Nov 02,2022 07:06

హకార వ్యవసాయ పరపతి రంగంలో ఇప్పటి వరకూ రైతులే వాటాదారులు. రైతు ప్రతినిధులే ప్రాథమిక సహకార సంఘం స్థాయి నుండి ఆప్కాబ్‌ స్థాయి వరకు మేనేజ్‌మెంట్‌ కమిటీలలో వున్నారు. ఇవి మూడు దొంతరలుగా (ప్రాథమిక సహకార సంఘాలు, డిసిసిబి లు, ఆప్కాబ్‌ లు) వున్నాయి. ఇవన్నీ ఇప్పుడు రైతుల చేతుల్లో నుండి ప్రయివేటు వ్యక్తుల చేతుల్లోకి పోయేందుకు జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బయట ఎటువంటి చర్చ లేకుండా రైతులు, ఇతర లబ్ధిదారుల అభిప్రాయాలతో నిమిత్తం లేకుండా సెప్టెంబరు 19న అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టింది.
     చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు, సహకార రంగంలో సంస్కరణలు ప్రవేశపెట్టి వాటిని మూసివేయటమో, ప్రైవేటీకరించటమో, సైజు తగ్గించటమో చేసింది. ఆల్విన్‌ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలు కనుమరుగైనాయి. సహకార రంగంలో చక్కెర, స్పిన్నింగ్‌, ఆయిల్‌ మిల్లులు ప్రయివేటీకరించబడ్డాయి. లేదా మూతబడ్డాయి. పాల సహకార రంగం ప్రయివేటు కంపెనీల స్థాయికి దిగజారింది. ఈ అన్ని రంగాలలో ఫెడరేషన్లు మటుమాయమయ్యాయి. టిడిపి, కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ప్రాథమిక సహకార సంఘాల సంఖ్యను తగ్గించాయి.
        వై.ఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ సహకార సంఘాల చట్టానికి సవరణ చేసింది. జిల్లాలో వున్న సంఘాలన్నిటికీ ఒకే డిసిసిబి ఫెడరేటింగ్‌ బాడీగా వుంది. డిసిసిబిలకు రాష్ట్ర స్థాయిలో ఫెడరేషన్‌గా ఆప్కాబ్‌ వుంది. రాజశేఖరరెడ్డి ప్రభుత్వం సహకార చట్టంలో చేర్చిన 115 'డి' ప్రకారం సొసైటీలన్నీ ఒకే ఫెడరేషన్‌గా ఉండనక్కరలేదు. విడిపోయి ఎన్ని ఫెడరేషన్లయినా పెట్టుకోవచ్చు. అయినా వ్యవసాయ పరపతి సహకార రంగం విచ్ఛిన్నం కాకుండా ఇంకా ఐక్యంగా నిలబడింది. ఈ ఐక్యతను ఇపుడు విచ్ఛిన్నం చేసేందుకు వైసిపి ప్రభుత్వం పూనుకుంది. రాష్ట్ర జాబితాలో వున్న సహకార రంగాన్ని తన చెప్పుచేతల్లోకి తెచ్చుకునేందుకు మోడీ ప్రభుత్వం ఏకంగా సహకార రంగానికి కేంద్ర మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది. దానికి అమిత్‌షాను మంత్రిని చేసింది. కేంద్ర బిజెపి ప్రభుత్వం తలపెట్టిన ప్రయివేటీకరణ సంస్కరణలను వైసిపి ప్రభుత్వం విద్యుత్తు, విద్యా రంగాలలో ముందస్తుగా అమలు చేస్తోంది. సహకార రంగాన్ని కూడా మోడీ ప్రభుత్వం ఆశించిన స్థాయిలో ప్రయివేటు వ్యక్తుల చేతుల్లో జగన్‌ ప్రభుత్వం పెడుతోంది.
      సహకార సంఘాల చట్టం-1964కు సవరణలు చేస్తూ అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బిల్లులో ఈ కింది అంశాలు ప్రధానంగా వున్నాయి. వ్యవసాయ పరపతి సహకార రంగాన్ని అధ్యయనం చేసి సిఫార్సులు చేయాల్సిందిగా నాబార్డు కన్సల్టెన్సీ సర్వీసెన్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ను వైసిపి ప్రభుత్వం కోరింది. తను కోరుకున్న విధంగా సిఫార్సులు చేయించుకుని బిల్లు పెట్టింది.
 

                                                                         ప్రమాదకర సవరణలు

సహకార వ్యవసాయ పరపతి సంఘాలలో 50 శాతం వాటాల లోకి ప్రయివేటు వ్యక్తులు, కంపెనీలు, సంస్థలు, చిట్‌ఫండ్స్‌, మ్యాచువల్‌ ఫండ్స్‌ వంటి నిధులు కలిగిన సంస్థలు పెట్టుబడులు పెడతాయి. కనీసం 50 లక్షలు మరియు ఆపైన 50 శాతం వరకు పెట్టుబడులు పెట్టవచ్చు. అంతకు మించి సొసైటీలో పెట్టదల్చుకుంటే గ్రాంట్ల రూపంలో ఇవ్వొచ్చు. దీని ప్రభావం చాలా తీవ్రంగా వుంటుంది. 50 శాతం పెట్టుబడుల మేరకు ప్రయివేటు వ్యక్తులకు ఓటింగ్‌ హక్కులు కూడా దఖలు పడతాయి. దీంతో మిగతా విషయాలు ఏం చెప్పుకున్నప్పటికీ, లాభాల కోసమే ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు పెట్టుబడులు పెడతాయని అందరికీ తెలిసిన విషయమే. ఆ లాభాల సంపాదన కోసమేనని సవరణలో స్పష్టంగా పేర్కొన్నారు.
          మొదటి సారిగా 'రైతు భరోసా కేంద్రం' అంటే ఏమిటో చెప్తూ నిర్వచనాన్ని చట్టంలో చేర్చారు. రైతు భరోసా కేంద్రాలు సహకార సంఘాలు, డిసిసిబి లలో విలీనం కానున్నాయి. దీనికి ప్రత్యేకించి చట్టంలో 115 'ఇ' అధ్యాయాన్ని చేర్చారు. రైతు భరోసా కేంద్రాల విలీనానికి అవసరమైన మార్గదర్శకాలను సహకార రిజిస్ట్రార్‌ జారీ చేస్తారు. సహకార వ్యవసాయ పరపతి సంఘాలు అందించే రుణ, రుణేతర వ్యాపారాలతో పాటు, రైతు భరోసా కేంద్రాల్లో రైతులతో చేసే వ్యాపారం కూడా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి చేరుతుంది. ధాన్య సేకరణ కూడా ప్రైవేటువారి హస్తగతమే అవుతుంది. ధాన్య సేకరణను ప్రైవేటు పెట్టుబడులకు అప్పజెప్తామనే మోడీ ప్రభుత్వ విధానాన్ని జగన్‌ ప్రభుత్వం ఆచరణలో పెడుతోంది.
            మెజారిటీ ఓటింగ్‌ హక్కులు కూడా ప్రయివేటు వ్యక్తులు, కంపెనీల చేతుల్లోకి పోతాయి. ప్రయివేటు కంపెనీలు పెట్టిన 50 శాతం పెట్టుబడులకు 50 శాతం ఓటింగ్‌ హక్కులు వస్తాయి. సహకార వ్యవసాయ పరపతి రంగం దొంతరలు- ప్రాథమిక సంఘాలు, డిసిసిబి, ఆప్కాబ్‌-యావత్తు ప్రైవేటు కంపెనీల హస్తగతం అవుతుంది. ఈ అన్ని స్థాయిలలోకి 50 శాతం ప్రయివేటు పెట్టుబడికి తగ్గ ఓటింగ్‌ హక్కులకు అదనంగా, మరికొంత మంది ప్రైవేటు వ్యక్తులు పూర్తి ఓటింగ్‌ హక్కులతో వృత్తి నిపుణుల రూపంలో సొసైటీల మేనేజింగ్‌ కమిటీలలోకి ప్రవేశిస్తారు. ఫైనాన్సింగ్‌ బ్యాంకు ప్రతినిధులు కూడా పూర్తి ఓటింగ్‌ హక్కులతో మేనేజింగ్‌ కమిటీలలోకి వస్తారు. రైతులు మూలవాసుల స్థాయికి దిగజారి ఒక మూలకు నెట్టబడతారు. వీటన్నిటికి అవసరమైన సవరణలు బిల్లులో చోటుచేసుకున్నాయి.
            ఇటీవల కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి రాష్ట్రంలో పర్యటించిన సమయంలో ప్రతి గ్రామంలోనూ రైతు సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. మరోపక్క కేంద్ర సహకార మంత్రి అమిత్‌షా సహకార సంఘాలను ప్రతి గ్రామానికి విస్తరిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వ మనసెరిగిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ లక్ష్యాలకు తగిన ఏర్పాట్లను ముందుగానే చేస్తోంది.
            మ్యాక్స్‌ ప్రయివేటు సొసైటీలు, బ్యాంకుల స్థాయికి సహకార వ్యవసాయ పరపతి రంగం దిగజారబోతోంది. ఒకసారి ఈ స్థాయికి వచ్చిన తరువాత వాటి రూపురేఖలు మరింతగా మార్చుకునే విధంగా 115 'డి' అధ్యాయాన్ని అంతకు ముందే చట్టంలో చేర్చారు. ప్రయివేటు సొసైటీలు రుణాల మీద వేసే వడ్డీ రేట్లు రైతుల మాడు పగలగొడతాయి.
          సమావేశాలు జరిగిన ఆఖరు రోజున అసెంబ్లీ లోనూ, కౌన్సిల్‌ లోనూ ఎటువంటి చర్చా లేకుండా సహకార చట్టానికి చేసిన సవరణల బిల్లు పాసయింది. కౌన్సిల్‌ పిడిఎఫ్‌ ఎమ్మెల్సీలు ఈ బిల్లును వ్యతిరేకిద్దామని నిర్ణయించుకుని దానికి తగ్గట్టుగా సమాయత్తమయ్యారు. కానీ ఇటువంటి రైతు వ్యతిరేక బిల్లులను కూడా పట్టించుకోకుండా తెలుగుదేశం ప్రతినిధులు ఇతర అప్రాధాన్యతా అంశాలపై గొడవ లేపారు. ఈ గొడవ మధ్య జగన్‌ ప్రభుత్వం బిల్లు పాస్‌ చేసింది.
            ప్రజా వ్యతిరేక మోడీ ప్రభుత్వ ఆదేశాలకు తగిన విధంగా రాష్ట్ర వైసిపి ప్రభుత్వ విధానాలు ఉన్నాయి. ప్రతిపక్షంలో ఉన్న టిడిపి ఇటువంటి రైతు వ్యతిరేక, ప్రజా వ్యతిరేక సంస్కరణలకు సూత్రధారి కాబట్టి వీటిని వ్యతిరేకిస్తుందని ఎవరూ ఊహించరు కూడా. రైతు సంఘాలు, ఉద్యోగ సంఘాలు సహకార చట్టానికి చేసిన సవరణల పైనే కాకుండా... విద్యుత్తు, విద్యా రంగాలలో కూడా వైసిపి, మోడీ ప్రభుత్వాలు తీసుకొస్తున్న సంస్కరణలకు, ప్రజలపై మోపుతున్న భారాలకు వ్యతిరేకంగా ఇతర ప్రజా సంఘాలను కూడా కలుపుకొని ఐక్యంగా పోరాడాలి.

(వ్యాసకర్త : సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు)
పి. అజయ కుమార్‌

పి. అజయ కుమార్‌