Mar 26,2023 07:31

అవ్వా.. ఇగ నాతోటి కాదే..
మన దగ్గరున్న పైసలతోటి..
పాత పుస్తకాలు కొనుకుంటం కానీ..
గా పరీక్ష పేపర్లు కొనలేమే..

గిట్ల ఓడిపోయిన మోకంను..
నీకెట్లా సుపెట్టనే...
నేను సర్కారీ కొలువు కొడతనని
కోటి ఆశలతోటి ఉన్నవు..
గిప్పుడు నీ ఆశ తీర్చలేనే..
ముప్పై సవంత్సరాలుగా
నీ రెక్కల కట్టాన్ని..
నీ సెముట.. నెత్తురును..
నా సదువుకై.. కొలువుకై దారపోసినవ్‌..

ఇంకొన్ని యేండ్లు నేనుగిట్లనే
సదువుకుంట సస్తే..
నువ్వేమో నాకోసం
పనిజేసుకుంట సస్తవేమో..
మన ఇద్దరి మధ్యన
సంబుర గడియలే లేకుండా
చేసెలెక్క ఉన్నదే
గీ మాయదారి పాలనా...

ఎట్లైతే గట్లయే.. అవ్వా...
నా పుస్తకాల ముల్లే..
నా పాత బట్టల సంచి..
అన్ని సదురుకొని బైల్లెల్లుతవ్వా...
అవ్వా..నేను ఊళ్లే బస్సేక్కత్తనని..

ఎదురుసుడకవ్వా..
ఊళ్లే బస్సు ఎక్కేందుకు..
నా తాన పైసల్గిట్ల లేవవ్వా..
నువ్‌ పంపిన పించన్‌ పైసలతోటి
మానవ చరత్రలో మరో పుస్తకం
వచ్చిందంటే కొనుకున్ననవ్వా..
గిప్పుడది కూడా ఉల్లిగడ్డకేసుడే..

ఒక్కపూటనన్న ఇద్దరం కలిసి
ఉల్లిగడ్డల పులుసుతోటి
కడుపునిండా తిందమవ్వా..
అవ్వా నన్ను క్షమించు..
ఓడిపోయి.. నిరుద్యోగినై
మళ్ళీ నీ ఒడిలో నిదురించనికి వస్తున్నా..

సురేష్‌ నూనేటి
96764 57297