటినీ ఒకేసారి రద్దుచేయాలి. ఇతర పంటల రైతులను కూడా దృష్టిలో వుంచుకొని ఎరువులు, పురుగు మందులపై జిఎస్‌టి రద్దు చేయాలి.
పసుపు రైతులు ఇతర పంటలు కూడా వేస్తుంటారు. పసుపు, ఇతర పంటలు గిట్టుబాటు ధరలకోసం రైతులందరూ ఏకం కావాలి.

(వ్యాసకర్త రైతు సంఘం గుంటూరు జిల్లా కమిటీ సభ్యులు)
వల్లభనేని సాంబశివరావు

వల్లభనేని సాంబశివరావు