- కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి రూ.8,406 కోట్లు
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : విశాఖపట్నంలో రైల్వే హెడ్ క్వార్టర్స్‌కు సంబంధించిన డిజైన్లు ఖరారయ్యాయని, త్వరలో పనులు ప్రారంభించనున్నట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో దక్షిణ మధ్య రైల్వేకు రూ.13,786 కోట్లు కేటాయించగా, అందులో ఆంధ్రప్రదేశ్‌కు రూ.8,406 కోట్లు కేటాయించామన్నారు. రైల్వే బడ్జెట్ గురించి ఢిల్లీ నుంచి ఆన్‌లైన్‌లో శుక్రవారం మీడియాతో మాట్లాడారు.
గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 65 శాతం నిధులు అత్యధికంగా కేటాయించినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 72 రైల్వే స్టేషన్లలో ప్రపంచస్థాయి మౌలిక వసతులు కల్పించేందుకు రైల్వేశాఖ చర్యలు చేపట్టినట్లు వెల్ల డించారు. విశాఖపట్నం- సికింద్రాబాద్ మధ్య వందే భారత్ రైలుకు 120 శాతం ఆక్యుపెన్సీ రేటు ఉందన్నారు. విజయవాడ డిఆర్‌ఎం శివేంద్రమోహన్ మాట్లాడుతూ.. ఎపి, తెలంగాణకు (ఎస్‌సిఆర్ రైల్వేస్) రూ.4,418 కోట్లు ప్రధాని కేటాయించారని, రైల్వే బ్రిడ్జిలు, అండర్‌పాస్‌లు అవసరమైన చోట నిర్మిస్తున్నామని, ప్రయాణికుల రోజువారీ అవసరాల కొనుగోళ్ల కోసం రైల్వే స్టేషన్లలో దుకాణాలను ఏర్పాటు చేయబోతున్నట్లు ఆయన తెలిపారు. దేశంలో హైడ్రోజన్ రైలు కూడా అభివృద్ధి చెందుతోందని, రెండు నగరాల మధ్య 60 నుంచి 70 కిలోమీటర్ల దూరంతో వందే భారత్ మెట్రోకు ప్లాన్ చేయబోతున్నట్లు పేర్కొన్నారు.











