Nov 17,2022 06:33

ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరడం మానవాళి చరిత్రలో ఓ మైలురాయి. భూగోళం మీద జీవం ఉనికి ప్రారంభమైనప్పటి నుండి ఈ స్థాయిలో పురోగతి సాధించిన మరో జీవి లేదనడం అతిశయోక్తి కాదు. జంతువుల్లో జంతువుగా మనుగడ కోసం పోరాడిన స్థితి నుండి బుద్ధిజీవిగా మారేంత వరకు మానవజాతి సాగించిన ఈ ప్రయాణం అనితర సాధ్యం! ఈ క్రమంలోనే భూగోళమంతా మనుషులు విస్తరించారు. భిన్న వాతావరణ పరిస్థితులను, ప్రకృతి వైపరీత్యాలను ఎదర్కుని నిలిచారు. అయితే, ఈ విస్తరణ భూగోళమంతా ఒకే మాదిరి జరగలేదు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా జరిగింది. మనుగడ పోరాటంలో భాగంగా మనిషి సాగించిన వలసలూ జనాభా సంఖ్యను ప్రభావితం చేశాయి. నాగరికత పెరిగిన తరువాత, మానవ జీవితంలో లాభ, నష్టాల లెక్కలు అడుగుపెట్టిన తరువాత పేదరికం కూడా కుటుంబాలలో సభ్యుల సంఖ్యను ప్రభావితం చేసింది. సంతానం ఎక్కువుంటే సంపాదించే వారి సంఖ్య పెరుగుతుందని అనుకోవడం ఇప్పటికీ వింటూనే ఉంటాం. ఐక్యరాజ్య సమితి తాజాగా విడుదల చేసిన నివేదిక కూడా ఇదే విషయాన్ని చెబుతోంది. పేద దేశాల్లో జనాభా గరిష్ట స్థాయిలో పెరుగుతూ ఉంటే, ధనిక దేశాల్లో దీనికి భిన్నమైన స్థితి! 800 కోట్ల జనాభాలో ఆసియా, ఆఫ్రికా దేశాలదే సింహభాగం. దానిలోనూ మన దేశానిదే పైచేయి. గడిచిన పన్నెండేళ్లలో భారత్‌లో 17.7 కోట్ల మంది పెరగగా, చైనాలో 7.3 కోట్ల మంది పెరిగారని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. ఇదే ఊపులో మరో ఏడాదికి జనాభాలో చైనాను అధిగమించి మన దేశం మొదటి స్థానంలో నిలవనుంది. 2050 నాటికి 170 కోట్ల జనాభాతో భారత్‌ తొలి స్థానానికి, అదే సమయంలో చైనా జనాభా 130 కోట్లకు పరిమితం కానుందని అంచనా! ప్రపంచ జనాభా 2037 నాటికి 900 కోట్లకు, 2058 నాటికి వెయ్యి కోట్లకు, 2080 నాటికి 1400 కోట్లకు చేరుతుందని భావిస్తున్నారు.
జనాభా ఈ స్థాయికి చేరుకోవడం మానవాళికి వరమా..శాపమా? ప్రభుత్వాలు ఎటువంటి విధానాలు అవలంభించాలన్నది చర్చనీయాంశంగా మారింది. జనాభా విస్ఫోటనం ఒకప్పుడు తీవ్ర ఆందోళన కలిగించే అంశం. ఇప్పుడూ ఆ పరిస్థితి ఉందా అంటే జవాబు చెప్పడం కష్టం. భూగోళాన్ని యూనిట్‌గా తీసుకుని చూస్తే జనాభా పెరగుతోందన్నది ఒక వాస్తవం! అయితే, అన్ని దేశాలకూ ఇది ఒకేమాదిరి వర్తించదు. పొరుగు దేశమైన చైనానే దీనికి ఉదాహరణ! ఒకప్పుడు వన్‌ ఆర్‌ నన్‌ నినాదం ఇచ్చిన ఆ దేశ ప్రభుత్వం ఇప్పుడు ఒకరు, లేదా ఇద్దరు అంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. కొన్ని దేశాల్లో పిల్లలను ఎక్కువగా కనేవారికి అక్కడి ప్రభుత్వాలు అనేక రాయితీలు కల్పిస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మన దేశంలో యువకుల సంఖ్య అత్యధికంగా ఉంది. మరో యాభై ఏళ్ళ తరువాత ఇదే స్థితి ఉంటుందన్న గ్యారంటీ లేదు. మన దేశంలో ఒకప్పుడు సంతానోత్పత్తి రేటు 5కు పైగా ఉండగా, ఇప్పుడది 2.2కు తగ్గింది. చైనాలో ఇది 1.7గా ఉంది. భారత్‌, చైనాలలోనే కాదు. ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇదే విధమైన ధోరణి కనపడుతోంది. 1963లో సగటున 5.3గా సంతానోత్పత్తి రేటు ఉండగా 1990కి 3.3కు 2020కి 2.3కు తగ్గింది.
'ప్రపంచం మన అవసరాలకు సరిపడినంతా ఉంది. కానీ, మన అత్యాశకు సరిపడినంత కాదు' అన్న మహాత్మాగాంధీ మాటలు ఇక్కడ ప్రస్తావనార్హం. పెట్టుబడిదారీ విధానం అనివార్యంగా పెంచి పోషించే అసమానతలు పేదరికంలోనే కాదు, జనాభా విస్తరణలోనూ ప్రస్ఫుటమౌతాయి. దేశాల వలస విధానాలు వారి ప్రయోజనాల కోసమే రూపొందుతాయి. పేద దేశాల్లో పెరుగుతున్న జనాభానే పెట్టుబడిదారులు ముడిసరుకుగా మార్చుకుంటారు. సమస్త భూగోళాన్ని, ప్రకృతిని దోచుకుంటూ లాభాల పంట పండిస్తారు. హద్దుల్లేని ఈ దోపిడి మానవాళితో పాటు సమస్త జీవరాశి ఉనికినే ప్రమాదంలో పడేస్తున్నా వారి వైఖరిలో మార్పేమీ ఉండదు. పెట్టుబడిదారీ విధానానికి ప్రత్యామ్నాయంగా వచ్చే సోషలిస్టు సమాజంలో దోపిడి ఉండదు. అంతరాలు మాయమవుతాయి కాబట్టి బతుకు భయం ఉండదు. పిల్లలను కనాలా..వద్దా అన్నది భార్యాభర్తలే నిర్ణయించుకుంటారు. అటువంటి సమాజమే జనాభా సమస్యకు స్థిరమైన పరిష్కారాన్ని చూపుతుంది.